Visakhapatnam: విశాఖలో తుపాకీ కాల్పుల కలకలం
ABN , Publish Date - Aug 19 , 2025 | 06:24 AM
విశాఖ వన్‌టౌన్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. తూటా తగిలి గాయపడిన యువకుడు ఆస్పత్రిపాలయ్యా డు.
బొగ్గు దొంగతనాలకు పాల్పడే ఇరువర్గాల మధ్య పాతకక్షలు
కాల్పుల్లో ఒకరికి తీవ్ర గాయాలు, కేజీహెచ్‌కు తరలింపు
ఘటన వెనుక మాజీ పోలీసు కానిస్టేబుల్ ఉన్నట్లు అనుమానం
పోలీసుల అదుపులో నిందితులు?
మహారాణిపేట (విశాఖపట్నం), ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): విశాఖ వన్‌టౌన్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. తూటా తగిలి గాయపడిన యువకుడు ఆస్పత్రిపాలయ్యా డు. ఈ ఘటన వెనుక మాజీ కానిస్టేబుల్ హస్తమున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలివీ.. వన్‌టౌన్ ప్రాంతానికి చేపల రాజేష్, వాసుపల్లి నరేష్ స్నేహితులు. గోడ నూకరాజు, జంపా దిలీప్ మరో వర్గం. వీరంతా బొగ్గు దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు.ఇరువర్గాల మధ్య పాత కక్షలున్నాయి.ఆదివారం రాత్రి పది గంటల సమయంలో నలుగురూ వన్‌టౌన్‌లోని చిలకపేట వద్ద కూర్చుని మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి రాజేష్‌పై నూకరాజు కత్తితో దాడికి యత్నించాడు. రాజేష్ ఆ కత్తి లాక్కుని నూకరాజుపై ప్రతిదాడికి యత్నించగా నూకరాజు పారిపోయాడు. మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో నలుగురూ అదే ప్రదేశానికి చేరుకున్నారు.ఈసారి నూకరాజు తుపాకీ తీసుకొచ్చి రాజేష్‌ను కాల్చాడు. పొట్ట దిగువ భాగంలో తూటా దిగడంతో రాజేష్ కుప్పకూలిపోయాడు. అతడిని కేజీహెచ్‌కు తరలించగా, వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి ఐసీయూలో ఉంచారు. అయితే ఈ ఘటన వెనుక ఒక మాజీ కానిస్టేబుల్ హస్తం ఉన్నట్టు భావిస్తున్నారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఆ కానిస్టేబుల్ పోర్టులో బొగ్గు లోడింగ్, అన్‌లోడింగ్ వ్యాపారం చేస్తున్నారు. గత అక్టోబరు నుంచి ఉద్యోగానికి వెళ్లడం లేదు. బొగ్గు దొంగతనాలకు సంబంధించి రాజేష్‌తో అతడికి విభేదాలు ఉన్న నేపథ్యంలో నూకరాజుకు తుపాకీ ఇచ్చి పంపించింది అతడేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడు కూడా పరారీలో ఉన్నాడు.అది నాటు తుపాకీనా, సాధారణ తుపాకీనా అనేది ఇంకా ధ్రువీకరించలేదు. నూకరాజు, దిలీప్‌లను శ్రీకాకుళంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.