Krishna River Probe: మంతెన ఆశ్రమం సహా కృష్ణా ఒడ్డున అక్రమ కట్టడాల నిరోధంలో విఫలం
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:53 AM
కృష్ణా నదీ ఒడ్డున మంతెన ఆశ్రమం సహా అక్రమ కట్టడాలను నిరోధించడంలో విఫలమయ్యారంటూ మాజీ ఇంజనీరుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు

నాటి ఈఈ రవిపై విచారణకు అథారిటీ ఏర్పాటు
జల వనరుల శాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): కృష్ణానది ఒడ్డున నిబంధనలకు విరుద్ధంగా మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం పేరిట నిర్మించిన భారీ భవంతి సహా మరికొన్ని భవన నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ గతంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పనిచేసిన కె.రవిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నదీ పరీవాహక చట్టాలకు విరుద్ధంగా భవనాలు నిర్మించినా వాటిని ఈఈ అడ్డుకోలేదన్న అభియోగాలపె విచారణకు ఎంక్వయిరీ అథారిటీని నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గతేడాది కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద ప్రవాహం నిలిచిపోవడంతో వరద రాజధాని గ్రామాల్లోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జి.సాయిప్రసాద్ ఆ ప్రాంతానికి చేరుకుని చర్యలు చేపట్టారు. బ్యాక్ వాటర్ సమస్యను పరిష్కరించారు. మంత్రి వెళితే తప్ప అక్కడ ఆక్రమణలు బయటపడలేదు. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియ్‌సగా తీసుకుంది. కృష్ణా వరద వెనక్కు వచ్చి గ్రామాల్లోకి చేరడంపై వైసీపీ రాజకీయం చేసింది. అమరావతి నివాస యోగ్యం కాదంటూ ప్రచారం చేసింది. ఈ ప్రచారంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని సర్కారు భావించింది. అక్రమ కట్టడాలను అడ్డుకోవడంలో విఫలమైన నాటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుపై విచారణకు ఆదేశించింది.