Share News

గుడివాడ-కంకిపాడు గ్రీన్‌ఫీల్డ్‌ ర య్‌ రయ్‌!

ABN , Publish Date - Aug 01 , 2025 | 01:15 AM

కంకిపాడు - గుడివాడ మార్గాన్ని నాలుగు వరసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిగా విస్తరించేందుకు అడుగులు పడ్డాయి. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రతిపాదనలపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. గుంతలు, గోతులతో ఎందరో ప్రాణాలను బలితీసుకుంటున్న ఈ రోడ్డును నాలుగు వరసలుగా విస్తరించేందుకు నిధులు విడుదల చేయాల్సిందిగా ఎంపీ బాలశౌరి చేసిన విజ్ఞప్తికి ఆయన సూత్రప్రాయంగా అంగీకారం తెలపటంతో అతి త్వరలో ఈ రోడ్డు పనులు పట్టాలెక్కబోతున్నాయి.

గుడివాడ-కంకిపాడు గ్రీన్‌ఫీల్డ్‌ ర య్‌ రయ్‌!

- రూ.600 కోట్ల వ్యయంతో 27 కిలోమీటర్ల మేర నాలుగు వరసల పనులు

- సూత్రప్రాయంగా ప్రాజెక్టుకు క్లియరెన్స్‌ ఇచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ

- మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్‌ ఆరు వరసల పోర్టు రోడ్డుకూ పచ్చ జెండా

- రూ.350 కోట్లు మంజూరు.. అతి త్వరలో పనులకు శ్రీకారం

- గుడివాడ పట్టణ పరిధిలో పలు రోడ్లకు ప్రతిపాదనలు

కంకిపాడు - గుడివాడ మార్గాన్ని నాలుగు వరసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిగా విస్తరించేందుకు అడుగులు పడ్డాయి. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రతిపాదనలపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. గుంతలు, గోతులతో ఎందరో ప్రాణాలను బలితీసుకుంటున్న ఈ రోడ్డును నాలుగు వరసలుగా విస్తరించేందుకు నిధులు విడుదల చేయాల్సిందిగా ఎంపీ బాలశౌరి చేసిన విజ్ఞప్తికి ఆయన సూత్రప్రాయంగా అంగీకారం తెలపటంతో అతి త్వరలో ఈ రోడ్డు పనులు పట్టాలెక్కబోతున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ /గుడివాడ):

ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని గురువారం ఎంపీ బాలశౌరి కలిశారు. మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో పలు రోడ్డు ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి ఆయనకు ప్రతిపాదించారు. వీటీలో అత్యంత ప్రధానమైనది కంకిపాడు - గుడివాడ రోడ్డు. కంకిపాడు నుంచి గుడివాడ వరకు 27 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి పనులు చేపట్టనున్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ ప్రాజెక్టు కావటంతో ముందుగా నాలుగు వరసల రోడ్డు పనులు చేపడతారు. ఆ తర్వాత ఆరు వరసలుగా విస్తరిస్తారు. ఈ ప్రాజెక్టు పీఎం గతిశక్తి కింద నిధులు విడుదల చేయాల్సిందిగా ఎంపీ బాలశౌరి గడ్కరీని అభ్యర్థించారు. ఈ రోడ్డు వల్ల విజయవాడ నుంచి గుడివాడకు గణనీయంగా దూరం తగ్గిపోతుంది. కంకిపాడు - గుడివాడ రోడ్డు ఎన్‌హెచ్‌ - 165, ఎన్‌హెచ్‌ - 216 హెచ్‌, ఎన్‌హెచ్‌ - 65లను కలుపుతుంది. ఈ విషయాన్ని ఎంపీ బాలశౌరి ప్రధానంగా గడ్కరీ దృష్టికి తీసుకువచ్చారు. ఇలా మూడు జాతీయ రహదారులను కలపటం వల్ల సమీప నగరం విజయవాడకు కుడా అతి తక్కువ సమయంలో చేరుకునే అవకాశం ఉందని వివరించారు.

నాలుగు నియోజకవర్గాల పరిధిలో రోడ్డు..

కంకిపాడు - గుడివాడ రోడ్డు వెంబడే సాగునీటి కాలువ ఉండటంతో కుంగుదల వచ్చి రోడ్డు తీవ్రంగా దెబ్బతింటోంది. గుడివాడ - కంకిపాడు రహదారి దాదాపుగా ఛిద్రమైంది. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులు భయపడుతున్నారు. గుడివాడ, పామర్రు, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల మీదుగా 27 కిలోమీటర్ల పైబడి ఈ రహదారి ఉంటుంది. గుడివాడ చట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఉభయగోదావరి జిల్లాల నుంచి విజయవాడకు ఈ రహదారి మీదుగానే వెళతారు. దెబ్బతిన్న ఈ రహదారిపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం జరగడం పరిపాటిగా మారింది. తరచూ ప్రమాదాలతో ఈ రహదారి రక్తమోడుతోంది. పెదపారుపూడి మండలం భూషణగుళ్ల నుంచి వెంట్రప్రగడ వరకు, వెంట్రప్రగడ నుంచి నందమూరు వరకు, నందమూరు నుంచి కంకిపాడు వరకు మూడు ప్యాకేజీలుగా ఈ రోడ్డును ఆర్‌అండ్‌బీ అధికారులు విభజించారు. రెండు, మూడు ప్యాకేజీల పనులు పూర్తయ్యాయి. దీంతో వాహనదారులకు కొంత ఉపశమనం కలిగింది. మొదటి ప్యాకేజీలోని పెదపారుపూడి సెంటర్‌ నుంచి వానపాముల విశ్వభారతి వైజ్‌వుడ్స్‌ వరకు రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇటీవలే కలవపాముల - వెంట్రప్రగడ మధ్య జరిగిన రహదారి ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్య షాక్‌కు గురైంది. దాదాపుగా 3.6 కిలోమీటర్ల మేర రహదారిని అభివృద్ధి చేయాల్సి ఉంది. ప్రమాదాల నిలయంగా మారిన ఈ రహదారి పరిస్థితి గురించి బాలశౌరి, గడ్కరీకి సమగ్రంగా వివరించారు. దీంతో గడ్కరీ సానుకూలంగా స్పందించటంతో పాటు అప్పటికప్పుడు క్లియరెన్స్‌ ఇచ్చారు. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుకు భూ సేకరణతో కలిపి దాదాపుగా రూ.600 కోట్ల వ్యయం కానుంది. నిర్మాణ ఖర్చు రూ.300 కోట్లు పైబడి అయ్యే అవకాశం ఉంది. ఈ నిధులను అతి త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.

మచిలీపట్నం పోర్టు రోడ్డుకు రూ.350 కోట్లు మంజూరు

మచిలీపట్నం సౌత్‌ పోర్టు నుంచి ఎన్‌హెచ్‌ - 65 వరకు ఆరు వరసలు 18.5 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డుకు రూ.350 కోట్లను మంజూరు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు మచిలీపట్నం సౌత్‌ పోర్టు నుంచి రైస్‌ మిల్‌ వరకు వస్తూ ఎన్‌హెచ్‌ - 65ను అనుసంధానిస్తుంది. ఈ రోడ్డు వల్ల మచిలీపట్నం పోర్టు నుంచి సరకు రవాణాకు దోహదపడుతుంది. ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలను బలోపేతం చేస్తుంది. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డులో భాగంగా మొత్తం ఏడు అండర్‌ పాస్‌లు, మూడు ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుంది. బీచ్‌ రోడ్‌లో కూడా ఒక ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తారు.

మంగినపూడి బీచ్‌ రోడ్డు నాలుగు లేన్లుగా అప్‌గ్రేడ్‌

మంగినపూడి బీచ్‌ రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా అప్‌గ్రేడ్‌ చేయటానికి గడ్కరీ అంగీకరించారు. మొత్తం 11.7 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మంగినపూడి బీచ్‌ రోడ్డు తీరప్రాంతం, మచిలీపట్నం పట్టణం మధ్య కీలకమైన లింక్‌గా పనిచేస్తుంది. ఈ రోడ్డును నాలుగు లేన్లుగా అప్‌గ్రేడ్‌ చేయడం వల్ల రవాణా మెరుగుపడుతుంది, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. స్థానిక ఆర్థికాభివృద్ధికి ఊతం ఇస్తుంది.

కేంద్ర మంత్రి దృష్టికి గుడివాడ పట్టణంలోని రహదారులు

గుడివాడ పట్టణ పరిధిలో జాతీయ రహదారి 216 హెచ్‌ పై తీవ్ర ట్రాఫిక్‌ సమస్య నెలకొంటోంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వార్షిక ప్రణాళిక కింద రూ.18.50 కోట్ల నిధుల కోసం ఎంపీ బాలశౌరి కేంద్ర మంత్రి గడ్కరీకి నివేదించారు. గుడివాడ పట్టణం నుంచి ఎన్‌హెచ్‌ - 216హెచ్‌ వరకు అనుసంధానంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని మరో ప్రతిపాదన అందించారు. గుడివాడ పట్టణంలో ఫ్లై ఓవర్‌కు అనుసంధానంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గుడివాడ పట్టణ పరిధిలో ఎన్‌హెచ్‌ - 165, ఎన్‌హెచ్‌ - 216హెచ్‌ల మధ్య అనుసంఽధాన ప్రాంతంలో గ్యాప్‌లు ఉన్న చోట్ల విస్తరణ పనులకు రూ. 28.50 కోట్ల మేర రూపొందించిన డీపీఆర్‌ను గడ్కరీకి అందించటం జరిగింది.

Updated Date - Aug 01 , 2025 | 01:15 AM