మహా.. మట్టి గణపతి
ABN , Publish Date - Aug 27 , 2025 | 01:36 AM
ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, పొల్యూషన కంట్రోల్ బోర్డు ‘ఎకో ఫ్రెండ్లీ గణేశ్’ కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన స్టేడియంలో మంగళవారం నిర్వహించింది. స్టేడియంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఐదు వేల మందితో ఒకే సారి 7,730 గణేశ్ ప్రతిమలను తయారు చేయించారు. దీనికి గానూ బెజవాడ మట్టి గణపతి కార్యక్రమం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
- బెజవాడ మట్టి గణపయ్యకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- ఐదు వేల మందితో రెండు గంటల్లో 7,730 గణేశ్ బొమ్మలు సిద్ధం
- ఇందిరాగాంధీ స్డేడియం, మరిన్ని ప్రాంతాల్లో కోలాహలంగా మట్టి బొమ్మల తయారీ
- మహారాష్ట్ర రికార్డ్‌ను అధిగమించిన బెజవాడ మట్టి గణపయ్య
- మంత్రి, ఎంపీ, కలెక్టర్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పత్రం అందజేత
- పండుగలు పర్యావరణ హితం కావాలి: జిల్లా ఇనచార్జి మంత్రి సత్యకుమార్
విజయవాడ సిటీ, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి):
ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, పొల్యూషన కంట్రోల్ బోర్డు ‘ఎకో ఫ్రెండ్లీ గణేశ్’ కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన స్టేడియంలో మంగళవారం నిర్వహించింది. స్టేడియంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఐదు వేల మందితో ఒకే సారి 7,730 గణేశ్ ప్రతిమలను తయారు చేయించారు. దీనికి గానూ బెజవాడ మట్టి గణపతి కార్యక్రమం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఎన్టీఆర్ జిల్లా ఇనచార్జి మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ పండుగలు పర్యావరణ హితం కావాలన్నారు. వినాయక చవితి పండుగ ప్రాశస్థ్యాన్ని ప్లాస్టర్ ఫారీస్ పాడు చేస్తుందని, భయంకరమైన రసాయనాలకు స్వస్తి చెప్పాలని, మట్టి గణపతినే పూజించాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీ ఎత్తున చేపట్టిన కార్యక్రమానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు దక్కడం అభినందనీయమన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) మాట్లాడుతూ అధ్యాత్మిక శోభతో వినాయక చవితి జరుపుకోవాలన్నారు. రానున్న రోజుల్లో విజయవాడ ఉత్సవ్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ 15 ఏళ్ల క్రితం మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలకే పూజలు జరిగేవని గుర్తు చేశారు. మధ్యలో వచ్చిన ప్లాస్టర్ ఆఫ్ పారీస్ భూతం పండుగ వాతావరణాన్ని, పర్యావరణాన్ని నాశనం చేసిందన్నారు. మట్టి బొమ్మలకే పూజలు చేసి నగరాన్ని కాపాడుకుందామన్నారు. పొల్యూషన కంట్రోల్ బోర్డు చైర్మన పి.కృష్ణయ్య మాట్లాడుతూ విశాఖపట్నం, విజయవాడలో వాయు కాలుషాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతలో కృషి చేయాలన్నారు. కలెక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత లక్ష్యాలను చేరుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను పూజించి ప్రకృతి శోభతో అధ్యాత్మిక వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు. 20 విద్యాసంస్థల విద్యార్ధులు, 20 స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నట్లు చెప్పారు. మన మట్టి గణేశ్ ప్రపంచ రికార్డును సాధించడంలో సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాట్లాడుతూ ఎలాంటి రుసుము లేకుండా పందిర్లకు అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు శబ్ధకాలుష్యం సృష్టించకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, ఆర్డీవో కావూరి చైతన్య, పీసీబీ ఈఈ ఇ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందజేత
విజయవాడలో నిర్వహించిన మహా మట్టి గణపతి కార్యక్రమం వరల్డ్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుందని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్ట్స్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఇలియాజర్ ప్రకటించారు. గతంలో 4,464 ప్రతిమలను ఏకకాలంలో తయారు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ రికార్డ్ ఉందన్నారు. అయితే విజయవాడలో 19 ప్రదేశాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐదు వేల మంది పాల్గొని 7,730 ప్రతిమలను తయారు చేసి మహారాష్ట్ర రికార్డును అధిగమించారని వెల్లడించారు. ప్రతిమలను తయారు చేసిన ప్రతి స్థానంలోనూ తమ ప్రతినిధులు ఉండి క్షణ్ణంగా పరిశీలించామని, దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను లండనలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యాలయానికి పంపామన్నారు. అక్కడి ప్రతినిధులు స్క్యూట్నీ చేసిన తర్వాత సర్టిఫికెట్‌ను మంజూరు చేశారని తెలిపారు. మంజూరైన రికార్డ్స్ పత్రాన్ని మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌లకు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్ట్స్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఇలియాజర్‌ను సన్మానించారు.
విద్య, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో..
వన ఎర్త్ వన లైఫ్ ఆర్గనైజేషన, స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్, శ్వాసా ఫౌండేషన, సాయిప్రేమా సెంటర్ ఫర్ చిల్డ్రన, రోజ్ సొసైటీ, టాటా లైఫ్ ఇన్సూరెన్స, రోటరీ క్లబ్, ఎస్‌ఎనజీ ఫౌండేషన, టచింగ్ సోల్స్ ఆర్గనైజేషన, ఏపీ చాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ర్టీ, సుభశ్రీ క్రియేషన్స, మార్గమ్ ఫౌండేషన, విజయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్‌ఆర్‌ఆర్ సీవీఆర్ కాలేజీ, స్టెల్లా కాలేజీ, నలంద డిగ్రీ, పీజీ కాలేజీలు, మహిళా సిద్ధార్థ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పీబీ సిద్ధార్థ కాలేజీ, కేబీఎన కాలేజీ, నిమానూరు జెడ్పీహెచఎస్, పటమట జెడ్పీహెచఎస్, బీఎస్‌ఆర్‌కే స్కూల్, గందికి ఎంసీహెచఎస్, సీవీఆర్, విజ్ఞాన విహార్, శ్రీరామ్ పబ్లిక్, వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్ని వినాయక ప్రతిమలను తయారు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న యాజమాన్యాలకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు.