CM Chandrababu Naidu: జీఎస్టీ 2.0 గేమ్ చేంజర్
ABN , Publish Date - Sep 19 , 2025 | 04:38 AM
జీఎస్టీ 2.0 సంస్కరణలను దేశ ప్రగతికి గేమ్ చేంజర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. వీటివల్ల దేశ ఆర్థిక వ్యవస్థలోకి రూ.2 లక్షల కోట్ల నగదు ప్రవాహం వస్తుందని తెలిపారు.
ఈ సంస్కరణలతో 140 కోట్ల మందికి లబ్ధి: సీఎం
ఆర్థిక వ్యవస్థలోకి 2 లక్షల కోట్ల నగదు ప్రవాహం
సంస్కరణలకు మద్దతిచ్చిన మొదటి రాష్ట్రం మనదే
రాష్ట్ర ఖజానాకు రూ.8 వేల కోట్ల నష్టం.. అయినా ఆ మేరకు ఏపీ ప్రజలకు లబ్ధి
మోదీ దేశానికి సంపద.. పన్నుల తగ్గింపుతో డిమాండ్, ఉత్పాదకత పెరుగుతాయి
తద్వారా కొత్త ఉద్యోగాలు వస్తాయి
పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతుంది
అప్పులు చేసి సంక్షేమం ఇస్తే మనుగడ ఉండదు
జీఎస్టీపై చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజలకు, ఆర్థిక వ్యవస్థలకూ లాభదాయకం
ఆర్థిక ఆటుపోట్లున్నా దేశ ప్రగతి కోసం మద్దతు
జీఎస్టీ 2.0 ప్రయోజనాలు అందరికీ తెలియాలి
అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ 2.0 సంస్కరణలను దేశ ప్రగతికి గేమ్ చేంజర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. వీటివల్ల దేశ ఆర్థిక వ్యవస్థలోకి రూ.2 లక్షల కోట్ల నగదు ప్రవాహం వస్తుందని తెలిపారు. 140 కోట్ల మంది దేశ ప్రజలు లబ్ధి పొందుతారని అన్నారు. రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.8 వేల కోట్ల నష్టం వాటిల్లుతున్నా.. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందన్నారు. నాలుగు శ్లాబుల జీఎస్టీ పన్ను విధానాన్ని 2 శ్లాబులకు కుదించి మరింత సరళీకృతం చేశారని.. అలాగే 12 శాతం పన్ను పరిధిలో ఉన్న 99 శాతం వస్తువులు జీరో శాతానికి రావడం ప్రజలకు నిజమైన పండుగేనని చెప్పారు. వారికి దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలన్నీ ఒకేసారి వచ్చినట్లేనని అన్నారు. గురువారం శాసనసభలో.. జీఎస్టీ సంస్కరణలతో 140 కోట్ల ప్రజలకు మేలు చేస్తున్న ప్రధాని మోదీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామంటూ చంద్రబాబు తీర్మానం చదివి వినిపించారు. అనంతరం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జీఎస్టీ 2.0 సంస్కరణలకు ఆమోదం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని సభ్యులందరూ ఆమోదించినట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రకటించారు.
జీఎస్టీ సంస్కరణలు అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు మేలుచేసే అత్యద్భుతమైన సంస్కరణలని సీఎం చర్చ సందర్భంగా చెప్పారు. వీటికి మద్దతిచ్చిన మొదటి రాష్ట్రం మనదేనన్నారు. ‘ఈ ఏడాది 4.19 ట్రిలియన్ డాలర్ల జీడీపీ, 2,880 డాలర్ల తలసరి ఆదాయం, 760 బిలియన్ డాలర్ల ఎగుమతుల స్థాయికి దేశం ఎగబాకింది. 2014లో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశాన్ని ప్రధాని మోదీ 11 ఏళ్లలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారు. మరో రెండేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం 2038 నాటికి భారత్ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. ఇంత ఉజ్వల అభివృద్ధికి కారణం సరైన సమయంలో సరైన వ్యక్తి మోదీ రూపంలో మన దేశానికి ప్రధానమంత్రి కావడమే’ అని ప్రశంసించారు. ఆయన దేశానికి సంపదన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
మద్దతివ్వాల్సింది పోయి.. పారిపోతారా..?
ఇన్ని భారీ సంస్కరణలు జరుగుతుంటే వైసీపీ ఎమ్మెల్యేలు మద్దతివ్వాల్సిందిపోయి అసెంబ్లీకి రాకుండా పారిపోయారు. ప్రజలకు మేలుచేసే సంస్కరణలకు మద్దతివ్వడం ఇష్టం లేకపోతే.. కనీసం అర్థం చేసుకునే ప్రయత్నమైనా చేయాలి. సంపద సృష్టించలేని వారికి సంక్షేమం ఇచ్చే అధికారం లేదు. అప్పులు చేసి సంక్షేమం ఇస్తే మనుగడ ఉండదు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యం.
ప్రభుత్వానికి రూ.800 కోట్లు మిగులు
జీఎస్టీ 2.0లో భాగంగా ఆరోగ్య బీమా ప్రీమియంపై ఉన్న 18 శాతం పన్నును తీసివేయడం వల్ల ప్రభుత్వం ప్రతిపాదించిన యూనివర్సల్ హెల్త్‌కేర్ పథకానికి రూ.800 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. 2 శ్లాబుల పన్ను విధానం, ఆటోమేటిక్ రిజిస్ర్టేషన్లు చిన్నవ్యాపారాలకు మార్గం సుగమం చేస్తాయి. రా మెటీరియల్స్, ప్యాకేజింగ్, వ్యవసాయ వస్తువులపై పన్ను తగ్గడం వల్ల ఆత్మనిర్భర్ భారత్ ఊపందుకుంటుంది. మూడ్రోజుల్లో ఆటోమేటిక్‌గా వ్యాపారాల రిజిస్ర్టేషన్ వల్ల కార్యకలాపాలు వేగంగా జరుగుతాయి. రాష్ట్రాల మధ్య సరిహద్దు చెక్‌పోస్టులు లేకపోవడం వల్ల 30ు వేగంగా రవాణా కార్యకలాపాలు జరుగుతాయి. పన్ను రీఫండ్ ఆటోమేటిగ్గా జరగడం వల్ల నిధుల లభ్యత పెరిగి వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఏఐని ఉపయోగించుకుని ఉల్లంఘనలు జరిగిన చోటనే తనిఖీలు, విచారణలు ఉంటాయి. అందరినీ ఇబ్బంది పెట్టడం ఉండదు.
అద్భుత ఫలితాలు..
2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రస్తుతానికి పరోక్ష పన్నుదారులు 65 లక్షల నుంచి 1.51 కోట్లకు (132 శాతం) పెరిగారు. 2018లో జీఎస్టీ వసూళ్లు రూ.7.19 లక్షల కోట్లు ఉండగా.. 2025 నాటికి రూ.22.08 లక్షల కోట్లకు పెరిగాయి. రెండు శ్లాబులను పూర్తిగా తీసేయడం.. వందల కొద్దీ వస్తువులపై పన్నులు సవరించడం (తగ్గించడం) వల్ల వినియోగం పెరుగుతుంది. దీంతో డిమాండ్, ఉత్పాదకత పెరుగుతాయి. తద్వారా కొత్త ఉద్యోగాలు వస్తాయి. వాటి రాకతో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతుంది. ఈ సంఖ్య పెరిగితే పన్నులు మరింత తగ్గుతాయి. పాలు, పనీర్, పెరుగుపై ఉన్న 5 శాతం పన్నుతీసివేశారు. నిత్యావసరాలు, షాంపూ, టూత్‌పే్‌స్ట, తలనూనెలు, సబ్బులు, వెన్న నెయ్యి, వంటపాత్రలపై ఉన్న 12 శాతం పన్ను 5 శాతానికి తగ్గుతోంది. కార్లు, ఫ్రిజ్‌లు, ఏసీలపై పన్ను 18 శాతానికి తగ్గించారు. ఇలా అన్ని రంగాల్లోనూ.. ముఖ్యంగా వ్యవసాయ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో పన్నులు తగ్గడం ప్రజలకు మేలు చేసే అంశం.
11 ఏళ్లలో ఎన్నో సాధించాం..
2014 తర్వాత 144 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వచ్చాయి ఎయిర్‌పోర్టులు రెట్టింపు అయ్యాయి. 60 శాతం హైవేలు కొత్తగా వేశారు. డీబీటీ లావాదేవీలు 90 శాతం పెరిగాయి. 2.7 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగింది. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 34 శాతం పెరిగాయి. స్వదేశీ రక్షణ వ్యవస్థలు తయారు చేసుకున్నాం. 80 కోట్ల మందికి బియ్యం పంపిణీ జరుగుతోంది. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు. స్టార్ట్‌పలు 350 నుంచి లక్షన్నరకు పైగా పెరిగాయి. వందల ఉత్పత్తుల ధరలు 22వ తేదీ నుంచి తగ్గిపోతున్నాయి. వీటిపై ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. 22 నుంచి అక్టోబరు 22 వరకు ఈ అవగాహన కార్యక్రమం కొనసాగాలి.
6 గంటలు మనసుపెట్టి..
ఎమ్మెల్యేలు 6గంటలు మనసు పెట్టి అసెంబ్లీలో కూర్చుని సమస్యలు అర్థం చేసుకోవాలి. మంత్రులు, సంబంధిత అధికారులు సభలో ఉండాలి. ఈ అసెంబ్లీ 175 మంది కోసం కాదు.. ఐదు కోట్ల మంది భవిష్యత్ కోసం. ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో నమ్మకంతో ప్రార్థనలు చేస్తాం. చట్టసభలు పవిత్ర దేవాలయాలు. రేట్ల తగ్గింపుపై ప్రచారమే కాదు.. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సంస్కరణలు తెచ్చే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుంది. నేను వారానికి 3 రోజులు యోగా చేస్తున్నా.. యోగా దినోత్సవం రోజున మీరంతా ఫొటోలకు పోజులిచ్చారు.. కానీ రోజూ చేయడం లేదు కదా! రోజు యోగా చేయండి.. ఆరోగ్యానికి మంచిది.
భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలి. ఇందులో తెలుగువారి పాత్ర ప్రముఖంగా ఉండాలనేదే నా ఆకాంక్ష. జీఎస్టీ సంస్కరణలతో స్వర్ణాంధ్ర విజన్-2047లోని 10 సూత్రాలు ఊపందుకుంటాయి.
కొంతమంది ఆపరేషన్ సిందూర్‌ను ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు అమెరికా లాంటి దేశం కూడా ఇండియాతో సంబంధాల కోసం ఎదురుచూపులు చూస్తోంది. ఇది మోదీ ఘనత.
- సీఎం చంద్రబాబు
ఎన్టీఆర్‌కు నివాళికి 10 మందేనా?
ప్రజాప్రతినిధుల గైర్హాజరుపై సీఎం సీరియస్
అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాల తొలిరోజు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు నివాళి అర్పించడం ఆ పార్టీ ఆనవాయితీ. అయితే గురువారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, కాగిత కృష్ణ ప్రసాద్, బూర రామాంజనేయులు, బోడె ప్రసాద్, తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాత్రమే ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొన్నేళ్లుగా పాటిస్తున్న సంప్రదాయాన్ని విస్మరించడం ఏమిటని విప్‌లపై సీరియస్ అయ్యారు.