Sri Rama temple: భద్రాద్రిలో కల్యాణ రాముడికి ఘనంగా మహాపట్టాభిషేకం
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:44 AM
భద్రాచలంలో శ్రీరామునికి వైభవంగా మహాపట్టాభిషేకం నిర్వహించారు. బంగారు పాదుకలతో మొదలై, రాజఖడ్గం, కిరీటం సమర్పణతో ముగిసిన ఈ ఉత్సవం భక్తులను కట్టిపడేసింది.
భద్రాచలం, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): భద్రాచల పుణ్యక్షేత్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారికి అత్యంత వైభవంగా మహాపట్టాభిషేకం నిర్వహించారు. ముందుగా శ్రీరాముడి బంగారు పాదుకలను భక్తులకు చూపించి, సమర్పించారు. ఆ తర్వాత రాజదండం, రాజముద్రిక, రామదాసు చేయించిన పచ్చల పతకం శ్రీరాముడికి, చింతాకు పతకం సీతమ్మకు, శ్రీరామమాడను లక్ష్మణుడికి అలంకరించారు. అనంతరం చామరం, బంగారు ఛత్రం, దుష్ట శిక్షణ కోసం రాజఖడ్గాన్ని రామయ్యకు అందజేశారు. చివరగా పట్టాభిషేక ముగింపుగా సామ్రాట్ కిరీటాన్ని శ్రీరాముడికి ధరింపజేశారు.
శ్రీవారి ఆలయంలోనూ
తిరుమల, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ చేపట్టారు.