Share News

CM Chandrababu: ఆ విద్యార్థులకు చికిత్స బాధ్యత ప్రభుత్వానిదే

ABN , Publish Date - Oct 12 , 2025 | 06:41 AM

బీసీ బాలుర వసతి గృహంలో కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స అందించే బాధ్యతను పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

CM Chandrababu: ఆ విద్యార్థులకు చికిత్స బాధ్యత ప్రభుత్వానిదే

  • అన్నపర్రు హాస్టల్‌లో కలుషిత ఆహార ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

  • విద్యార్థులు పూర్తిగా కోలుకునే వరకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయవద్దు

  • వసతి గృహాల్లో శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టాలి

  • నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశం

గుంటూరు మెడికల్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): బీసీ బాలుర వసతి గృహంలో కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స అందించే బాధ్యతను పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందవద్దంటూ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని అన్నపర్రు బీసీ బాలుర వసతి గృహంలో పలువురు విద్యార్థులు కలుషిత ఆహారం కారణంగా ఆసుపత్రిపాలైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. 24 మంది విద్యార్థులు ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఉన్నారని, మెరుగైన చికిత్స కోసం ఒక విద్యార్థిని మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆహారం కలుషితం కావడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. ఆహార పదార్థాల నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, విద్యార్థులు పూర్తిగా కోలుకొనే వరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయవద్దని ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని వసతి గృహాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులందరికీ నాణ్యమైన ఆహారం అందించాలని స్పష్టం చేశారు. తక్షణం అన్ని వసతి గృహాల్లో ప్రత్యేకంగా శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టాలని, పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.

Updated Date - Oct 12 , 2025 | 06:43 AM