ప్రతీకారం తప్పదు: గుడివాడ అమర్నాథ్
ABN , Publish Date - Sep 28 , 2025 | 05:03 AM
ఈ రోజు వైసీపీని పెడుతున్న ప్రతి ఇబ్బందికీ ప్రతీకారం ఉంటుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు.
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఈ రోజు వైసీపీని పెడుతున్న ప్రతి ఇబ్బందికీ ప్రతీకారం ఉంటుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డిని శనివారం ములాఖత్ ద్వారా అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ కలిశారు. అనంతరం అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ సీనియర్ నాయకత్వంపై ఏదో రకంగా బురద జల్లి తప్పుడు కేసులు బనాయిస్తోందన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని ఫ్యాబ్రికేటెడ్ కేసులో అరెస్టు చేశారన్నారు. కూటమి ప్రభుత్వంపై ఏవైనా విమర్శలు వస్తే డైవర్షన్ చేయడం కోసం ఎవరో ఒకరిపై కేసులు పెడుతున్నారన్నారు. ఇప్పుడు బాలకృష్ణ మాటలనూ డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సబ్జెక్టు వెతుక్కుంటారని అనుమానం వ్యక్తం చేశారు