4 గంటల్లోనే ధాన్యం బిల్లులు
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:47 AM
ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లాలోని ఉయ్యూరు. గూడూరు, మచిలీపట్నంలోని రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే), రైస్‌మిల్లుల్లో ధాన్యం కొనుగోలు నిమిత్తం తీసుకుంటున్న చర్యలను మంత్రి కొల్లు రవీంద్ర, పెడన, పెనమలూరు ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, బోడె ప్రసాద్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఢిల్లీరావు, కలెక్టర్ బాలాజీ, జేసీ నవీన్ తదితరులతో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు. ఉయ్యూరులోని ఆర్‌ఎస్‌కే-2, మచిలీపట్నంలోని సీతారామాంజనేయ రైస్‌మిల్లును సందర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న విధానం, మిల్లులకు ధాన్యం తరలింపు కోసం వాహనాల ఏర్పాటు, ధాన్యం బాయిల్డ్ చేయడం తదితర అంశాలను గమనించారు.
- నిబంధనలకు అనుగుణంగా తేమశాతం ఉంటే మద్దతు ధర
- జిల్లాలో 7.90 లక్షల టన్నుల కొనుగోలుకు ప్రణాళిక
- ఇప్పటికే 40 వేల టన్నుల కొనుగోలు పూర్తి
- ప్రభుత్వానికి మిల్లర్లు సహకరించాలి
- మంత్రి నాదెండ్ల మనోహర్
-మంత్రి రవీంద్రతో కలిసి బిల్లులు, ఆర్‌ఎస్‌కేల తనిఖీ
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లాలోని ఉయ్యూరు. గూడూరు, మచిలీపట్నంలోని రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే), రైస్‌మిల్లుల్లో ధాన్యం కొనుగోలు నిమిత్తం తీసుకుంటున్న చర్యలను మంత్రి కొల్లు రవీంద్ర, పెడన, పెనమలూరు ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, బోడె ప్రసాద్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఢిల్లీరావు, కలెక్టర్ బాలాజీ, జేసీ నవీన్ తదితరులతో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు. ఉయ్యూరులోని ఆర్‌ఎస్‌కే-2, మచిలీపట్నంలోని సీతారామాంజనేయ రైస్‌మిల్లును సందర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న విధానం, మిల్లులకు ధాన్యం తరలింపు కోసం వాహనాల ఏర్పాటు, ధాన్యం బాయిల్డ్ చేయడం తదితర అంశాలను గమనించారు.
సాంకేతిక పరిజ్ఞానంతో కొనుగోళ్లు
ఈ ఏడాది రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మచిలీపట్నం, ఉయ్యూరులో విలేకరులతో మంత్రి మనోహర్ మాట్లాడారు. గతేడాది రైతులు ధాన్యం విక్రయించిన 48 గంటల వ్యవధిలోనే బిల్లుల చెల్లింపులు చేశామన్నారు. ఈ ఏడాది అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కేవలం నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏదైనా కారణాలతో ఆలస్యం జరిగినా 24 గంటల వ్యవధిలోనే పడతాయన్నారు. జిల్లాలో ఈ ఏడాది 7.90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రైతు సేవా కేంద్రాలలో పనిచేస్తున్న సాంకేతిక సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బందులు పడకుండా చూస్తున్నామన్నారు.
తేమశాతం పరిశీలన
గండిగుంట గ్రామానికి చెందిన రైతు సతీష్‌కుమార్ సాగు చేసిన ఎంటీయూ 1262 రకం ధాన్యంలో తేమశాతాన్ని మంత్రి మనోహర్ సమక్షంలో పరిశీలించారు. 15.9 పాయింట్లు వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ధాన్యంలో 17 పాయింట్ల తేమశాతం ఉంటే పూర్తిస్థాయిలో మద్దతు ధర లభిస్తుందన్నారు. ఆర్‌ఎస్‌కేలు, రైస్‌మిల్లుల్లో తేమశాతం కొలిచే యంత్రాలు ఒకే కంపెనీకి చెందినవి పెట్టామని చెప్పారు. తేమశాతంలో తేడాలు రాకుండా, రైతులు నష్టపోకుండా ఆర్‌ఎస్‌కేలు, మిల్లుల్లో ఉన్న తేమశాతం కొలిచే యంత్రాలను బ్లూటూత ద్వారా అనుసంధానం చేశామన్నారు. ధాన్యం రవాణా చేసేందుకు వాహనాలను కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈ ఏడాది 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. 6.52 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచామని తెలిపారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వానికి సహరించాలని కోరారు.
వర్షంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి
ఈ నెల 24, 25 తేదీల్లో వర్షం పడుతుందనే వాతావరణశాఖ హెచ్చరికలు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నాదెండ్ల సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వరి కోతలు పూర్తి చేసి ధాన్యం సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలని చెప్పారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 190 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 5,334 మంది రైతుల నుంచి 40 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి.శివరాంప్రసాద్, ఉయ్యూరు ఆర్డీవో బీఎస్ హేలా షారోన్, మచిలీపట్నం ఆర్డీవో కె.స్వాతి పాల్గొన్నారు.