Share News

గ్రాండ్‌గా.. భవానీ ద్వీపం ఐకానిక్‌ టవర్‌ ఆధునీకరణ!

ABN , Publish Date - Jun 11 , 2025 | 01:30 AM

పర్యాటక రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చొరవచూపుతోంది. భవానీ ద్వీపానికే ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఐకానిక్‌ టవర్‌ను ఆధునీకరించడానికి నడుం బిగించింది. ఐల్యాండ్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రూ.2.65 కోట్లు కేటాయించింది. దీంతో రంగంలోకి దిగిన భవానీ ఐల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. పర్యాటకుల మనస్సు దోచుకునేలా తీర్చిదిద్దనుంది.

గ్రాండ్‌గా.. భవానీ ద్వీపం ఐకానిక్‌ టవర్‌ ఆధునీకరణ!

- టవర్‌తోనే దీపానికి గుర్తింపు

- వరదల వల్ల అందుబాటులోకి రాని కొత్త టవర్‌

- ద్వీపం రూపు రేఖలు మార్చటానికి ప్రభుత్వం చొరవ

- ఐల్యాండ్‌ ఆధునీకరణకు రూ.2.65 కోట్లు కేటాయింపు

పర్యాటక రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చొరవచూపుతోంది. భవానీ ద్వీపానికే ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఐకానిక్‌ టవర్‌ను ఆధునీకరించడానికి నడుం బిగించింది. ఐల్యాండ్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రూ.2.65 కోట్లు కేటాయించింది. దీంతో రంగంలోకి దిగిన భవానీ ఐల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. పర్యాటకుల మనస్సు దోచుకునేలా తీర్చిదిద్దనుంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

భవానీ ద్వీపం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఐకానిక్‌ టవర్‌. కృష్ణానదిలో సహజసిద్ధంగా ఏర్పడిన భవానీ ద్వీపానికి ఒక గుర్తింపును తీసుకువచ్చింది ఈ టవ రేనని చెప్పాలి. చిన్నారులను అమితంగా ఆకట్టుకున్న ఈ టవర్‌ కారణంగానే భవానీ ద్వీపం సందర్శకులతో కళకళలాడేది. రానురాను భవానీ ద్వీపంలో ఇతర ఆకర్షణలు ఏర్పాటు చేయడం, తరచూ వచ్చే వరదలు టవర్‌కు వెళ్లే మార్గం లేకుండా చేయటంతో కొంత కాలంగా సందర్శకులకు దూరంగా ఉంటుంది. కృష్ణానదిలో బోట్ల మీద ద్వీపానికి వచ్చే వారికి ఈ టవర్‌ కనువిందు చేస్తున్నా.. అక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

రూ.2.65 కోట్లతో మెరుగులు

రాష్ట్ర ప్రభుత్వం భవానీ ఐల్యాండ్‌ను రెన్నోవేషన్‌ చేయటానికి రూ.2.65 కోట్లు కేటాయించిన నేపథ్యంలో భవానీ ద్వీపం ఐకానిక్‌ టవర్‌పై భవానీ ఐల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (బీఐటీసీ) దృష్టి సారించింది. చాలాకాలం నుంచి పర్యాటకులు ఐకానిక్‌ టవర్‌ దగ్గరకు రాలేకపోతుండటంతో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. భారీ వరదలకు భవానీ ద్వీపం కోతకు గురి కాకుండా ఉండటానికి రూ.1.25 కోట్ల వ్యయంతో ముందుగా వరద తాకే ప్రాంతంలో స్టీల్‌ షీట్‌ ఫైలింగ్‌ చేయాలని నిర్ణయించారు. ఈ పనుల కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. టెండర్లను కూడా ఖరారు చేశారు. ఇక పనులు జరగటమే మిగిలి ఉంది. ద్వీపం ఐకానిక్‌ టవర్‌ ప్రాంతంలో కూడా స్టీల్‌ షీట్‌ ఫైలింగ్‌ జరుగుతుంది. ఒకసారి షీట్‌ ఫైలింగ్‌ జరిగాక.. ఇక్కడ మట్టి, ఇసుకను నింపి ఈ ప్రాంతాన్ని ఒక ప్లాట్‌ఫామ్‌లాగా చేస్తారు. ఇలా ప్లాట్‌ఫామ్‌ చేయటం వల్ల సందర్శకులు గతంలో మాదిరిగా టవర్‌ దగ్గర తిరుగాడటానికి అవకాశం కలుగుతుంది. కాంక్రీట్‌తో ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేసిన తర్వాత ఐకాన్‌ టవర్‌ చుట్టూ పర్యాటకులను ఆకర్షించేలా ఫౌంటెయిన్లు ఏర్పాటు చేయనున్నారు.

స్వల్ప మార్పులు..

ఐకానిక్‌ టవర్‌కు భారీ వర్షాలు కురిసినా కూడా రంగు వెలసిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ఐకానిక్‌ టవర్‌లో స్వల్ప మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు. టవర్‌లో కొన్ని భాగాలను తొలగించి అదనపు హంగులను కల్పించనున్నారు. భవానీ ద్వీపం ఐకానిక్‌ టవర్‌ను ద్వీపానికే ప్రత్యేక ఆకర్షణగా నిలపాలని భావిస్తున్నారు. ఐకానిక్‌ టవర్‌తో ప్రారంభించే మార్పులు ఆ తర్వాత క్రమేణా భవానీ ద్వీపం రూపు రేఖలను మార్చేసేలా అధికారులు డిజైన్లు కూడా తయారు చేయించారు. దశల వారీగా పైచిత్రంలో మాదిరిగా భవానీ ద్వీపం కొత్త రూపాన్ని సంతరించుకోనుంది.

Updated Date - Jun 11 , 2025 | 01:30 AM