ధాన్యం దళారులు!
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:55 AM
ధాన్యం కొనుగోలులో దళారులదే పైచేయిగా సాగుతోంది. రైతు సేవా కేంద్రం సిబ్బందితో కుమ్మక్క బస్తా ధాన్యం ధర రూ.1450 లోపే కొనుగోలు చేస్తున్నారు. గత శనివారం మొవ్వ, మండలం కారకంపాడులో మంత్రి పార్థసారథి పరిశీలనలో వీరి మోసం బట్టబయలైన తీరు మారలేదు. అదే దోరణిలోనే ఇంకా కొనసాగిస్తున్నారు. గూడూరు మండలం తరకటూరులో రూ.1500 మద్దతు ధరకు మిల్లుకు ధాన్యం తెచ్చిన రైతుపై మిల్లు యజమాని చిందులు తొక్కడం వారి దోపిడీ విధానానికి అద్దం పడుతోంది.
- కొనుగోలులో ఆర్‌ఎస్‌కే సిబ్బందితో కుమ్మక్కు
- తేమశాతం, నాణ్యత నిర్ణయించడంలో ఒక్కటే మాట
- నిన్న మంత్రి పార్థసారథి పరిశీలనలో బయటపడ్డ మోసాలు
- అయినా ధాన్యం కొనుగోలులో మారని తీరు
- బస్తా ధాన్యం రూ.1300 నుంచి 1450 లోపే కొనుగోలు
- గూడూరు మండలం తరకటూరులో రైతులపై మిల్లు యజమాని
ధాన్యం కొనుగోలులో దళారులదే పైచేయిగా సాగుతోంది. రైతు సేవా కేంద్రం సిబ్బందితో కుమ్మక్క బస్తా ధాన్యం ధర రూ.1450 లోపే కొనుగోలు చేస్తున్నారు. గత శనివారం మొవ్వ, మండలం కారకంపాడులో మంత్రి పార్థసారథి పరిశీలనలో వీరి మోసం బట్టబయలైన తీరు మారలేదు. అదే దోరణిలోనే ఇంకా కొనసాగిస్తున్నారు. గూడూరు మండలం తరకటూరులో రూ.1500 మద్దతు ధరకు మిల్లుకు ధాన్యం తెచ్చిన రైతుపై మిల్లు యజమాని చిందులు తొక్కడం వారి దోపిడీ విధానానికి అద్దం పడుతోంది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
జిల్లాలో ధాన్యం కొనుగోలు వ్యవహారం దారి తప్పిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 75 కిలోల ధాన్యం బస్తాకు రూ.1,770 మద్దతు ధరగా ప్రకటించింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో యంత్రాల ద్వారా కోసి ధాన్యంలో 17 పాయింట్ల మేర తేమశాతం వచ్చేవరకు రైతులు ఆరబెడుతున్నారు. ఆరబెట్టి రైతు సేవా కేంద్రానికి తీసుకువెళితే ధాన్యంలో నాణ్యత బాగోలేదని, మానుగాయ అధికంగా ఉందని, తప్ప, తాలుశాతం పరిమితికి ఉందని తదితర కారణాలు చూపి ధాన్యం ధరలో కోత పెడుతున్నారు. బస్తా ధాన్యం రూ.1300 నుంచి రూ.1400 కొంటున్నారు. రూ.1500 మించి మద్దతు ధర రాదని తెగేసి చెబుతున్నారు. తేమశాతం నిబంధనలకు అనుగుణంగానే ఉంది కదా అని రైతులు ఆర్‌ఎస్‌కే సిబ్బందిని అడిగితే మేము ఇంతకు మించి ధర ఇవ్వలేమని సమాధానం ఇస్తున్నారు. అయినా సంచులు, వాహనాలు అందుబాటులో లేవని, గ్రామాల్లో ఫలానా వ్యాపారుల వద్దకు వెళితే ధాన్యం కొనుగోలు చేస్తారని చెప్పకనే చెబుతున్నారు. దీంతో ధాన్యం రోజుల తరబడి కాపలా కాయలేక, సంచులు, వాహనాలు సొంతంగా సమకూర్చుకోలేక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు.
మంత్రి పార్థసారథి పరిశీలనలో వెలుగుచూసిన మరిన్ని అంశాలు
ధాన్యం కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులపై మంత్రి కొలుసు పార్థసారథి శనివారం మొవ్వ మండలం కారకంపాడులో ధాన్యం లారీలను ఆపి పరిశీలించిన సమయంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. పెదముత్తేవి గ్రామం నుంచి ధాన్యంతో వస్తున్న మూడు లారీలను ఆయన నిలిపి పరిశీలించిన సమయంలో బస్తా ధాన్యం రూ.1430 మద్దతు ధరగా నిర్ణయించినట్లు వెల్లడైంది. ధాన్యం బాగానే ఉన్నా ఇంత తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేస్తారనే ఆనుమానం వచ్చి ఆయన సాంకేతిక సిబ్బందిని పిలిపించి, అధికారుల సమక్షంలో ధాన్యంలో నాణ్యతను పరిశీలించారు. ధాన్యం పైపొర రంగుమారినా, బియ్యం నాణ్యతగానే ఉన్నాయని సాంకేతిక సిబ్బంది నిర్ధారించారు. ఈ ధాన్యం బస్తాకు రూ.1650 వరకు మద్దతు ధర చెల్లించవచ్చని కూడా వారు పేర్కొన్నారు. దీంతో మంత్రి కొలుసు రైతులను ఇంతగా మోసం చేయడంపై అధికారులపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌కేలలోని సిబ్బంది, దళారులు ఏకమై రైతులను నిలువునా మోసం చేస్తుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కొందరి తీరు కారణంగా రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోందని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. కాగా, మంత్రి రెండు రోజుల పాటు మొవ్వ మండలంలోనే ఉన్నా.. ఈ మండలంలోని మొవ్వ, కారకంపాడు, అయ్యంకి, చినముత్తేవి తదితర గ్రామాల్లో ధాన్యం రహదారులపై రాశుల రూపంలోనే ఉంది. ఈ ధాన్యం కొనుగోలు చేసేందుకు సంచులను సమకూర్చకపోవడం, సంచులలో ఎత్తి ఉన్న ధాన్యం మిల్లులకు తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేయకుండా జాప్యం చేయడం గమనార్హ.ం.
నేను చెప్పాకే మిల్లులోకి రండి..
-రైతులపై మిల్లు యజమాని ఆగ్రహం
గూడూరు మండలం తరకటూరులోని ఒక మిల్లు యజమాని తరకటూరుకు చెందిన రైతులతో అగౌరవంగా మాట్లాడుతున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. తరకటూరుకు చెందిన ఒక రైతు ఆర్‌ఎస్‌కే ద్వారా బస్తా ధాన్యం రూ.1500 మద్దతు ధర చొప్పున 18 క్వింటాళ్లను ట్రాక్ షీట్ జనరేట్ చేసిన తర్వాత మిల్లుకు ట్రాక్టర్ ద్వారా పంపాడు. ఎంతకూ మిల్లు యజమాని ఈ ధాన్యం దిగుమతి చేసుకోకపోవడంతో రైతు మిల్లు వద్దకు వెళ్లి మిల్లు యజమానితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. నా అనుమతి లేకుండా మిల్లులోకి ఎందుకు వచ్చావని, నేను పిలిచే వరకు బయట నిలబడాలని అవమానపరిచేలా మాట్లాడారని సదరు రైతు వాపోయాడు. దళారులు తక్కువ ధరకు పంపిన ధాన్యం మిల్లు వద్దకు వస్తే చకచకా దిగుమతి చేసుకుంటున్నాడని, ఆర్‌ఎస్‌కే ద్వారా వచ్చిన ధాన్యం మాత్రం దిగుమతి చేసుకోకుండా ఆలస్యం చేశాడని రైతు ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న మోసంపై అధికారులు క్షేత్రస్థాయిలో నిఘా ఉంచి, ధాన్యం మద్దతు ధర వచ్చేలా చూడాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.