Share News

Grand Nakshatra Vanamahotsavam: బొప్పూడిలో ఘనంగా నక్షత్ర వనమహోత్సవం

ABN , Publish Date - Oct 06 , 2025 | 02:56 AM

నక్షత్రవనం అనేది భారతీయ జ్యోతిషశాస్త్రంలో అశ్వని నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలకు సంబంధించిన 27 చెట్ల సముదాయమని హైకోర్టు న్యాయమూర్తి,....

Grand Nakshatra Vanamahotsavam: బొప్పూడిలో ఘనంగా నక్షత్ర వనమహోత్సవం

  • పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు

చిలకలూరిపేట, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): నక్షత్రవనం అనేది భారతీయ జ్యోతిషశాస్త్రంలో అశ్వని నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలకు సంబంధించిన 27 చెట్ల సముదాయమని హైకోర్టు న్యాయమూర్తి, బొప్పూడి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్త బొప్పూడి కృష్ణమోహన్‌ అన్నారు. ఆదివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో నిర్వహించిన నక్షత్ర వనమహోత్సవం ప్రారంభ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. నక్షత్ర వృక్షాలను పెంచడం ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, ఇటువంటి నక్షత్ర వనాలు శృంగేరి పీఠంలో ప్రసిద్ధమని చెప్పారు. అన్ని ప్రసిద్ధ దేవాలయాల్లో నక్షత్ర వనాలు ఉన్నాయని తెలిపారు. బొప్పూడి గ్రామంలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీచెన్నకేశవ స్వామి, శ్రీమల్లేశ్వర స్వామి వార్లకు చెందిన ఒక ఎకరం 20 సెంట్ల భూమిలో చిలకలూరిపేట శ్రీసత్యసాయి సేవా సంస్థ, దేవదాయ, ధర్మాదాయ శాఖ సహకారంతో నక్షత్ర రాశుల వారీగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వై.లక్ష్మణరావు, జస్టిస్‌ అవధానం హరిహరనాధ శర్మ, జస్టిస్‌ ఊటుకూరు శ్రీనివాస్‌, జస్టిస్‌ వి.సుజాత, జస్టిస్‌ ఎన్‌.జయసూర్య, జస్టి్‌స.రవినాథ్‌ తిల్హారీ, జస్టిస్‌ ఏవీ శేషసాయి, గుంటూరు జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి బి.శాయి కళ్యాణ చక్రవర్తి, చిలకలూరిపేట ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి కె.నరేంద్రరెడ్డి, జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా, ఎస్పీ బి.కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2025 | 02:56 AM