Share News

Guntur: రాజ్‌ కాళహస్తికి అరుదైన గౌరవం

ABN , Publish Date - Aug 30 , 2025 | 05:19 AM

బల్ద్‌విన్‌ గ్రూప్‌ చీఫ్‌ డిజిటల్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌, గుంటూరు జిల్లాకు చెందిన రాజశేఖర్‌ కాళహస్తికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో ప్రతిష్ఠాత్మక నేషనల్‌ ఆర్బీ అవార్డు ఈ తెలుగుతేజాన్ని వరించింది.

Guntur: రాజ్‌ కాళహస్తికి అరుదైన గౌరవం

  • అమెరికాలో నేషనల్‌ ఆర్బీ అవార్డుకు ఎంపిక

  • గుంటూరుకు జిల్లా వాసికి ప్రతిష్ఠాత్మక అవార్డు

  • త్వరలో అమరావతిలో టెక్‌ సేవలు: రాజ్‌

గుంటూరు, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): బల్ద్‌విన్‌ గ్రూప్‌ చీఫ్‌ డిజిటల్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌, గుంటూరు జిల్లాకు చెందిన రాజశేఖర్‌ కాళహస్తికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో ప్రతిష్ఠాత్మక నేషనల్‌ ఆర్బీ అవార్డు ఈ తెలుగుతేజాన్ని వరించింది. అమెరికాలో ఎంతో ప్రతిభ కనబర్చిన సీఈవోలు, టెక్‌ లీడర్లను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో రాజశేఖర్‌ (రాజ్‌) 2025 ఏడాదికిగానూ లార్జ్‌ కార్పొరేట్‌ విభాగంలో ఆర్బీ అవార్డును అందుకున్నారు. గుంటూరు జిల్లాలో రిటైర్డ్‌ ఏఎస్పీ, విశ్రాంత పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ కుమారుడైన రాజశేఖర్‌.. అమెరికాలోని బల్ద్‌విన్‌ గ్రూప్‌ చీఫ్‌ డిజిటల్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బల్ద్‌విన్‌ గ్రూపు 1.4 బిలియన్‌ డాలర్ల సంస్థగా ఎదగడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. దాదాపు 35 ఇతర సంస్థలను కొనుగోలు చేయడమే కాకుండా, కంపెనీలో డిజిటల్‌ టెక్నాలజీని విస్తరంచడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. గతంలో సిటీ గ్రూపు, హెచ్‌ఎ్‌సపీసీ, జీఈ తదితర సంస్థల్లో ఆయన ఉన్నత హోదాల్లో పని చేశారు. గుంటూరులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజశేఖర్‌ తనకు అవార్డు వచ్చిన విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఏఐ, క్లౌడ్‌ టెక్నాలజీలను విస్తృతంగా వినియోగించాల్సి వస్తుందన్నారు. యువత కూడా సాంకేతికతను అందిపుచ్చుకుని నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో రాజధాని అమరావతిలో కూడా టెక్నాలజీ సేవల కోసం ఇతర కంపెనీలతో ఒప్పందం చేసుకొనే ఆలోచన చేస్తున్నామని, యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పుకొచ్చారు.

Updated Date - Aug 30 , 2025 | 05:20 AM