Guaranteed FLN: రాయడం, చదవడం రావాలి... చిన్నపాటి లెక్కలూ చేయాలి
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:56 AM
విద్యార్థులు పునాది దశలోనే ప్రాథమిక అంశాలు నేర్చుకోవాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ...
ప్రాథమిక దశలోనే విద్యార్థులకు బలమైన పునాది.. 1-5 తరగతుల పిల్లలకు ‘గ్యారెంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్’
‘బేసిక్స్’ తప్పనిసరిగా వచ్చేలా చేయడమే ఉద్దేశం
కార్యక్రమ అమలుకు 75 రోజుల కార్యాచరణ ప్రణాళిక
విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్
ఉదయం సిలబస్.. మధ్యాహ్నమంతా ఎఫ్‌ఎల్‌ఎన్ బోధన
అమరావతి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు పునాది దశలోనే ప్రాథమిక అంశాలు నేర్చుకోవాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ(జీఎఫ్ఎల్‌ఎన్) కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఎఫ్‌ఎల్‌ఎన్ అనేది ఉండగా.. దాన్ని ఈ విధంగా మార్చింది. వంద శాతం మంది పిల్లలకు ప్రాథమిక దశలో తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక లెక్కలు చేయడం వంటి బేసిక్స్ తప్పనిసరిగా వచ్చేలా చేయాలనేది ‘జీఎఫ్ఎల్‌ఎన్’ ఉద్దేశం. ఐదో తరగతి దాటినా కొంత మంది విద్యార్థులు పదాలు చదవలేకపోతున్నారని, చిన్నపాటి లెక్కలూ చేయలేని స్థితిలో మిగిలిపోతున్నారనేది ఏటా నిర్వహిస్తున్న బేస్‌లైన్ సర్వేలో తెలుస్తోంది. ఫలితంగా పైతరగతులకు వెళ్లినా చదవడం, రాయడంలో ఇబ్బంది పడుతూ చదువులో వెనకబడిపోతున్నారు. ప్రధానంగా ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం జీఎఫ్ఎల్‌ఎన్ తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం అమలుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు సోమవారం 75 రోజుల కార్యాచరణ ప్రణాళిక విడుదల చేశారు. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ఇది అమలు చేస్తారు. ప్రతిరోజూ ఉదయం రెగ్యులర్ సిలబస్ బోధించి, మధ్యాహ్నం నుంచి బడి వేళ ముగిసే వరకూ జీఎ్‌ఫఎన్‌ఎన్ బోధిస్తారు. ఏ రోజు ఏంచేయాలనేది పాఠశాల విద్యాశాఖ యాక్షన్ ప్లాన్‌లో వివరించింది. 1, 2 తరగతులు, 3-5 తరగతుల విద్యార్థులకు వేర్వేరుగా యాక్షన్ ప్లాన్ పుస్తకాలు రూపొందించారు. డిసెంబరు 8 నుంచి మార్చి 24 వరకు ఈ కార్యక్రమం అమలు చేసేలా చర్యలు చేపట్టారు.
విద్యార్థులకు ఏం నేర్పుతారు?
యాక్షన్ ప్లాన్‌లో భాగంగా విద్యార్థులు అక్షరాలు గుర్తించడం, చదవడంతో ప్రారంభించి, క్రమంగా స్థాయి పెంచుతూ వెళ్తారు.
1, 2 తరగతులు - తెలుగులో అక్షరాలు గుర్తించడం, చిత్రాలు చూపించి పదాలు చదవడం, అక్షరాలు రాయడం, పదాలు గుర్తించడం, పదాలు రాయడం నేర్పిస్తారు. గణితంలో పెద్ద చిత్రాలను చూపించి.. వాటి ఆధారంగా అంకెలు లెక్కించడం, అంకెలు జతపరచడం, అంకెలు రాయడం నేర్పుతారు. ఇంగ్లిష్‌లో చిత్రాలను చూపించి ఏ అక్షరంతో పదాలు ప్రారంభమవుతాయో గుర్తించడం, పదాలు చదవడం, ఒక వాక్యంలో కొన్ని పదాలు గుర్తించడం, ఇసుకపై పదాలు రాయించడం, బోర్డుపై రాయించడం నేర్పుతారు. ప్రతిరోజూ మూడు సబ్జెక్టులపై ఈ ప్రణాళిక అమలు చేసిన అనంతరం పునశ్చరణ ఉంటుంది.
3- 5 తరగతులు - వివిధ అంశాలపై మాట్లాడించడం, కథలు తయారు చేయించడం, వర్ణమాల చార్ట్‌ను ఎడమ నుంచి కుడి వైపునకు, కుడి నుంచి ఎడమ వైపునకు చదివించడం, గుణింతాలు చదివించడం, చిత్రాల క్యాలెండర్ చూపించడం, పదాలతో వాక్యాలు తయారు చేయడం, బొమ్మల ఆధారంగా కథలు చెప్పడం నేర్పిస్తారు. గణితంలో అంకెల పరిచయం, కరెన్సీ నోట్ల ద్వారా యాక్టివిటీస్, పలు పద్ధతుల్లో సంఖ్యా వాచకం, మౌఖికంగా కూడికలు, కూడిక పద సమస్యలు, కప్పగెంతులు, ఇతర ఆటల ద్వారా లెక్కలు చేయడం నేర్పుతారు. ఇంగ్లిష్‌లో చిత్రాలను చూపించి మాట్లాడించడం, ఏదైనా ఒక చిత్రం చూసి దాని గురించి చెప్పడం, దానిపై వాక్యం తయారు చేయడం, అక్షరాలు-చిత్రాలను జత చేయడం, అక్షరాలను ఉపయోగించి వాటితో ప్రారంభమయ్యే పదాలు చెప్పడం, చిన్న వాక్యాలు చదవడం, పాఠ్యపుస్తకం నుంచి రెండు వ్యాక్యాలు చదవడం, చిన్నపాటి వాక్యాలు సొంతంగా రాయడం వంటివి నేర్పుతారు.