Share News

Nara Lokesh: గ్రీన్‌ ఎనర్జీతో స్వగ్రామంలోనే ఉద్యోగం

ABN , Publish Date - Aug 07 , 2025 | 03:48 AM

గ్రీన్‌ ఎనర్జీ రంగం ద్వారా యువతకు సొంత గ్రామాల్లోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.

Nara Lokesh: గ్రీన్‌ ఎనర్జీతో స్వగ్రామంలోనే ఉద్యోగం

  • యువత నైపుణ్యాలు పెంచుకోవాలి

  • పునరుత్పాదక ఇంధన పరిశ్రమలు వస్తున్నాయ్‌

  • క్లస్టర్లవారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం

  • సెప్టెంబరు 1న నైపుణ్యం పోర్టల్‌ ప్రారంభిస్తాం

  • ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

  • గ్రీన్‌ ఎనర్జీ నైపుణ్య సదస్సులో మంత్రి లోకేశ్‌

అమరావతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): గ్రీన్‌ ఎనర్జీ రంగం ద్వారా యువతకు సొంత గ్రామాల్లోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఈ రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలున్నాయని చెప్పారు. అందుకే పవన, సౌర, రెన్యూవబుల్‌, పంప్డ్‌ స్టోరేజ్‌, సీబీజీ ప్రాజెక్టులపై ఎక్కువ దృష్టి సారించామన్నారు. ‘గ్రీన్‌ ఎనర్జీ ఫ్యూచర్‌- సౌర, పవన విద్యుత్‌లో ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్య కేంద్రం’ పేరుతో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, స్వనీతి ఇనీషియేటివ్‌ అనే ప్రైవేటు సంస్థ సంయుక్తంగా బుధవారం విజయవాడలో సదస్సు నిర్వహించాయి. ఇందులో మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్నారు. ప్రతి వంద కిలోమీటర్లకు ఒక క్లస్టర్‌ ఏర్పాటుచేసి ఆయా రంగాల్లో టాప్‌-20 కంపెనీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో అనేక పరిశ్రమలు రాష్ర్టానికి వస్తున్నాయని తెలిపారు. నైపుణ్యం గల యువతను ప్రైవేటు సంస్థలతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబరు 1న నైపుణ్యం పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. సుజ్లాన్‌ అనే సంస్థ ఇప్పటికే రాష్ట్రంలో రెండు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేసిందని తెలిపారు. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది తమ లక్ష్యమన్నారు. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో కూడా స్థానికంగానే మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.


160 గిగావాట్ల లక్ష్యంతో గ్రీన్‌ ఎనర్జీ పాలసీ

పునరుత్పాదక విద్యుత్‌ 160 గిగావాట్లు లక్ష్యంగా గ్రీన్‌ ఎనర్జీ పాలసీ అమలుచేస్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. గత ప్రభుత్వం చేసిన దాడుల వల్ల రాష్ర్టానికి పెట్టుబడిదారులు రాలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా రావడానికి వెనుకాడారని చెప్పారు. గుజరాత్‌లో సీఎం చంద్రబాబు ఇచ్చిన ప్రజెంటేషన్‌ చూశాక పెట్టుబడులు రావడం ప్రారంభమైందన్నారు. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో ఇప్పటివరకూ ఎంవోయూలు చేసుకున్నామని, ఇకనుంచి ప్రాజెక్టులను గ్రౌండింగ్‌ చేస్తామని చెప్పారు. 2029 నాటికి అన్ని ప్రాజెక్టులు వినియోగంలోకి వస్తాయన్నారు. ఈ ప్రాజెక్టుల అమలుకు నైపుణ్యం కలిగిన యువత కోసం నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇప్పిస్తామన్నారు. అయితే సదస్సుకు 250 సంస్థలు వస్తాయని ముందురోజు ప్రకటించారు. సదస్సులో మాత్రం చాలా తక్కువ కంపెనీలే పాల్గొన్నాయి. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌ తప్ప అధికారులెవరూ సదస్సులో కనపడకపోవడం చర్చనీయాంశమైంది. గ్రీన్‌ ఎనర్జీ సదస్సులో నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌ బూరుగుపల్లి శేషారావు, నెడ్‌క్యాప్‌ వైస్‌ చైర్మన్‌ కమలాకర్‌బాబు, స్వనీతి ఇనిషియేటివ్‌ సీఈవో రిత్వికా భట్టాచార్య పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2025 | 03:50 AM