Minister Nandendla Manohar: సందడిగా స్మార్ట్ కార్డుల పంపిణీ
ABN , Publish Date - Aug 26 , 2025 | 06:27 AM
రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల తొలివిడత పంపిణీ ప్రక్రియ సోమవారం 9 జిల్లాల్లో ప్రారంభమైంది. క్యూఆర్ కోడ్‌తో ఏటీఎం కార్డు సైజులో రూపొందించిన ఈ కార్డులను రాష్ట్రంలో ఉన్న దాదాపు 1.45 కోట్ల రేషన్ లబ్ధిదారులకు....
లాంఛనంగా ప్రారంభించిన నాదెండ్ల
పోరంకిలో ఇంటింటికీ వెళ్లి పంపిణీ
పాల్గొన్న ఎమ్మెల్యే బోడె, ఇతర అధికారులు
తొలివిడత 9 జిల్లాల్లో పంపిణీకి శ్రీకారం
అమరావతి, పెనమలూరు, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల తొలివిడత పంపిణీ ప్రక్రియ సోమవారం 9 జిల్లాల్లో ప్రారంభమైంది. క్యూఆర్ కోడ్‌తో ఏటీఎం కార్డు సైజులో రూపొందించిన ఈ కార్డులను రాష్ట్రంలో ఉన్న దాదాపు 1.45 కోట్ల రేషన్ లబ్ధిదారులకు సెప్టెంబరు 15లోపు 4 విడతలుగా పంపిణీ చేస్తారు. తొలివిడత స్మార్ట్ కార్డుల పంపిణీని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం ఉదయం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో, మధ్యాహ్నం కృష్ణా జిల్లా పెనమలూరులో ప్రారంభించారు. విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఈ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల 29 వరకు సివిల్ సప్లయిస్ అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 53 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ నెల 30 నుంచి రెండో విడత చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో, మూడో విడత సెప్టెంబరు 6 నుంచి అనంతపురం, అల్లూరి, పార్వతీపురం మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేపడతారు. చివరి విడత పంపిణీ సెప్టెంబరు 7నుంచి 15 వరకు జరుగుతుంది.
గుర్తింపు కార్డుగా స్మార్ట్ రేషన్ కార్డు
స్మార్ట్ రైస్ కార్డులు లబ్ధిదారులకు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి మనోహర్ చెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఆయన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి బీజేఆర్ నగర్‌లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్‌గౌర్, జేసీ గీతాంజలి శర్మలతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఈ కార్డులను పంపిణీ చేశారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నాయకత్వంలో ఈ కార్డులకు రూపకల్పన చేశామని తెలిపారు. ఈకార్డు ఒక గుర్తింపు కార్డులా పని చేస్తుందన్నారు. ఉద్యోగరీత్యా గానీ, చదువురీత్యా గానీ ఎక్కడికి వెళ్లినా చౌక ధరల దుకాణాల నుంచి నిత్యావసర సరుకులు పొందే సౌలభ్యం కల్పించామని మంత్రి తెలిపారు. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌కు స్కాన్ చేస్తే లబ్ధిదారు తీసుకొన్న సరుకుల సమాచారం ఫోన్‌లోకి వస్తుందన్నారు. ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు వీలైన సమయంలో రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించామని తెలిపారు. కార్డుపై ఉన్న ఇంటి చిరునామా, కుటుంబ వివరాల మార్పులు, చేర్పుల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే అదే రోజు వారు అప్‌లోడ్ చేస్తారని తెలిపారు. కృష్ణా జిల్లాలో 5,17,825, పెనమలూరు నియోజకవర్గంలో దాదాపు 92 వేల కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు.
కార్డులకు రూ.8 కోట్లు మంజూరు
గత వైసీపీ ప్రభుత్వం ప్రచార పిచ్చితో రేషన్ కార్డులకు కూడా తమ పార్టీ రంగులు పులిమే సి.. వాటిపై జగన్, వైఎస్ బొమ్మ ముద్రించి పంపిణీ చేసింది. వాటి స్థానంలో తెచ్చిన కొత్త స్మార్ట్ కార్డులను ఏటీఎం కార్డు తరహాలో క్యూ ఆర్ కోడ్‌తో రూపకల్పన చేశారు. ఈ కార్డుపై ప్రభుత్వ చిహ్నం, మరోవైపు కార్డుదారు ఫొటో, రేషన్ కార్డు నంబరు, రేషన్‌షాపు నంబరు తదితర వివరాలను ముద్రించారు. ఒక్కో కార్డుకు రూ.4.66 చొప్పున 1,46,21,223 స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రించి, సరఫరా చేసేందుకు చెన్నైకి చెందిన వెర్సటైల్ కార్డ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు లెటర్ ఆఫ్ ఇండెంట్‌ను జారీ చేశా రు. నెలావారీగా కొత్త కార్డులను ముద్రించడంతోపాటు ఇతర ఖర్చులను కూడా కలుపుకొని మొత్తం రూ. 8 కోట్ల మంజూరుకు సివిల్ సప్లయిస్ కమిషనర్ కోరగా, ప్రభుత్వం ఆ మొ త్తాన్ని సోమవారం మంజూరు చేసింది.