GST Reforms: ప్రజలకు మేలు..రాష్ట్ర ఖజానా కుదేలు
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:06 AM
జీఎస్టీ సంస్కరణలు రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. పేదలు, మధ్యతరగతికి ఊరటనిచ్చేలా ఇకపై 5, 18 శాతం పన్ను రేట్లు మాత్రమే కొనసాగుతాయని జీఎస్టీ మండలి తాజాగా ప్రకటించింది.
ప్రభుత్వానికి ప్రతినెలా 15శాతం నష్టం
వాణిజ్య పన్నుల శాఖ అంచనాలు
సంక్షేమం, అభివృద్ధిపైనా ప్రభావం
కేంద్రమే ఆదుకోవాలని డిమాండ్
జీఎస్టీ సెస్‌తో కేంద్రానికి 40,500 కోట్ల మిగులు
వెల్లడించిన ఎస్‌బీఐ రిసెర్చ్ నివేదిక
ఈ నిధులతో రాష్ట్రాలకు వాటిల్లే నష్టాన్ని భర్తీ చేయాలని వినతులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జీఎస్టీ సంస్కరణలు రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. పేదలు, మధ్యతరగతికి ఊరటనిచ్చేలా ఇకపై 5, 18 శాతం పన్ను రేట్లు మాత్రమే కొనసాగుతాయని జీఎస్టీ మండలి తాజాగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు 15శాతం వరకు నష్టం వాటిల్లవచ్చని వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేస్తోంది. ఆగస్టులో రాష్ట్రానికి నికరంగా రూ.2,977 కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది. తాజా సవరణలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఆదాయంలో ప్రతి నెలా 15శాతం వరకు కోత పడొచ్చని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో నెలకు రూ.5వేల కోట్ల చొప్పున ఏటా రూ.60వేల కోట్ల వరకూ నష్టం ఉండొచ్చని ఎస్‌బీఐ రిసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో బీజేపీయేతర ప్రభుత్వాలున్న ఎనిమిది రాష్ట్రాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రమే ఈ నష్టాన్ని భర్తీ చేయాలని, లేకుంటే తమ రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యకలాపాలు కుంటుపడతాయని స్పష్టం చేస్తున్నాయి.
సర్కారుపై పెనుభారం
ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఎదురీదుతోంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అధిక వడ్డీరేట్లకు అప్పులు తేవడమే తప్ప అభివృద్ధి పనులు చేయకపోవడం, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆ భారమంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై పడింది. అప్పులపై అసలు, వడ్డీలు కలిపి ఏటా రూ.65,000 కోట్ల నుంచి రూ.70,000 కోట్ల వరకూ చెల్లిస్తున్నారు. మరోవైపు అభివృద్ధి, సంక్షేమంలో ఎక్కడా రాజీపడటం లేదు. ఈ సమయంలో 15 శాతం ఆదాయం తగ్గడం రాష్ట్రాన్ని మరింతగా కుంగదీయనుంది. అప్పులకు అసలు, వడ్డీ చెల్లింపులను పెండింగ్‌లో పెట్టడం సాధ్యం కాదు కాబట్టి, ఈ నష్టం ప్రభావం సంక్షేమం, అభివృద్ధిపైనే పడనుంది. రాష్ట్రంలో రహదారులు, కొత్త అభివృద్ధి ప్రాజెక్టులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఏళ్ల తరబడి నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి. ఈ సమయంలో జీఎస్టీ సవరణలతో నష్టపోతున్న ఆదాయాన్ని కేంద్రమే భర్తీచేసి ఆదుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సెస్ నిధులిచ్చి ఆదుకోవాలి
2017లో జీఎస్టీ పన్ను విధానం అమల్లోకి వచ్చినప్పుడు ప్రతి రాష్ట్రానికి అంతకుముందు వచ్చిన ఆదాయం ఆధారంగా జీఎస్టీ మండలి ఒక బెంచ్‌మార్క్ నిర్దేశించింది. దానికంటే తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాలకు కేంద్రం పరిహారం ఇచ్చింది. జీఎస్టీపై సెస్ వేసి ఆ ఆదాయాన్ని పరిహారం ఇవ్వడానికి ఉపయోగించింది. ఏపీ ప్రతినెలా సెస్ చెల్లిస్తున్నప్పటికీ, ఇంతవరకూ పరిహారం తీసుకోవాల్సిన అవసరం రాలేదు. 2022 మార్చి తర్వాత ఏ రాష్ట్రం కూడా ఈ పరిహారాన్ని క్లెయిమ్ చేసుకోలేదు. అయితే కొవిడ్ సమయంలో రాష్ట్రాలకు కేంద్రం రుణాలిప్పించింది. వాటికి అసలు, వడ్డీ చెల్లించడానికి ఆ సెస్ నిధులను ప్రస్తుతం వాడుతోంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి కొవిడ్ రుణాల చెల్లింపులు పూర్తవుతాయని ఇటీవల జీఎస్టీ మండలిలో చర్చించారు. కానీ, వచ్చే ఏడాది మార్చి వరకు ఈ సెస్‌ను కేంద్రం వసూలు చేయనుంది. ఈ రూపంలో కేంద్రానికి రూ.40,500 కోట్లు అందుబాటులో ఉంటాయని వాటితో రాష్ట్రాలకు జరిగే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయొచ్చని ఎస్‌బీఐ రిసెర్చ్ నివేదిక అభిప్రాయపడింది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి. 2018 జూలై, 2019 అక్టోబరులో జీఎస్టీ శ్లాబులు సవరించినప్పుడు కూడా తొలుత ఆదాయం తగ్గినా ఆ తర్వాత పుంజుకున్న విషయాన్ని ఆ నివేదిక గుర్తుచేసింది. కొత్త శ్లాబుల ప్రకారం జీఎస్టీ ఆదాయాలు పుంజుకునే వరకూ తమకు కలిగే నష్టాన్ని కేంద్రం భర్తీ చేయాలని రాష్ట్రాలు కోరుతున్నాయి.