Share News

GST Reforms: జీఎస్టీ లబ్ధి ప్రజలకు అందాలి

ABN , Publish Date - Sep 17 , 2025 | 04:16 AM

ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ సవరణల వల్ల ప్రజలకు భారీగా లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు...

GST Reforms: జీఎస్టీ లబ్ధి ప్రజలకు అందాలి

  • 8,000 కోట్ల మేర ప్రయోజనం

  • నెల రోజులు అవగాహన కల్పించండి

  • జీఎస్టీ, పన్ను ఆదాయాలు తగ్గకూడదు

  • మైనింగ్‌ ఆదాయం కూడా పెరగాలి: సీఎం

అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ సవరణల వల్ల ప్రజలకు భారీగా లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ లబ్ధి కచ్చితంగా వారికి అందేలా చూడాలన్నారు. కలెక్టర్ల సదస్సులో రెండోరోజు మంగళవారం ఆయన మాట్లాడారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు రూ. 8,000 కోట్ల మేర ప్రయోజనాలు అందుతాయన్నారు. పన్నుల తగ్గింపునకు సంబంఽధించి ఈనెల 19వ తేదీన నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పారు. ఏ వస్తువుకు ఎంత పన్ను తగ్గిందన్న అంశాలను గ్రామస్థాయి వరకూ ప్రజలకు తెలిసేలా ప్రకటనలు జారీ చేయాలని ఆదేశించారు. జీఎస్టీ పన్నుల తగ్గింపుపై సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 22 వరకు నెల రోజుల పాటు మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆదాయాలు తగ్గకుండా జిల్లా కలెక్టర్లు దృష్టిసారించాలన్నారు. ముఖ్యంగా మైనింగ్‌ ఆదాయంలో ఏ జిల్లాలు వెనుకంజలో ఉన్నాయో బేరీజు వేస్తామని, కొన్ని జిల్లాల్లో ఆదాయం భారీగా పడిపోవడానికి గల కారణాలు విశ్లేషించాలని చెప్పారు. జిల్లాల వారీగా మైనింగ్‌ ఆదాయం పెరగాలన్నారు. మైనింగ్‌ ఎక్కువ ఉన్నచోట విలువ జోడింపు చేయాలని సూచించారు. పరిశ్రమల శాఖతో కలిసి క్వార్ట్జ్‌ లాంటి ఖనిజాలకు విలువ జోడించేందుకు ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామని, రూ. 20,000 కోట్ల విలువైన ప్రాజెక్టుతో 10,000 ఉద్యోగాలు వస్తాయని గనుల శాఖ మాజీ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌ చెప్పారు.

ఉచిత ఇసుకపై సంతృప్తి పెరగాలి

ఉచిత ఇసుక విధానంలో ప్రజల్లో సంతృప్త స్థాయి పెరిగేలా చేయాలని సీఎం ఆదేశించారు. రూ.1,000 కోట్ల రెవెన్యూను కోల్పోయి ఉచిత ఇసుక అందిస్తున్నామని, అయినా జనంలో సంతృప్తి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. రవాణా ఖర్చులు భరిస్తూ ఇసుక తీసుకెళ్లడానికి వచ్చిన వారిని అడ్డుకోవద్దని ఆదేశించారు. తిరుపతి ఎర్రచందనం డిపో వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎర్రచందనం దుంగలతో వేంకటేశ్వరస్వామి బొమ్మలు, ఇతర కళాకృతులు చేసి కలప విలువను పెంచాలన్నారు. రాష్ట్రంలో మోటార్‌ వాహనాల పన్నులు ఎందుకు పెరగడం లేదో కారణాలు విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా అక్రమకట్టడాలు గుర్తించే ప్రక్రియను మున్సిపల్‌ విభాగం చేపట్టాలని చెప్పారు.


పారదర్శకంగా ఎక్సైజ్‌

గత ప్రభుత్వంలో ఎక్సైజ్‌ శాఖలోనే అతిపెద్ద స్కాంచేశారని, తాము వచ్చాక ఈ శాఖను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సీఎం చెప్పారు. ప్రొక్యూర్‌మెంట్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, విక్రయం వరకు అంతా పారదర్శకంగా జరగాలన్నారు. 100 శాతం డిజిటల్‌ చెల్లింపులే జరగాలని ఆదేశించారు. సరిహద్దు జిల్లాల్లో అమ్మకాలు 200 శాతం పుంజుకున్నాయని ఎక్సైజ్‌ ముఖ్య కార్యదర్శి మీనా వెల్లడించారు. దుకాణాలకు సరఫరా చేసే మద్యం ధరల కంటే బార్‌లకు సరఫరా చేసే మద్యం రేట్లు 15 శాతం ఎక్కువగా ఉండడం వల్ల బార్‌ పాలసీలో సమస్యలు వస్తున్నాయన్నారు. సమస్యలు పరిష్కరించి బార్‌ పాలసీని సవరించాలని సీఎం సూచించారు.

గత పాలకుల తప్పులతోనే భూ వివాదాలు

అభ్యంతరాల్లేని భూములను రెగ్యులరైజ్‌ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెవెన్యూ విభాగానికి వచ్చే ఫిర్యాదుల్లో 70 శాతం ఆర్‌వోఆర్‌ ఫిర్యాదులే ఉన్నాయని చెప్పారు. గత పాలకుల తప్పులతో ఈ స్థాయిలో రెవెన్యూ, భూ వివాదాల ఫిర్యాదులు వచ్చాయన్నారు. 22ఏలో భూములు పెట్టడం వల్ల ఈ సమస్యలు తలెత్తాయని, రీసర్వే చేసి ఈ రికార్డులను నిర్దేశిత గడువులోగా అంటే 2027కి ముందే ప్రక్షాళన చేయాలని చెప్పారు. శాశ్వత ప్రాతిపదికన కుల ధ్రువీకరణ ఇవ్వాలని, నివాస, వయసు ధ్రువీకరణ కోసం ఏటా జారీ చేయొచ్చని చెప్పారు. సింహాచలం పంచగ్రామాల సమస్యను తక్షణం పరిష్కరించాలన్నారు. రెవెన్యూలో టెక్నాలజీ అనుసంధానం త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.

Updated Date - Sep 17 , 2025 | 04:16 AM