Popularity of AYUSH: ఆయుష్‌కు ఆదరణ పెరుగుతోంది
ABN , Publish Date - Aug 26 , 2025 | 06:47 AM
ఆయుష్ శాఖల వైద్య విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, ప్రజల నుంచి వీటికి ఆదరణ లభిస్తోందని ఆయుర్వేద విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ సాయి సుధాకర్, యునాని అసిస్టెంట్ డైరెక్టర్ వై.శేఖర్ చెప్పారు.
జోన్-2 మేళాలో ఆయా విభాగాల రాష్ట్ర ఏడీల వెల్లడి
ఏలూరు అర్బన్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ఆయుష్ శాఖల వైద్య విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, ప్రజల నుంచి వీటికి ఆదరణ లభిస్తోందని ఆయుర్వేద విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ సాయి సుధాకర్, యునాని అసిస్టెంట్ డైరెక్టర్ వై.శేఖర్ చెప్పారు. ఈ వైద్య విధానంలో చేపట్టిన సంస్కరణలు, విస్తరణలో భాగంగా జోన్-2 పరిధిలోని ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని ఆయుర్వేద, హోమియో, యునాని మందుల తయారీ యూనిట్లు, రిటైల్ షాపుల నిర్వహణ, రెన్యువల్స్ కోసం ఏలూరులో మేళా నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన మేళాలో సాయి సుధాకర్, వై.శేఖర్ మాట్లాడారు. చిత్తూరు, ధర్మవరం, కాకినాడల్లో ప్రైవేటు రంగంలో కొత్తగా ఆయుర్వేద కళాశాలలు స్థాపించే ప్రతిపాదనలు ఉన్నాయని సాయి సుధాకర్ చెప్పారు. ఆయుర్వేద వైద్యం పొందినవారు వైద్య ఖర్చులను తిరిగి పొందేందుకు ఉద్దేశించిన చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించిందని, దీనివల్ల వైద్య ఖర్చులను ప్రైవేటు ఆయుర్వేద క్లినిక్‌లకు ప్రభుత్వం రీయింబర్స్ చేస్తోందని తెలిపారు. అమరావతి పరిధిలోని మూలపాడు వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో హెర్బల్ మెడిసినల్ ప్లాంట్, ల్యాబ్ స్థాపనకు మెడిసినల్ ప్లాంట్ బోర్డుతో ఒప్పందం జరిగిందని తెలిపారు. విజయవాడ సమీపంలోని కాటూరి మెడికల్ కాలేజీ పక్కన 10 ఎకరాల విస్తీర్ణంలో నేచురోపతి రీసెర్చి స్టేషన్ ఏర్పాటుకు కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసిందన్నారు.