Resolve Private University Fee Issues: ఫీజు చిక్కులకు చెక్!
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:34 AM
వైసీపీ ప్రభుత్వం చేసిన పొరపాట్లను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోంది. హడావిడిగా ఆనాడు ప్రైవేటు యూనివర్సిటీల చట్టాన్ని సవరించిన జగన్ ప్రభుత్వం, ఫీజుల చెల్లింపుపై....
ప్రైవేటు యూనివర్సిటీ ఫీజులపై త్వరలో జీవో
హడావిడిగా ప్రైవేటు వర్సిటీ చట్టాన్ని సవరించిన వైసీపీ
కానీ, ఫీజులపై స్పష్టత ఇవ్వని నాటి ప్రభుత్వం
ఫీజుల కోసం విద్యార్థులపై వర్సిటీల ఒత్తిడి
ప్రత్యేక ఉత్తర్వు ఇవ్వాలని సర్కారు నిర్ణయం
(అమరావతి, ఆంధ్రజ్యోతి)
వైసీపీ ప్రభుత్వం చేసిన పొరపాట్లను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోంది. హడావిడిగా ఆనాడు ప్రైవేటు యూనివర్సిటీల చట్టాన్ని సవరించిన జగన్ ప్రభుత్వం, ఫీజుల చెల్లింపుపై మాత్రం స్పష్టత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. దానివల్ల నెలకున్న సాంకేతిక సమస్యలకు చెక్ పెట్టాలని నిర్ణయించిన ప్రభు త్వం, త్వరలోనే ప్రత్యేక జీవో జారీచేయాలని నిర్ణయించింది. గత వైసీపీ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల చట్టాన్ని సవరించి 35 శాతం సీట్లను కన్వీనర్ కోటా కిందకు మార్చింది. కానీ ఆ కోటా కింద అడ్మిషన్లు పొందే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుపై స్పష్టత ఇవ్వలేదు. చట్ట సవరణ అనంతరం జారీచేసిన జీవోల్లోనూ ఫీజుల చెల్లింపు గురించి స్పష్టత ఇవ్వలేదు. దీంతో 35 శాతం కోటా సీట్లలో చేరిన విద్యార్థులకు ఫీజుల చెల్లింపులో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఆలస్యంగా పొరపాటును గుర్తించిన నాటి ప్రభుత్వం ఏటా ప్రత్యేకంగా ఫైలు పెట్టి ప్రైవేటు యూనివర్సిటీల విద్యార్థులకు ఫీజులు విడుదల చేస్తోంది. ఈ ఏడాది ఫీజులు విడుదల చేసినప్పుడు ఆ సమస్య మళ్లీ తలెత్తింది. ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీ అనుబంధ కాలేజీల ఖాతాలకు ఫీజులు వెళ్లగా, ప్రైవేటు యూ నివర్సిటీలకు మాత్రం వెళ్లలేదు. దీంతో ప్రైవేటు యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. అమరావతిలోని ఓ ప్రైవేటు యూనివర్సిటీ దీనిపై ఇంకా అత్యుత్సాహం ప్రదర్శించింది. తమ వర్సిటీలో చదివే పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తించదని, అందువల్ల వెంటనే ఫీజులు కట్టాలని ఆ యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు మెయిల్స్ పంపింది. ఇది వివాదంగా మారడంతో మంత్రి లోకేశ్ కార్యాలయం స్పందించింది. ఫీజుల పథకం వర్తించదని ఎవరు చెప్పారంటూ ఆ యూనివర్సిటీ యాజమాన్యాన్ని నిలదీసింది. సమస్యపై దృష్టిపెట్టిన ఉన్నత విద్యాశాఖ, ప్రతిసారీ ఫీజులు విడుదల చేసినప్పుడు ఈ సమస్య తలెత్తకుండా ప్రత్యేకంగా జీవో తీసుకురావాలని నిర్ణయించింది. త్వరలోనే ఈ జీవో విడుదల చేస్తారు.