Share News

Granite Factory Owner: వైసీపీ ఎమ్మెల్సీ దౌర్జన్యాన్ని అడ్డుకోండి

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:20 AM

రెండు గ్రానైట్‌ ఫ్యాక్టరీలను లీజుకు తీసుకుని రెండేళ్లయినా వాటికి అద్దె ఇవ్వడం లేదని, అడిగితే బెదిరిస్తున్నారంటూ సంతమాగులూరుకు చెందిన వేముల మల్లికార్జున...

Granite Factory Owner: వైసీపీ ఎమ్మెల్సీ దౌర్జన్యాన్ని అడ్డుకోండి

  • రెండేళ్లయినా లీజు డబ్బులు ఇవ్వలేదు.. కలెక్టరేట్‌ ఎదుట బాధితుడి ఆందోళన

బాపట్ల, జూలై 28(ఆంధ్రజ్యోతి): రెండు గ్రానైట్‌ ఫ్యాక్టరీలను లీజుకు తీసుకుని రెండేళ్లయినా వాటికి అద్దె ఇవ్వడం లేదని, అడిగితే బెదిరిస్తున్నారంటూ సంతమాగులూరుకు చెందిన వేముల మల్లికార్జున సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం మార్టూరుకు చెందిన మల్లికార్జునకు సంతమాగులూరులో రెండు గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిని 2022లో విశ్రాంత డీఐజీ, వైసీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం లీజుకు తీసుకున్నారు. అప్పటి నుంచి లీజు డబ్బులు ఇవ్వడంలేదని, అడిగితే ‘నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. రెండు ఫ్యాక్టరీలను రెండున్నర కోట్లకు ఇచ్చెయ్‌’ అని బెదిరిస్తున్నారని చెప్పారు. రూ. 6 కోట్ల విలువైన ఫ్యాక్టరీలను తక్కువకు ఎలా ఇస్తానని వాపోయారు. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు.

Updated Date - Jul 29 , 2025 | 05:21 AM