Grand Vinayaka Immersion: గల్ఫ్‌లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:17 AM
గల్ఫ్‌లో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుబాయ్‌లో మినీ భారత్‌గా పిలిచే సోనాపూర్‌లో..
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): గల్ఫ్‌లో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుబాయ్‌లో మినీ భారత్‌గా పిలిచే సోనాపూర్‌లో పదేళ్లుగా వినాయకచవితి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ప్రముఖ భారీ యంత్రాల సంస్థ కార్మికుల క్యాంప్ ఆవరణలో ఏర్పాటుచేసిన ఏకదంతుని విగ్రహాన్ని రోజూ వేలాది మంది భక్తులు సందర్శించుకుని పూజలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ప్రవాసీయుల ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాల వారితో సహా మొత్తం పది వేల మంది పాల్గొన్నట్టు కార్యక్రమ నిర్వాహకుడైన తాడేపల్లిగూడెం మండలం దర్శిపురానికి చెందిన పంతం సుబ్బరాజు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ నాజర్, అరబ్బుల సహాయంతో తమ జిల్లా వాసులు పదేళ్లుగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రవాసుల సహకారం కూడా మరువలేనిదన్నారు. ఇక.. సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లో నిడదవోలు నియోజకవర్గానికి చెందిన యోగేశ్వరరావు.. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన అనేక మంది భక్తుల సమక్షంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.