Guntur Collector: ఈ.కొలితోనే డయేరియా విజృంభణ
ABN , Publish Date - Sep 25 , 2025 | 07:25 AM
డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన వ్యాఽధి నివారణ చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు
పానీపూరి, తినుబండారాల విక్రయాలపై నిషేధం: గుంటూరు కలెక్టర్
గుంటూరు మెడికల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన వ్యాఽధి నివారణ చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బుధవారం గుంటూరు నగర పరిధిలోని డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డీఎంహెచ్‌వో విజయలక్ష్మితో కలిసి కలెక్టర్ పర్యటించారు. హ్యాండ్‌వాష్, లైఫ్‌బాయ్, ఓఆర్‌ఎస్, ఫినాయిల్‌తో కూడిన వెయ్యి కిట్లను స్థానికులకు అందజేశారు. రోగులకు ప్రథమ చికిత్స చేసేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ మెడికల్ వ్యాన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అతిసారం తగ్గేంత వరకు నగరంలో పానీ పూరి, తోపుడు బండ్లపై తినుబండారాల విక్రయాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కలిపి బుధవారం వరకు 11 కలరా కేసులు నమోదయ్యాయి. వీరిలో అంగలకుదురుకు చెందిన మహిళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా, ఏడుగురు మంగళగిరిలోని ఎయిమ్స్‌లో, ముగ్గురు గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 132 స్టూల్ శాంపిల్స్‌ను జీఎంసీ మైక్రోబయాలజీ ల్యాబ్‌లో పరీక్షించగా, మూడు విబ్రియో కలరే బ్యాక్టీరియా, 20 ఈ.కొలి బ్యాక్టీరియా, ఒక షిగెల్లా బ్యాక్టీరియా పాజిటివ్‌గా నివేదికలు వచ్చాయి. జిల్లాలో నెలకొన్న కలరా, డయేరియా పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌ఎంపీ, పీఎంపీ, గ్రామీణ వైద్యులు రోగులకు యాంటీబయోటిక్ మందులు వాడటం, సెలైన్ పెట్టడం వంటివి చేయొద్దని, అతిసారంతో వచ్చే రోగుల వివరాలను తమకు తెలియజేయాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. ఆర్‌ఎంపీ సంఘం నేతలను బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయానికి పిలిపించి, పరిధికి మించిన వైద్యం చేసి మరిన్ని సమస్యలు సృష్టించవద్దని హెచ్చరించారు.