Share News

Nirmala Sitharaman: 140 కోట్ల మందికి జీఎస్టీ లబ్ధి

ABN , Publish Date - Sep 18 , 2025 | 03:16 AM

దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూర్చేలా జీఎస్టీ 2.0 సంస్కరణలు తెచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.

Nirmala Sitharaman: 140 కోట్ల మందికి జీఎస్టీ లబ్ధి

  • ఖర్చులు తగ్గి, చేతిలో డబ్బు ఉంటుంది

  • రెండు స్లాబ్‌లతో తగ్గనున్న భారం

  • దోచుకోవడానికి జీఎస్టీ తీసుకురాలేదు

  • పన్ను విధానాన్ని క్రమబద్ధీకరించాం

  • పన్ను చెల్లింపుదారులను పెంచాం

  • జీఎస్టీ సంస్కరణల లక్ష్యం వికసిత్‌ భారత్‌

  • నిర్మలా సీతారామన్‌ వెల్లడి

విశాఖపట్నం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూర్చేలా జీఎస్టీ 2.0 సంస్కరణలు తెచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మహిళాపక్షపాతి అని, వారికోసం ప్రత్యేకంగా ఆయన కార్యక్రమాలు రూపొందిస్తున్నారని తెలిపారు. బుధవారం విశాఖలోని ‘వి’ కన్వెన్షన్‌ సెంటర్‌లో నెక్ట్స్‌ జనరేషన్‌ జీఎస్టీ రిఫార్మ్స్‌ (తర్వాతి తరం జీఎస్టీ సంస్కరణలు) పేరుతో జరిగిన అవగాహన సదస్సులోను, ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘స్వస్థ్‌ నారీ-సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ ప్రారంభ కార్యక్రమంలోనూ నిర్మలా సీతారామన్‌ పాల్గొని ప్రసంగించారు. దేశంలో నాలుగు స్లాబ్‌లలో ఉన్న జీఎస్టీని రెండు స్లాబ్‌లకు పరిమితం చేయడం ద్వారా ప్రజలపై భారాన్ని తగ్గించామన్నారు. ఈ సంస్కరణలు వికసిత్‌ భారత్‌కు పునాదులు వేసేందుకు దోహదం చేస్తాయని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ అమలులోకి వస్తుందని, దానికంటే ముందే చాలామంది అమలు చేసేందుకు సిద్ధపడుతున్నారన్నారు. ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ ఉండే వస్తువుల్లో 99 శాతం ఐదు శాతం జీఎస్టీలోకి, 28 శాతంలో ఉన్న వస్తువుల్లో 90 శాతం వరకూ 18 శాతం స్లాబ్‌లోకి వెళతాయని వివరించారు. దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు ఖర్చు తగ్గి, కొనుగోలు శక్తి పెరుగుతుందని, చేతుల్లో డబ్బులు కూడా ఉంటాయన్నారు. నిర్మలా సీతారామన్‌ ఇంకా ఏమన్నారంటే..


జీఎస్టీ ఫలాలు అనుభవిస్తున్నాం..

‘‘జీఎస్టీ పేరుతో ప్రజలను దోచుకుని ఇప్పుడు తగ్గించారని చాలామంది విమర్శిస్తున్నారు. కానీ గతంలో 17 రకాల ట్యాక్స్‌లు, 8 రకాల సెస్‌ల పేరుతో దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పన్నులు వసూలు చేశారు. వాటన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి నాలుగు స్లాబ్‌లను దేశమంతా అమలు చేసేలా జీఎస్టీ విధానం తీసుకువచ్చాం. దాని అమలుకు ముందు దేశంలో 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండేవారు. జీఎస్టీ వచ్చాక 1.5 కోట్ల మందికి పెరిగారు. స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటివరకు ఏర్పాటైన రాజ్యాంగ వ్యవస్థ ఏదైనా ఉందంటే అది జీఎస్టీ కౌన్సిల్‌ మాత్రమే. జీఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయంతో దేశంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాం. ఎయిర్‌పోర్టులు పెరిగాయి. 60 శాతం జాతీయ రహదారులు నిర్మాణమయ్యాయి.డిఫెన్స్‌ రంగంలో 34 శాతం ఎగుమతులు పెరిగాయి.’’


బోగస్‌ ఏరివేతతో రూ.3లక్షల కోట్లు ఆదా

‘‘తాజా జీఎస్టీ సంస్కరణలతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. పేద, మధ్య తరగతి ప్రజలకు నిత్యావసర వస్తువులు, అవసరమైన సామగ్రి, రైతులకు అవసరమైన వస్తువులు, ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఉపయుక్తమయ్యే వస్తువులు, దేశానికి ఉపయోగపడే సెక్టార్లకు వినియోగమయ్యే పరికరాలు, వస్తువులపై జీఎస్టీని తగ్గించడం ద్వారా ఆయా వర్గాలకు మేలు చేసే ప్రయత్నం చేశాం. బోగస్‌ లబ్ధిదారులను ఆధార్‌ ద్వారా ఏరివేయడం ద్వారా మూడు లక్షల కోట్ల రూపాయలను అనర్హులకు అందకుండా మిగిల్చాం. పన్ను చెల్లింపుదారుల డబ్బు సరిగా వినియోగించాలనుకునే ప్రభుత్వం మాది. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా జీఎస్టీ తీసుకువస్తామని చెప్పి తేలేదు. ప్రతిపక్షాలకు అప్పట్లో సర్దిచెప్పలేకపోయారు’’ అని నిర్మలా సీతారామన్‌ అన్నారు. అనంతరం నూతన స్లాబ్‌ల ప్రకారం ఏయే వస్తువులు జీరో, ఐదు శాతం, 18 శాతం స్లాబుల్లోకి వచ్చాయో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. సదస్సుకు హాజరైన మంత్రి వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు సమాధానాలు ఇవ్వడంతోపాటు ప్రతినిధుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. జీఎస్టీ సంస్కరణలు అకస్మాత్తుగా తీసుకొచ్చినవి కావని, రాష్ట్రాల కౌన్సిల్‌ సమావేశంలో పెద్ద ఎత్తున కసరత్తు జరిగిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. మోదీ నిర్మాణాత్మక చర్యల వల్ల ప్రపంచంలో భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ అన్నారు.


మహిళల గురించే మోదీ ఆలోచనలు..

మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని నిర్మలా సీతారామన్‌ అన్నారు. విశాఖ ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘స్వస్త్‌ నారీ-సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ ప్రారంభ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ‘‘ప్రధాని మోదీకి మహిళలంటే ప్రత్యేక అభిమానం. సీఎంగా ఉండగా గుజరాత్‌లో బాలికా విద్యను ఆయన ప్రోత్సహించారు. ఆయనకు వచ్చిన అనేక బహుమతులకు బహిరంగ వేలం వేసి వచ్చిన సొమ్మును బాలికల చదువుకు కేటాయించేవారు. ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రతి మహిళ పేరిట బ్యాంకుల్లో జనధన్‌ ఖాతాలు తెరిపించిన ఘనత ఆయనదే. కేంద్రం మహిళలకు ఇచ్చిన పథకాల సొమ్ములు అదే ఖాతాలో పడ్డాయి. ఉజ్వల పథకం ద్వారా ఎనిమిది కోట్ల మందికి నేరుగా గ్యాస్‌ సబ్సిడీ జమ అవుతోంది. స్టార్ట్‌పల ద్వారా గ్రామీణ ప్రాంత మహిళలను ప్రోత్సహించారు.గ్రామీణ ప్రాంతంలో బ్యాంకు కరస్పాండెంట్లుగా రెండు లక్షల మంది మహిళలకు ఉపాధి దొరికింది.’’ అని తెలిపారు. రాష్ట్రంలోని 10,572 ఆరోగ్య కేంద్రాల్లో ‘స్వస్త్‌ నారీ-సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా బుధవారం నుంచి అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని సత్యకుమార్‌ వెల్లడించారు. ఆయా కార్యకమాల్లో మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, విశాఖ ఎమ్మెల్యేలు, ఎన్టీఆర్‌ వైద్య సేవా వైస్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభగౌర్‌, కమిషనర్‌ వీరపాండియన్‌, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి, కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, జీఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌, బీఎన్‌ఐ, స్టీల్‌, క్రెడాయ్‌, పన్ను చెల్లింపుదారులు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


‘స్వస్త్‌ నారీ అభియాన్‌’ను ప్రారంభించిన గవర్నర్‌

విజయవాడ (వన్‌టౌన్‌), సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ‘స్వస్త్‌ నారీ, సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ను గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రారంభించారు. మహిళల ఆరోగ్యం, సంక్షేమం కోసం మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మధ్యప్రదేశ్‌లోని ధార్‌ నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. అనంతరం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ వేదిక వద్ద ఏర్పాటుచేసిన మోడల్‌ హెల్త్‌కేర్‌ కియోస్క్‌లను సందర్శించి వైద్య నిపుణులు, రోగులతో సంభాషించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ జి.రఘునందన్‌, గవర్నర్‌ జాయింట్‌ సెక్రటరీ పీఎస్‌ సూర్యప్రకాశ్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 03:19 AM