Investment Summit: చకచకా సన్నాహాలు
ABN , Publish Date - Nov 08 , 2025 | 04:39 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు (పార్టనర్‌షిప్ సమ్మిట్) చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.
విశాఖలో 14,15 తేదీల్లో పెట్టుబడుల సదస్సు
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
దానికి తగినట్టే భారీగా ఏర్పాట్లు
ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో 8 హాళ్లు
సదస్సు ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి
వేదిక వద్ద సీఎం, కేంద్ర వాణిజ్యమంత్రికి చాంబర్లు
33 దేశాల నుంచి వాణిజ్య మంత్రుల రాక
ఇప్పటికే వెయ్యి మంది ప్రతినిధుల రిజిస్ర్టేషన్
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు (పార్టనర్‌షిప్ సమ్మిట్) చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పెట్టుబడుల కోసం తొలిసారిగా నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో సీఎం చంద్రబాబు ఈ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఇక్కడ ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటివరకూ 1,000 మంది డెలిగేట్లు రిజిస్టర్ చేసుకున్నారు. రెండు వేల మంది వరకూ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్‌తోపాటు 33 దేశాల నుంచి వాణిజ్య మంత్రులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఆస్ట్రేలియా, సౌదీ అరేబియాతోపాటు మరికొన్ని దేశాల నుంచి వాణిజ్య మంత్రిత్వ శాఖల బృందాలు రానున్నాయి. సదస్సు ముందురోజు, ఈనెల 13వ తేదీన నోవాటెల్ హోటల్‌లో అతిథులకు ముఖ్యమంత్రి విందు ఇవ్వనున్నారు. ఈనెల 14వ తేదీన సదస్సును ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, పలు శాఖల ఉన్నతాధికారులు రానున్నారు.
1600 మంది కూర్చునేలా ప్రధాన హాలు
సదస్సు కోసం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మొత్తం ఎనిమిది హాళ్లు ఏర్పాటుచేస్తున్నారు. మొదటి హాలులో డెలిగేట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతారు. రెండో హాలును వివిధ కంపెనీలు, ప్రభుత్వ శాఖల స్టాళ్ల ఏర్పాటుకు, మూడో హాలును డెలిగేట్లకు భోజన ఏర్పాట్లకు కేటాయించారు. నాలుగో హాలులో మూడు మినీ హాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ డెలిగేట్లతో ప్రభుత్వ ప్రతినిధుల ముఖాముఖి భేటీలు ఉంటాయి. ఐదో హాలులో ప్రధాన వేదికను 1,600 మంది ప్రతినిధులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరో హాలులో సీఎం లాంజ్, భద్రతా, ఇతర సిబ్బందికి గదులు, ఏడో హాలులో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూశ్ గోయల్‌కు లాంజ్ ఏర్పాటుచేస్తున్నారు. ఎనిమిదో హాలు ఉపరాష్ట్రపతి కోసం కేటాయించారు.
హోటళ్ల బుకింగ్, 40 ఆడి, బీఎండబ్ల్యూ, బెంజ్‌లు
సదస్సుకు వచ్చే ప్రముఖులు, ఉన్నతాధికారులు, విదేశీ ప్రతినిధుల కోసం ఇప్పటివరకూ విశాఖ నగరంలో 1,200 గదులు రిజర్వు చేశారు. అయితే మరింతమంది వచ్చే అవకాశం ఉన్నందున మరికొన్ని హోటళ్లలో కూడా గదులను బుక్ చేస్తున్నారు. అతిథులు, ఇతర ప్రముఖుల కోసం సుమారు 40 వరకు బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి కార్లు సిద్ధం చేస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రముఖులు, డెలిగేట్లు, ప్రజాప్రతినిధులు, అధికారులకు వేర్వేరుగా పాస్‌లు సిద్ధం చేస్తున్నారు. కాగా, సదస్సును నిర్వహించే ప్రాంగణంలో వేదికలు, హాళ్లు సిద్ధమైన తరువాత ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు.