Minister Payyavula Keshav: జీఎస్టీ సంస్కరణలతో పేదలకు మేలు
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:54 AM
రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు తగ్గినా సామాన్యులకు, పేద ప్రజలకు మేలు కలుగుతున్నందునే జీఎస్టీ సంస్కరణలకు పూర్తి మద్దతు పలికామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.
నాలుగైదు నెలల్లో పూర్తి ఫలితాలు: మంత్రి పయ్యావుల
న్యూఢిల్లీ, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు తగ్గినా సామాన్యులకు, పేద ప్రజలకు మేలు కలుగుతున్నందునే జీఎస్టీ సంస్కరణలకు పూర్తి మద్దతు పలికామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సామాన్యుడికి మరింత మేలు జరిగేలా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేశ ఆర్థిక రంగంలో సంస్కరణలను మరింతగా ముందుకు తీసుకెళ్లాలని ఎప్పటినుంచో చంద్రబాబు కోరుతున్నారు. గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసినప్పుడు కూడా జీఎస్టీలో సంస్కరణల గురించి చర్చించాం. జీఎస్టీ సంస్కరణలపై కౌన్సిల్ సమావేశంలో చర్చలో భాగంగా కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా చివరికి అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. జీఎస్టీ సంస్కరణల ఫలితాలు నెల రోజుల్లోనే ఆరంభమవుతాయి. పూర్తి ఫలితాలు నాలుగైదు నెలల్లోనే వస్తాయి’ అని పయ్యావుల ఆశాభావం వ్యక్తం చేశారు.