ప్యాసింజర్ రైలుకు పచ్చజెండా
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:10 AM
నంద్యాల జిల్లా వాసులకు కేంద్రం శుభవార్తను అందించింది. త్వరలో జిల్లా మీదుగా గుంతకల్లు- మార్కాపురం ప్యాసింజర్ సర్వీస్ సదుపాయం ఏర్పాటుకానుంది.
త్వరలో నంద్యాల మీదుగా ప్రారంభం
గుంతకల్-మార్కాపురం వరకు సర్వీస్
కేంద్ర రైల్వేశాఖ అనుమతి
భవిష్యత్తులో గుంటూరు వరకు పొడిగింపు
అన్ని వర్గాల వారికి ఊరట
నంద్యాల, డిసెంబరు23(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా వాసులకు కేంద్రం శుభవార్తను అందించింది. త్వరలో జిల్లా మీదుగా గుంతకల్లు- మార్కాపురం ప్యాసింజర్ సర్వీస్ సదుపాయం ఏర్పాటుకానుంది. రోజుకు రెండు సార్లు ప్రయాణ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకుంది. ఇందుకు సంబందించి గుంతకల్లు- మార్కాపురం ప్యాసింజర్ సర్వీ్‌సకు మంగళవారం కేంద్ర రైల్వేశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో అతి త్వరలోనే సదరు సర్వీస్ ప్రారంభం కానుంది. తద్వారా సాధారణ, మద్య తరగతి తదితర వర్గాలకు ఊరట కలిగనుంది. ఇదిలా ఉండగా.. ఇదే అంశంపై ఇటీవల ఎంపీ బైరెడ్డి శబరి సైతం పార్లమెంట్‌లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా నంద్యాల మీదుగా అటు గుంతకల్లు.. ఇటు మార్కాపురం వరకు కొత్తగా ప్యాసింజర్ రైలు సదుపాయం కల్పించడం నంద్యాల జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారినట్లైంది. సదరు సర్వీస్ త్వరలో గుంటూరు వరకు ప్రయాణ సదుపాయం కలిగించే అవకాశం ఉందని సమాచారం.
నంద్యాల మీదుగా...
సదరు సర్వీస్ ప్రారంభం కాగానే.. గుంతకల్లు- మార్కాపురం రోడు ప్యాసింజర్ (57407) గుంతకల్లులో సాయంత్రం 5.30కి బయలుదేరి నంద్యాలకు 08.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి 8.35 ప్రారంభమై. 11.30 మార్కాపురానికి చేరుకుంటుంది. మార్కాపురం- గుంతకల్లు సర్వీస్ (57408) మార్కాపురంలో ప్రతి రోజు ఉదయం 4.30గంటలకు బయలుదేరుతుంది. ఉదయం 7.20 గంటలకు నంద్యాలకు చేరుకుటుంది. ఆ తర్వాత 7.25 బయలుదేరి గుంతకల్లుకు 10.30కి చేరుకుటుంది. ఇలా నూతన ప్యాసింజర్ సర్వీస్ ప్రతి రోజు నంద్యాల మీదుగా వెళ్లనుంది.
గుంతకల్లుకు వెళ్లాలంటే నిరీక్షణే..
గుంతకల్లు వెళ్లాలంటే ప్రస్తుతం జిల్లా వాసులకు నిరీక్షణ తప్పడం లేదు. త్వరలో వచ్చే కొత్త సర్వీస్‌తో ఈ బెడద తీరనుంది. నంద్యాలతో పాటు మార్కాపురం ప్రజలు గుంతకల్లుకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. అమరావతి రైలు తప్పితే.. నేరుగా గుంతకల్లు వెళ్లలేని దుస్థితి. సదరు రైలు తప్పిపోతే.. కర్నూలు మీదుగా వెళ్లే.. నంద్యాల- కర్నూలు, గుంటూరు- సికింద్రబాదు సర్వీ్‌సకు వెళ్లి పోవాల్సిన పరిస్థితి. తాజా కొత్తగా వచ్చే గుంతకల్లు- మార్కాపురం ప్యాసింజర్ సదుపాయంతో గుంతకల్లుకు చుట్టూతిరిగి వెళ్లకుండా.. నంద్యాల మీదుగా నేరుగా వెళ్లే సదుపాయం కలిగినట్లైంది. పైగా ప్రయాణికులకు గంటల ప్రయాణం సమయం తగ్గనుంది.
పార్లమెంట్‌లో ప్రస్తావించిన ఎంపీ..
జిల్లా మీదుగా గుంతకల్లు- మార్కాపురం ప్యాసింజర్ సర్వీస్ రావడానికి ఎంపీ బైరెడ్డి శబరి పలుమార్లు ప్రయత్నం చేసిన తెలిసిందే. వీటితో పాటు మరికొన్ని సర్వీ్‌సలు కూడా కేంద్ర రైల్వేశాఖ, మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం గుంతకల్లు- మార్కాపురం సర్వీ్‌సకు కేంద్ర రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. సదరు సర్వీస్ కూడా గుంతకల్లు- గుంటూర్ వరకు పొడిగించాలని ఎంపీ పార్లమెంట్‌లో కోరగా.. డబుల్ లైన్ల పనుల నేపథ్యంలో గుంతకల్లు- మార్కాపురం వరకు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. వీటితో పాటు పార్లమెంట్‌లో ఎంపీ శబరి విశాఖపట్నం- కర్నూలు, విజయవాడ- గుంతకల్లు ఇంటర్‌సీటీ, నంద్యాల తిరుపతి డెమో సర్వీస్ కాకుండా రెగ్యులర్ రైలు సదుపాయం కల్పించాలని కోరిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా కొత్త సర్వీస్ ఆమోదంలో ఎంపీ శబరి కృషి కూడా ఉన్నట్లైంది.
రైలు ఆగే స్టేషన్లు ఇవే
సదరు కొత్త సర్వీస్ గుంతకల్లు- మార్కాపురం మధ్యలోని కర్నూలు జిల్లాలోని మద్దికెర, పెండేకల్లు, నంద్యాల జిల్లాలోని డోన, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లె, ప్రకాశం జిల్లాలోని దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లె, జగ్గంబోట్ల కృష్ణాపురం, కంభం, తుర్లపాడు ఆగుతూ మార్కాపురానికి చేరుకుంటుంది.
నాలుగు జిల్లా వాసులకు..
త్వరలో ప్రారంభమయ్యే గుంతకల్లు- మార్కాపురం ప్యాసింజర్ సర్వీ్‌సతో అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లా వాసులకు ఎంతో ప్రయోజనం. ఎక్కువగా నంద్యాల, గిద్దలూరు, కంభం ప్రాంత ప్రజలకు కలిసి రానుంది. గతంలో నేరుగా గుంతకల్లుకు వెళ్లాలంటే అన్నివర్గాల ప్రజలకు ఎంతో ఇబ్బందులు పడేవారు. తాజా కొత్త సర్వీ్‌సతో ఆయా అవస్థలు తప్పినట్లైవుతుంది. సదరు సర్వీ్‌సతో విద్యార్థులు, వ్యాపారులు, తదితర ఇతరవర్గాలకు చెందిన ప్రయాణికులకు ఊరట కల్పించే అంశం. గతంలో మాదిరిగా కాకుండా ఎలాంటి ఇబ్బందులు.. నిరీక్షణ లేకుండా తక్కువ చార్జీతో ప్రయాణ సౌకర్యం కల్పించినట్లైంది.
రైల్వేమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు
పార్లమెంట్‌లో ప్రస్తావించిన కొన్నిరోజుల వ్యవధిలోనే ప్రజల సమస్యను గుర్తించి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ నంద్యాల మీదుగా గుంతకల్లు- మార్కాపురం ప్యాసింజర్ సర్వీ్‌స కు గ్రీనసిగ్నల్ ఇవ్వడం సంతోషంగా ఉంది. మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు. సదరు సర్వీస్ రావడం అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం.