GST Reduction: జీఎస్టీ తగ్గింపుతో ఆక్వా రంగానికి ఊతం
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:56 AM
వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ) విధానంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన సంస్కరణలతో మత్స్య పరిశ్రమకు భారీగా ఉపశమనం లభించింది.
12 నుంచి 5 శాతానికి తగ్గిన జీఎస్టీ
తగ్గనున్న చేపలు, రొయ్యల పెంపకం ఖర్చులు
పెరగనున్న సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ) విధానంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన సంస్కరణలతో మత్స్య పరిశ్రమకు భారీగా ఉపశమనం లభించింది. సవరించిన జీఎస్టీ రేట్ల ప్రకారం చేప నూనె, వలలు, చేపలు, రొయ్యలు, సముద్ర ఉత్పత్తులు, ఆక్వాకల్చర్ ఇన్‌పుట్స్‌లపై జీఎస్టీని 12 నుంచి 5శాతానికి కౌన్సిల్ తగ్గించింది. దీంతో దేశీయ వినియోగదారులకు విలువ ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తులు సరసమైన ధరకు రానున్నాయి. రొయ్యల సాగు కార్యకలాపాలు, హేచరీలకు అవసరమైన డీజిల్ ఇంజన్లు, పంపులు ఏరియేటర్లు, స్పింక్లర్లపై జీఎస్టీ ఇక 5శాతమే. చేపల చెరువుల్లో నీటి నాణ్యతకు ఉపయోగించే అమ్మోనియా, ఇతర సూక్ష్మపోషకాల వంటి రసాయనాలపై కూడా 5 శాతమే పన్ను పడనున్నది. దీంతోపాటు ఫీడ్ ఖర్చులు తగ్గడం, చేపలు, రొయ్యల చెరువు నిర్వహణ, వాటి ఇన్‌పుట్స్‌పై జీఎస్టీ తగ్గినందున చేపలు, రొయ్యల ఎగుమతులు బలోపేతం కానున్నాయి. అలాగే శుద్ధి చేసిన సముద్ర ఆహార పదార్ధాలను ఎక్కువగా వినియోగించడానికి అవకాశాలు పెరుగుతాయి. ఆక్వా ఎగుమతులు గణనీయంగా బలోపేతం కానున్నాయి.
తగ్గిన జీఎస్టీతో రైతులకు ఊరట
జీఎస్టీ సంస్కరణలు రైతులకు ఊరట ఇవ్వనున్నాయి. వ్యవసాయ అవసరాలకు వాడే ట్రాక్టర్లపై జీఎస్టీని 12 నుంచి 5శాతానికి తగ్గించగా, ట్రాక్టర్ విడి భాగాలు, టైర్లు, ట్యూబులపై 18 నుంచి 5శాతానికి తగ్గింది. వ్యవసాయ, ఉద్యాన, అటవీ సాగు భూములకు వాడే యంత్రాలు, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింది. హార్వెస్టర్లు, మందులు పిచికారి చేసే చేతి పంపులు, డ్రిప్, స్ర్పింక్లర్లు, పౌల్ర్టీ సామాగ్రిపై జీఎస్టీ తగ్గడం రైతులకు ఊరటనిస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. రూ.5లక్షల విలువ చేసే ట్రాక్టర్‌పై జీఎస్టీ తగ్గడంతో రూ.50వేలపైగా ప్రయోజనం చేకూరనున్నది.