Share News

Tax Reforms: పన్నులు తగ్గినా.. పెరిగిన వసూళ్లు

ABN , Publish Date - Nov 02 , 2025 | 04:50 AM

జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వచ్చాక నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గినప్పటికీ అక్టోబరు నెలలో రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి.

Tax Reforms: పన్నులు తగ్గినా.. పెరిగిన వసూళ్లు

  • అక్టోబరులో పెరిగిన జీఎస్టీ

  • కలిసొచ్చిన దసరా, దీపావళి

  • నికర జీఎస్టీ 3,021 కోట్లు..

  • ‘గత ఏడాది’ కంటే 8.77శాతం ఎక్కువ

అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వచ్చాక నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గినప్పటికీ అక్టోబరు నెలలో రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. నికర జీఎస్టీ రూ.3,021 కోట్లకు పెరిగింది. జీఎస్టీ 2.0 వల్ల రాష్ట్రానికి ఏడాదికి రూ.8,000 కోట్ల నష్టం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అసెంబ్లీలో కూడా ప్రకటించింది. కానీ అంచనాలు తారుమారయ్యాయి. సంస్కరణలు అమల్లోకి వచ్చిన మొదటి నెలలోనే నికర జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ప్రధాన పండగలైన దసరా, దీపావళి రావడం వల్ల కొనుగోళ్లు పెరగడమే దీనికి కారణం. దీంతో పాటు ప్రభుత్వ నిర్ణయాలు కూడా జీఎస్టీ పెరుగుదలకు దోహదపడ్డాయని వాణిజ్య పన్నుల శాఖ చీఫ్‌ కమిషనర్‌ అహ్మద్‌ బాబు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టులో రూ.2,977 కోట్ల నికర జీఎస్టీ వసూలు కాగా, సెప్టెంబరులో ఈ వసూళ్లు రూ.2790 కోట్లకు పడిపోయాయి. సెప్టెంబరు 22 నుంచే సంస్కరణలు అమల్లోకి రావడంతో ఆ నెల వసూళ్లపై వీటి ప్రభావం అంతగా లేకపోయినప్పటికీ ఆ నెల ఆదాయం తగ్గిపోయింది. కానీ ఇప్పుడు అక్టోబరు నెల మొత్తం తగ్గిన జీఎస్టీ శ్లాబు రేట్లే అమల్లో ఉన్నప్పటికీ నికర జీఎస్టీ రూ.3,021 కోట్లకు పెరిగింది. గత ఏడాది అక్టోబరులో వసూలైన నికర జీఎస్టీ కంటే ఇది 8.77 శాతం అధికం. అక్టోబరులో స్థూల జీఎస్టీ రూ.3,490 కోట్లు వసూలైంది. గత ఏడాది కంటే ఇది 2.54 శాతం అధికం. ఎస్‌జీఎస్టీ వసూళ్లు గత ఏడాది కంటే 16.2 శాతం పెరిగి రూ.1,247 కోట్లకు చేరుకున్నాయి. ఐజీఎస్టీ సెటిల్మెంట్‌ 10.65 శాతం పెరిగి రూ.1,773 కోట్లకు పెరిగాయి. పెట్రోలియం వ్యాట్‌ ఆదాయం 7.88 శాతం పెరిగి రూ.1,282 కోట్లకు చేరుకుంది. వృత్తి పన్ను 18.26 శాతం పెరిగింది. జీఎస్టీ పరిధిలోకి రాని విభాగాల ఆదాయంతో కలిపి అక్టోబరులో మొత్తం రూ.4,458 కోట్ల పన్నులు వసూలయ్యాయి. గత ఏడాది అక్టోబరులో వసూలైన రూ.4,126 కోట్ల కంటే ఇది 8 శాతం ఎక్కువ. ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు మొత్తం పన్నులు రూ.31,144 కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది అదే సమయంలో రూ.29,499 కోట్లు మాత్రమే వచ్చాయి.

Updated Date - Nov 02 , 2025 | 04:52 AM