Bapatla: గ్రానైట్ సమస్యకు పరిష్కారం
ABN , Publish Date - Dec 03 , 2025 | 06:13 AM
మైనింగ్ సీనరేజీ చెల్లింపులపై గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు, కార్మికులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం లభించింది.
సీనరేజ్‌పై అపోహలను తొలగించిన ఏఎంఆర్ సంస్థ
బాపట్ల, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): మైనింగ్ సీనరేజీ చెల్లింపులపై గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు, కార్మికులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం లభించింది. సీనరేజీ వసూలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఆందోళన చేస్తున్న వారితో సానుకూల వాతావరణంలో చర్చలు జరపారు. దీంతో సమస్య కొలిక్కి వచ్చింది. గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు, కార్మికులతో పాటు బల్లికురవ మండల పరిధిలోని రైతులు కూడా కొన్ని అంశాలను ఏఎంఆర్ దృష్టికి తెచ్చారు. వాటి విషయంలో కూడా సంస్థ ప్రతినిధులు సానుకూలంగానే స్పందించారు. దీంతో వివాదం ముగిసింది. గతంలో ప్రకాశం జిల్లా పరిధిలోని చీమకుర్తి ప్రాంతంలో కూడా కొన్ని అభ్యంతరాలను అక్కడి గ్రానైట్ ఫ్యాక్టరీల నిర్వాహకులు ఏఎంఆర్ సంస్థ దృష్టికి తెచ్చారు. వాటిని వారికి ఆమోదయోగ్యంగా పరిష్కరించారు. ప్రస్తుత ఆందోళనల అంశం సంస్థ దృష్టికి రాగానే తమ ప్రతినిధుల ద్వారా చర్చలు జరిపి రోజుల వ్యవధిలోనే సమస్యకు ముగింపు పలికింది. సీనరేజీ వసూలుకు సంబంధించి నెలకొన్న అపోహలపై ఏఎంఆర్ సంస్థ వారికి స్పష్టత ఇచ్చింది. సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం దొరికిందని బాపట్ల జిల్లా మైనింగ్ విభాగం అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో ధ్రువీకరించారు.