Share News

Guntur District: వద్దన్నా పెళ్లి చేసుకున్నాడని..నవ వరుడిని చంపేశారు

ABN , Publish Date - Oct 08 , 2025 | 04:07 AM

ప్రేమ పెళ్లి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆమె అన్న.. మరో ఇరువురితో కలిసి నవ వరుడు కుర్రా నాగ గణేశ్‌(25)ను...

Guntur District: వద్దన్నా పెళ్లి చేసుకున్నాడని..నవ వరుడిని చంపేశారు

  • పెళ్లయిన 12 రోజులకే హత్య చేసిన బావమరిది

  • మరో ఇద్దరితో కలిసి కత్తులతో పొడిచి..

  • గుంటూరు జిల్లాలో ఘాతుకం

  • పోలీసులను రక్షణ కోరినా దక్కని ఫలితం

గుంటూరు, గుంటూరు కార్పొరేషన్‌, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రేమ పెళ్లి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆమె అన్న.. మరో ఇరువురితో కలిసి నవ వరుడు కుర్రా నాగ గణేశ్‌(25)ను కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం పాత గుంటూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పొన్నూరు రోడ్డులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కుర్రా నాగ గణేశ్‌ స్వగ్రామం బాపట్ల జిల్లా వేమూరు మండలం యడవూరు. కుటుంబంతో కలిసి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సంగంజాగర్లమూడిలో ఉంటున్నారు. గణేశ్‌ గుంటూరులోని పవర్‌ ఆఫీసులో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన షిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తూ, కార్యాలయానికి సమీపంలోని బుడంపాడులో మూడు నెలలుగా నివాసం ఉంటున్నాడు. కొద్ది నెలల క్రితం నాగ గణేశ్‌ తెనాలి రూరల్‌ మండలం కొలకలూరుకు చెందిన కీర్తి అంజనీదేవి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లాడు. పెళ్లిచూపుల్లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే అంజనీదేవి సోదరుడు, కుటుంబ సభ్యులు ఈ సంబంధాన్ని నిరాకరించారు. అయినప్పటికీ ఇరువురూ ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమించుకున్నారు. ఈక్రమంలో గత నెల 25న ఇంట్లో చెప్పకుండా పారిపోయి అమరావతి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. వివాహ అనంతరం బుడంపాడులో కాపురం పెట్టారు.


పోలీసుల కౌన్సెలింగ్‌..: ప్రేమించి పెళ్లి చేసుకున్న నవజంట రక్షణ కోరుతూ నల్లపాడు పోలీసులను ఆశ్రయించగా, సీఐ వంశీధర్‌ ఇరు కుటుంబాలనూ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. అయితే వరుడు నాగ గణేశ్‌ను చంపేస్తానంటూ స్టేషన్‌ వద్ద కూడా వధువు అన్న దుర్గారావు హెచ్చరించినట్లు తెలిసింది. దుర్గారావు హెచ్చరికలను గణేశ్‌ సీరియ్‌సగా తీసుకోకపోయినప్పటికీ, పెళ్లయినప్పటి నుంచి గతంలో లాగా స్వేచ్ఛగా బయట తిరగకుండా ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తన స్నేహితుడైన సంగుల కరుణ అనే యువకుడితో కలిసి నాగ గణేశ్‌ ద్విచక్ర వాహనంపై గుంటూరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌కు వెళ్లి బంగారం కుదువపెట్టి డబ్బు తీసుకున్నాడు. తిరిగి పొన్నూరు రోడ్డు మీదుగా ఇరువురూ ఇంటికి వెళ్తుండగా, మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో దుర్గారావు మరో ఇరువురుతో కలిసి వీరిని అడ్డగించి గొడవపడ్డాడు. తొలుత నాగ గణేశ్‌ రాయితో కొట్టి ఆ తర్వాత కత్తులతో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. స్నేహితుడు కరుణ వెంటనే గుంటూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Oct 08 , 2025 | 04:08 AM