Share News

Grand Celebrations Mark Sathya Sai Century: సర్వం సాయినామం

ABN , Publish Date - Nov 20 , 2025 | 05:05 AM

సత్యసాయి శత జయంతి ఉత్సవాలు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైభవంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులతో పుట్టపర్తి కిటకిటలాడుతోంది....

Grand Celebrations Mark Sathya Sai Century: సర్వం సాయినామం

  • పుట్టపర్తిలో మిన్నంటిన సంబరాలు

పుట్టపర్తి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శత జయంతి ఉత్సవాలు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైభవంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులతో పుట్టపర్తి కిటకిటలాడుతోంది. బుధవారం హిల్‌వ్యూ స్టేడియంలో నిర్వహించిన వేడుకలకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌, బాలీవుడ్‌ నటి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తదితరులు హాజరయ్యారు. సత్యసాయి విమానాశ్రయం నుంచి పుట్టపర్తికి, ప్రశాంతి నిలయం నుంచి హిల్‌ వ్యూ స్టేడియానికి ప్రధాని, సీఎం కాన్వాయ్‌ వెళ్తుండగా భక్తులు, ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి అభివాదం చేశారు. సాయిరాం.. సాయిరాం అని నినాదాలు చేశారు. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్‌ మందిరంలో సత్యసాయి మహాసమాధిని మోదీ, చంద్రబాబు, పవన్‌ తదితరులు సందర్శించి పుప్పాంజలి ఘటించారు. వారికి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ స్వాగతం పలికారు. సత్యసాయి సువర్ణ విగ్రహం ఎదుట కూర్చుని ప్రధాని ధ్యానం చేశారు. వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. అనంతరం వందమంది రైతులకు గిర్‌ ఆవులను ప్రధాని పంపిణీ చేశారు.

వేదికపై ప్రముఖులు

ప్రశాంతి నిలయం నుంచి మోదీ, సీఎం చంద్రబాబు హిల్‌వ్యూ స్టేడియానికి చేరుకున్నారు. వేదికపై ప్రధానిని ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు. ప్రధాన వేదికపై మోదీ, చంద్రబాబు, కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, రామ్మోహన్‌నాయుడు, శ్రీనివాసవర్మ, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌, సచిన్‌ టెండూల్కర్‌, ఐశ్వర్యారాయ్‌, ఆర్‌జే రత్నాకర్‌ ఆశీనులయ్యారు. అందరూ కలిసి సత్యసాయి స్మారక నాణేలను, తపాలా బిల్లలను ఆవిష్కరించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 30 లక్షల మందికి సత్యసాయి తాగునీరు అందించడం, ఒడిసాలో వరద బాధితులకు ఇళ్ల నిర్మాణం, ఉచిత విద్య, వైద్య సేవలను తమ ప్రసంగాల్లో ప్రస్తావించారు. సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు 140 దేశాల్లో 2 వేల కేంద్రాల ద్వారా సేవలు అందిస్తోందని, 7.5 లక్షల మంది సేవాదళ్‌ ద్వారా సమాజ సేవకు అంకితమయ్యారని ప్రధాని అభినందించారు.


అన్ని దారులూ హిల్‌ వ్యూ స్టేడియం వైపే..

సత్యసాయి శత జయంతి వేడుకలో పాల్గొనేందుకు దేశ విదేశాలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. హిల్‌ వ్యూ స్టేడియంలో ఉత్సవాలకు బుధవారం తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. పట్టణంలోని అన్ని దారులు స్టేడియంవైపే అన్నట్లు భక్తులు తరలివెళ్లారు. కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ఎస్పీ సతీశ్‌ కుమార్‌ పట్టణంలో ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

హిల్‌వ్యూ స్టేడియంలో సత్యసాయిబాబా జీవిత చరిత్ర, మహిమలు, ఆధ్యాత్మిక, విద్య, వైద్య సేవలకు సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను డిజిటల్‌ స్ర్కీన్స్‌పై ప్రదర్శించారు. సంగీత దర్శకుడు శివమణి డ్రమ్స్‌, గాయకులు సుధ, రఘునాథన్‌ బృందం సంగీత కచేరి భక్తులను అలరించాయి. వసంతలక్ష్మి బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన, శ్రీమతి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల విద్యార్థులు, సత్యసాయి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గుజరాతీ నృత్యం, వర్ద డ్యాన్స్‌తో సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నారు.

Updated Date - Nov 20 , 2025 | 05:05 AM