CM Chandrababu Naidu: రాష్ట్రంలో అమల్లోకి కొత్త శ్లాబులు
ABN , Publish Date - Sep 22 , 2025 | 03:48 AM
జీఎస్టీ విధానంలో కొత్త అధ్యాయం మొదలైంది. పేదలు, మధ్యతరగతి వర్గాలపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ కేంద్రం ప్రకటించిన సంస్కరణలు ఆదివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి.
పేద, మధ్యతరగతి వర్గాలకు భారీ ఊరట
తెలుగులో జీఎస్టీ 2.0 సంస్కరణల ఉత్తర్వులు
11 జీవోల బుక్‌లెట్‌ను ఆవిష్కరించిన బాబు
కొత్త విధానంపై అధికారులతో సీఎం సమీక్ష
అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ విధానంలో కొత్త అధ్యాయం మొదలైంది. పేదలు, మధ్యతరగతి వర్గాలపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ కేంద్రం ప్రకటించిన సంస్కరణలు ఆదివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. 2017 నుంచి 4 శ్లాబులను అమలు చేస్తుండగా జీఎస్టీ కౌన్సిల్ వాటిని రెండుకు కుదించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 22 నుంచి ప్రజల దైనందిన జీవితంలో వినియోగించే అనేక వస్తువులపై పూర్తిగా పన్ను మినహాయింపు లభించనుంది. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇప్పటివరకు 12 శాతం శ్లాబు పరిధిలో ఉన్న 99శాతం వస్తువులు 5 శాతం పరిధిలోకి వచ్చాయి. అటు ఉత్పత్తిదారులు, వ్యాపారులు, ఇటు వినియోగదారులకు భారీ ఊరట కల్పించే జీఎస్టీ సంస్కరణలను సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త పన్నుల విధానాన్ని ప్రజలు సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా జీఎస్టీ 2.0కు సంబంధించిన మొత్తం 11 జీవోలను రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ ఇంగ్లిష్‌తో పాటు తొలిసారి తెలుగులోనూ విడుదల చేసింది. ఈ జీవోల బుక్‌లెట్‌ను సీఎం చంద్రబాబు ఆదివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు చేకూరే ప్రయోజనాలు, కొత్త పన్నుల విధానంపై అధికారులతో ఆయన సమీక్షించారు. పాలనాపరమైన వ్యవహారాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే వాణిజ్య పన్నుల శాఖ మొదటిసారిగా జీవోలను తెలుగులో విడుదల చేసిందని, ఈ నిర్ణయాన్ని వ్యాపారులు, అకౌంటెంట్లు, అధికారులు, ఉద్యోగులు, నిపుణులు అభినందిస్తున్నారని ఆ శాఖ ప్రధాన కమిషనర్ అహ్మద్‌బాబు తెలిపారు. జీఎస్టీ సంస్కరణల గురించి ఆయన వివరించారు.
ప్రజలే ముందు
‘జీఎస్టీ 2.0 అనేది కేవలం పన్ను సంస్కరణ మాత్రమే కాదు.. ప్రజలే ముందు అనే విధానమిది. ఇది ఖర్చులను తగ్గిస్తుంది. అనుసరించే విధానాన్ని సులభతరం చేస్తుంది. ప్రతి ఇంటిని, రైతులను, విద్యార్థులను శక్తిమంతులుగా చేయడంతోపాటు వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ట్రాక్టర్ల నుంచి పాఠ్య పుస్తకాలు, మందుల వరకు ఆదా చేసిన ప్రతి రూపాయి సుస్థిరాభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి ఇది కేవలం పన్ను సంస్కరణ కాదు.. ఇదొక మార్పు.
ప్రజలకు రూ.8వేల కోట్ల లబ్ధి
జీఎస్టీ 2.0 ద్వారా రాష్ట్ర ప్రజలకు దాదాపు రూ.8 వేల కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుంది. వెన్న, నెయ్యి, పనీర్, సబ్బులు, షాంపూ, హెయిర్ ఆయిల్, ప్రాసెస్డ్ ఫుడ్, బిస్కెట్లు, కాఫీ తదితర వస్తువులపై పన్ను తగ్గింది. అలాగే పాశ్చరైజ్డ్ పాలు, ప్యాకేజ్డ్ పనీర్, బ్రెడ్ వంటి వాటికి జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు లభించింది. ద్విచక్ర వాహనాలు, చిన్నకార్లు, టీవీలు, ఏసీలు, సిమెంట్ తదితరాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో మధ్యతరగతి వర్గాలకు భారీ ఊరట లభించనుంది. స్వీట్లు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లపై పన్ను 5 శాతానికి తగ్గింది. వ్యవసాయ రంగానికి ఉపయోగపడే ఎరువులు, పురుగుమందులు, ట్రాక్టర్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. చేనేత, చేతివృత్తులవారిని ప్రోత్సహించడానికి ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు.
పర్యాటకం, సేవారంగాలకు ఊతం
సేవారంగం, హోటల్ వసతులపై జీఎస్టీ తగ్గింపు వల్ల హోటల్ చార్జీలు తగ్గుతాయి. తద్వారా పర్యాటక రంగానికి ప్రోత్సాహంగా ఉంటుంది. ధరలు తగ్గడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఎంఎ్‌సఎంఈ రంగానికి, ఉపాధి కల్పనకు బలం చేకూరుతుంది. ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెట్టి, కొన్ని ప్రాణ రక్షక మందులు, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని పూర్తిగా తొలగించారు. దీనివల్ల ఒక్కో వినియోగదారుడికి రూ.లక్ష వరకూ ఆదా అవుతుందని అంచనా.
సంస్కరణలతో రాష్ట్రానికి ప్రయోజనం
‘ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన, సంతోషకరమైన సమాజాన్ని సాధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య సాధనకు జీఎస్టీ 2.0 సంస్కరణలు దోహదం చేస్తాయి. ప్రభుత్వం నిర్దేశించిన 10 మార్గదర్శక సూత్రాలైన పేదరికం లేని సమాజం, జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యం, ఉపాధి, నీటి భద్రత, రైతు సంక్షేమం, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ అభివృద్ధి, ఇంధన వినియోగంలో ఖర్చు తగ్గింపు, చేతివృత్తుల అభివృద్ధి, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ సాంకేతికత వినియోగం వంటి సూత్రాల సాధనకు ఈ సంస్కరణలు తోడ్పడతాయి’ అని వాణిజ్య పన్నులశాఖ ప్రధాన కమిషనర్ అహ్మద్‌బాబు వివరించారు.