Vizianagaram: వైభవంగా సిరిమానోత్సవం
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:42 AM
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విజయనగరం పైడిమాంబ సిరిమానోత్సవం మంగళవారం వైభవంగా సాగింది. విజయనగరంతో పాటు పరిసర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ఉత్సవాన్ని తిలకించారు.
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం
విజయనగరం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విజయనగరం పైడిమాంబ సిరిమానోత్సవం మంగళవారం వైభవంగా సాగింది. విజయనగరంతో పాటు పరిసర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ఉత్సవాన్ని తిలకించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. హోంశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత అమ్మవారి ఘటాలను తలపై పెట్టుకుని ఆలయానికి చేరుకున్నారు. వీరి వెంట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. మంగళవారం సాయంత్రం అమ్మవారి చదురు గుడి నుంచి ప్రారంభమైన సిరిమాను.. కోట వరకు మూడు పర్యాయాలు తిరిగింది. ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించి రాజ కుటుంబీకులు, భక్త జనాన్ని ఆశీర్వదించారు. కోట బురుజుపై ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతిరాజు దంపతులు, ఆయన కుమార్తె.. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, ఆనంద గజపతిరాజు సతీమణి సుధా గజపతిరాజు, కుమార్తె ఉర్మిళ గజపతిరాజు తదితరులు సిరిమానోత్సవాన్ని ఆసక్తిగా తిలకించారు.
కుంగిన బొత్స వేదిక
పైడిమాంబ సిరిమానోత్సవాన్ని తిలకిస్తుండగా పాత కో-ఆపరేటివ్ బ్యాంకు ఆవరణలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు కూర్చున్న వేదిక కుంగిపోయింది. వేదిక మీద ఎక్కువమంది కూర్చోవడంతో పాటు వర్షం కారణంగా బల్లలు కుంగిపోయాయి. ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ అశోక్‌తో పాటు, మరో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి.