మెట్లపల్లిలో గ్రావెల్ దొంగలు!
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:13 AM
మెట్లపల్లి అడవిలో గుట్టుగా జరిగిన గ్రావెల్ తవ్వకాల బాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎకరం పైగా అటవీ విస్తీర్ణంలో గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. సరిగ్గా ఈ ఏడాది జూన్, జూలైల మధ్యలో ఈ అక్రమ తవ్వకాలు జరిగినట్టు తెలుస్తోంది. అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ (పీసీసీఎఫ్)కు ఫిర్యాదు అందటంతో ఈ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి.
- అటవీ ప్రాంతంలో గుట్టుగా తవ్వకాలు.. రాత్రివేళ తరలింపు
- ట్రాక్టర్లు, జేసీబీలను పట్టుకుని గార్డుకు అప్పగించిన స్థానికులు
- వదిలేసిన అటవీశాఖ అధికారులు
- అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌కు ఫిర్యాదుతో వెలుగులోకి..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
మెట్లపల్లి అడవిలో గుట్టుగా జరిగిన గ్రావెల్ తవ్వకాల బాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎకరం పైగా అటవీ విస్తీర్ణంలో గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. సరిగ్గా ఈ ఏడాది జూన్, జూలైల మధ్యలో ఈ అక్రమ తవ్వకాలు జరిగినట్టు తెలుస్తోంది. అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ (పీసీసీఎఫ్)కు ఫిర్యాదు అందటంతో ఈ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. అటవీశాఖ అధికారుల సహాయ సహకారాలతోనే ఈ అక్రమ తవ్వకాలు జరిగినట్టుగా తెలుస్తోంది. మెట్లపల్లి అడవిలో జరిగిన అక్రమ తవ్వకాలు బయటకు వెలుగు చూడకుండా అటవీశాఖాధికారులు జాగ్రత్తలు పడ్డారు. తొలుత మెట్లపల్లి గ్రామస్థులు ఈ అక్రమ తవ్వకాలను గుర్తించి అడ్డుకున్నారు. అడవిలోనే అనధికార క్వారీ ఏర్పాటు చేసి గ్రావెల్‌ను తరలిస్తుండటంతో స్థానికులు నిఘా పెట్టారు. మొత్తం ఎనిమిది ట్రాక్టర్లు, రెండు జేసీబీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అప్పట్లో గార్డుకు అప్పగించారు. ఆ తర్వాత పైస్థాయిలో ఏ అధికారిణి నుంచి ఆదేశాలు వచ్చాయో తెలియదు కానీ వాటిని వదిలేశారు. స్థానికులు గమనిస్తున్నారన్న ఉద్దేశ్యంతో రాత్రుళ్లు తవ్వకాలకు తెరలేపారు. దీంతో మెట్లపల్లి అడవిలో పెద్ద ఎత్తున గ్రావెల్ తోలకం జరిగింది. గ్రావెల్ అక్రమార్కులు ఎవరన్నది సస్పెన్స్‌గా మారింది. వేళ్లన్నీ అటవీశాఖ అధికారులవైపే చూపిస్తున్నాయి. గ్రావెల్ అక్రమ తవ్వకాల వెనుక అటవీ అధికారులే చక్రం తిప్పారన్న చర్చ నడుస్తోంది. మెట్లపల్లి అటవీ ప్రాంతం వీరపనేనిగూడెం పరిశ్రమల ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. అప్పట్లో కంపెనీల అవసరాలకు పెద్ద ఎత్తున గ్రావెల్‌ను తరలించినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో అవసరం ఉన్న చోట డిమాండ్‌ను బట్టి విక్రయించినట్టుగా సమాచారం. చిన్న, మధ్య తరహా నాన్ లే అవుట్లకు కూడా ఇక్కడి నుంచే గ్రావెల్ అనధికారికంగా తరలివెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రుళ్లు భారీగా మెట్లపల్లి అడవిలో గ్రావెల్‌ను తవ్వుతున్నారన్న సమాచారంతో స్థానికులు నిఘా పెడుతుండటంతో అక్రమ తవ్వకాలు ఆగిపోయాయి.
జామాయిల్ మొక్కల నరికివేత
మెట్లపల్లి అడవిలో మరో దారుణం చోటు చేసుకుంది. అడవిలో ఉన్న జామాయిల్ చెట్లను కూడా అదే సమయంలో భారీగా నరికివేతకు పాల్పడిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అడవిని పరిరక్షించాల్సినవారే జామాయిల్ మొక్కలను నరికివేయించారన్న విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. వందల ట్రక్కులలో జామాయిల్ కలపను గుట్టుగా తరలించినట్టు తెలుస్తోంది. జామాయిల్ మొక్కలను నరికిన తర్వాత.. వాటికి చిగుళ్లు వచ్చి పెరిగిన తర్వాత వాటి కర్రలను కూడా నరికించి భారీగా తరలించటం తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది.
మొక్కలు నాటడంలోనూ అక్రమాలు
మెట్లపల్లి అటవీ ప్రాంతంలో అరణ్యాన్ని పెంచటం కోసం మొక్కలు నాటే కార్యక్రమానికి అటవీశాఖాధికారులు శ్రీకారం చుట్టారు. మొక్కలైతే నాటారు కానీ, ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. మొక్కలను కూలీల చేత నాటించాలని నిర్దేశించగా.. అటవీశాఖాధికారులు మాత్రం ప్రొక్లెయిన్లు తెప్పించి నాటించారు. ప్రొక్లెయిన్ల కారణంగా ఖర్చు తక్కువ అవుతుంది. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. రికార్డులలో మాత్రం కూలీలతో పనిచేయించినట్టుగా చూపించినట్టు తెలుస్తోంది. నిర్దేశించిన మొక్కలు ఎన్ని నాటారన్నదానిపైనా అనేక విమర్శలు ఉన్నాయి. కాగా, గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ఓ వైపు విచారణ నడుస్తుంటే.. మరో వైపు అధికార యంత్రాంగం ఇలా చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.