Share News

Rural Development: గూడెంకు వెలుగు వచ్చింది

ABN , Publish Date - Nov 06 , 2025 | 05:03 AM

దశాబ్దాల చీకటి వీడి.. ఆ కొండ కోనల్లో తొలిసారి వెలుగుల పండగ వచ్చింది అడవి తల్లి ఒడిలో.. రొంపల్లి ‘గూడెం’లో ఇప్పటి వరకూ అలముకున్న నిశీధిని చెరిపేస్తూ కార్తీక పౌర్ణమి వెన్నెలతోపాటు..

Rural Development: గూడెంకు వెలుగు వచ్చింది

  • నెరవేరిన పవన్‌ కల్యాణ్‌ హామీ

  • 5 నెలల కిందట గ్రామాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం

  • రూ.80 లక్షలతో యుద్ధప్రాతిపదికన పనులు

  • ఒక్కో ఇంటికి ఉచితంగా ఐదు బల్బులు, ఒక ఫ్యాన్‌

అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): దశాబ్దాల చీకటి వీడి.. ఆ కొండ కోనల్లో తొలిసారి వెలుగుల పండగ వచ్చింది! అడవి తల్లి ఒడిలో.. రొంపల్లి ‘గూడెం’లో ఇప్పటి వరకూ అలముకున్న నిశీధిని చెరిపేస్తూ కార్తీక పౌర్ణమి వెన్నెలతోపాటు, ఇంటింటా విద్యుత్‌, ‘పవన’ విద్యుత్‌ కాంతులు మెరిశాయి. చీకటిని జయించిన ఆనందంలో.. గిరిజనుల మోముల్లో ఆనంద కాంతులు వెల్లివిరిశాయి. అడ విలో కిలోమీటర్ల కఠినమైన చీకటి దారుల్ని చీల్చుకుంటూ.. కొండలను దాటుకుంటూ వచ్చిన ఆ వెలుగు రేఖ.. కేవలం విద్యుత్‌ కాదు.. గిరిపుత్రుల గుండెల్లో కొత్త ఆశల దీపం!! ఇంతటి ఆనందానికి కారణమైన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను గిరిజనులు ఇప్పుడు తమ దేవుడంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. కృతజ్ఞతగా క్షీరాభిషేకం చేశారు. వివరాలివీ.. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలవుతుండగా, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గూడెం గ్రామానికి ఇప్పటి వరకు విద్యుత్‌ సదుపాయం లేదు. దీంతో వారు పడుతున్న వెతలు అన్నీఇన్నీకావు. ఇలాంటి తరుణంలో ఐదు నెలల క్రితం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆ గ్రామాన్ని సందర్శించారు. గిరిజనుల సమస్యలను సావధానంగా ఆలకించారు. ప్రధానంగా విద్యుత్‌ లేక పడుతున్న ఇబ్బందులను ఏకరువుపెట్టారు. ఈ నేపథ్యంలో.. బుధవారం ఆ గ్రామంలో ఉన్న 17 ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు. కార్తీక పౌర్ణమి రోజున బయట వెన్నెల కాంతులు.. ఇళ్లలో విద్యుత్‌ వెలుగులతో గిరిజనులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. మండల కేంద్రానికి 50కి.మీ దూరంలో 17 అవాసాలతో ఈ గూడెం గ్రామం ఉంది. దాని కోసం 9.6 కి.మీ పొడవునా అడవులు, కొండల్లో 217 విద్యుత్‌ స్తంభాలువేసి రూ.80 లక్షల వ్యయంతో విద్యుత్‌ ఇచ్చారు.


కృతజ్ఞతగా పవన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

కనీస సౌకర్యాలు, విద్యుత్‌ సదుపాయం లేని గూడెం గ్రామ గిరిజనులు బుధవారం విద్యుత్‌ సౌకర్యం అందడంతో హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. తమ గ్రామానికి విద్యుత్‌లైను వేయించి, తమ ఇళ్లలో విద్యుత్‌ కాంతులు నింపిన ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ గ్రామాన్ని యలమంచిలి శాసనసభ్యుడు సుందరపు విజయ్‌కుమార్‌, అరకు నియోజకవర్గం జనసేన నేతలు, జనసైనికులు సందర్శించారు. కనీసం రహదారి సౌకర్యం లేని ఆ గిరి శిఖర గ్రామానికి ట్రాక్టర్‌ సాయంతో ప్రయాణించి మరీ చేరుకున్నారు. గ్రామస్థుల ఆనందోత్సాహాల్లో భాగస్వాములయ్యారు.

విద్యుత్‌శాఖది యజ్ఞమే!

గూడెం గ్రామానికి విద్యుత్‌ లైను వేసేందుకు విద్యుత్‌శాఖ ఒక యజ్ఞమే చేసింది. స్తంభాల రవాణా, పాతడం వంటి పనులు అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య చేపట్టింది. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా గ్రామంలో సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌కు అనుసంధానించారు. పీఎం జన్‌మన్‌ పథకం కింద రూ.10.22 లక్షలతో సోలార్‌, పవన్‌ విద్యుత్‌తో కూడిన హైబ్రిడ్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గిరిజన గ్రామాల్లో తొలిసారి ఈ తరహా గ్రిడ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఐదు బల్బులు, ఒక ఫ్యాన్‌ అందించింది. నిధులందించిన ప్రధాని మోదీతోపాటు.. సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు డిప్యూటీసీఎం పవన్‌కల్యాణ్‌ అభినందనలు తెలిపారు.

Updated Date - Nov 06 , 2025 | 05:06 AM