Minister Payyavula Keshav: ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది
ABN , Publish Date - Sep 19 , 2025 | 05:38 AM
జీఎస్టీ సంస్కరణలతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. వారి పొదుపు కూడా మెరుగుపడుతుందన్నారు.
ఆదాయం తగ్గినా సామాన్యుల కోసం మద్దతు
22 నుంచి అవగాహన సదస్సులు నిర్వహిస్తాం
జీఎస్టీ సంస్కరణలపై ఆర్థిక మంత్రి పయ్యావుల
సీఎంను అభినందిస్తూ అసెంబ్లీలో తీర్మానం
అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ సంస్కరణలతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. వారి పొదుపు కూడా మెరుగుపడుతుందన్నారు. గురువారం అసెంబ్లీలో జీఎస్టీ సంస్కరణలపై చేపట్టిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. జీఎస్టీ 2.0 నిర్ణయం చారిత్రాత్మకమని, ఈ సంస్కరణల ద్వారా దేశ ప్రగతికి బాటలు వేశారని కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ అంశంలో రాష్ట్రం తరఫున నిర్మాణాత్మక సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. పన్నుల విధానం సులభతరం కావడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. పన్నులు తగ్గడం వల్ల ప్రజలు ఎక్కువగా వినియోగించే వస్తువులకు డిమాండ్ పెరుగుతుందని, అది ఆర్థిక వృద్ధికి దారితీస్తుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ నెల 22 నుంచి నెల రోజులపాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని పయ్యావుల ప్రకటించారు.
సంస్కరణలకు చంద్రబాబు తొలి మద్దతు
జీఎస్టీ రెండోతరం సంస్కరణలకు మద్దతు తెలిపిన సీఎం చంద్రబాబును అభినందిస్తూ మంత్రి కేశవ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాదాయం తగ్గుతున్నా మొదటగా వాటిని స్వాగతించి, మద్దతు తెలిపినందుకు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. దీనివల్ల రాష్ట్ర ఆదాయానికి రూ.8వేల కోట్లు నష్టం వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్తే... ఆ మేరకు ప్రజలకు లబ్ధి చేకూరుతుంది కదా అని అన్నారని వివరించారు. ఎంతో అనుభవం కలిగిన నాయకుడైన చంద్రబాబు మద్దతివ్వడంతో జీఎస్టీ సంస్కరణలపై అందరిలోనూ ఒక సానుకూల ధోరణి ఏర్పడిందన్నారు. ఈ అంశంపై జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్యేలు గౌతుశిరీష, ఆదినారాయణరెడ్డి, ఆదిరెడ్డి వాసు, శ్రవణ్‌కుమార్ మాధవిరెడ్డి, ఏలూరి సాంబశివరావు, రామాంజనేయులు, బుచ్చయ్య చౌదరి మాట్లాడారు.