Devotional: మంత్రాలయంలో ఘనంగా సప్తరాత్రోత్సవాలు
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:57 AM
గురు రాఘవేంద్ర నమో నమః అంటూ వేలాది మంది భక్తులు రాఘవేంద్రస్వామి సన్నిధిలో తరించారు. రాఘవేంద్రస్వామి 354వ సప్త రాత్రోత్సవాల్లో...
రజత వాహనంపై ప్రహ్లాదరాయల విహారం
మూలరాములకు కనకాభిషేకం
టీటీడీ నుంచి రాఘవరాయుడికి పట్టువస్త్రాలు
మంత్రాలయం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): గురు రాఘవేంద్ర నమో నమః అంటూ వేలాది మంది భక్తులు రాఘవేంద్రస్వామి సన్నిధిలో తరించారు. రాఘవేంద్రస్వామి 354వ సప్త రాత్రోత్సవాల్లో రెండో రోజు శనివారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. మూలరాములకు చేసిన కనకాభిషేకం భక్తులను తన్మయత్వంలో ముంచెత్తింది. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రజత గజ వాహనంపై దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవమూర్తిని ఊంజల సేవలో ఊగిస్తూ పీఠాధిపతి శాఖోత్సవం చేసి మహా మంగళహారతులు ఇచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో మఠం ప్రాంగణం మార్మోగింది. బృందావనాన్ని బంగారు, వెండి, పట్టు వస్త్రాలు, ప్రత్యేక పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. కాగా.. రాఘవేంద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా టీటీడీ నుంచి అధికారికంగా జేఈవో (పేష్కర్) రామకృష్ణ తెచ్చిన పట్టువస్త్రాలు, ప్రసాదాన్ని ముఖద్వారం నుంచి ఏఏవో మాధవశెట్టి, మఠం అధికారులు స్వాగతం పలికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. శ్రీమఠంలో పీఠాధిపతి టీటీడీ పట్టువస్త్రాలను తలపై మోసుకుని వచ్చి బృందావనం ముందు ఉంచి హారతులు ఇచ్చారు. సాయంత్రం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు తెప్పపై విహరించారు. మఠంలోని యోగీంద్ర కళా మండపంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన కళాకారుల నృత్య, సంగీత కచేరి ఆకట్టుకుంది.