Tirumala: బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవం
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:52 AM
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ వేడుకల్లో తొలి ఘట్టమైన అంకురార్పణ...
వేడుకలకు వైభవంగా అంకురార్పణ
నేడు ధ్వజారోహణం, పెద్దశేష వాహన సేవ
పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
తిరుమల/తిరుపతి, సెప్టెంబరు23(ఆంధ్రజ్యోతి): అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ వేడుకల్లో తొలి ఘట్టమైన అంకురార్పణ మంగళవారం సాయంత్రం వైభవంగా జరిగింది. బుధవారం ధ్వజారోహణతో పూర్తిస్థాయిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అంకురార్పణలో భాగంగా స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.
బుధవారం సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాల వాహన సేవలు ఆరంభం అవుతాయి. ఆలయంలోని ధ్వజస్తంభానికి గరుడ ధ్వజపటాన్ని అధిష్ఠింపజేసి నలుదిక్కుల నుంచి సకల దేవతలను ఆహ్వానిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుచ్చిలో ఉత్సవర్లతో పాటు అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి, ధ్వజపటాన్ని మాడవీధుల్లో ఊరేగించి ఆలయానికి వేంచేపు చేస్తారు. సాయంత్రం 5.43 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టువస్ర్తాలు సమర్పిస్తారు. రాత్రి 9 గంటలకు పెద్దశేషవాహనంతో మొదలై అక్టోబరు 2న రాత్రి అశ్వ వాహనం వరకు మాడవీధుల్లో వాహనసేవలు కనులపండువగా జరుగనున్నాయి.