AP Govt: మరో 6 ఉమ్మడి జిల్లాల్లో సీనరేజీ కాంట్రాక్టు
ABN , Publish Date - Jul 22 , 2025 | 06:39 AM
రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పూర్తిస్థాయిలో గనుల సీనరేజీ వసూళ్ల కాంట్రాక్టును ప్రైవేటుకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
టెండర్ల ద్వారా ఏజెన్సీల ఎంపిక.. గనుల శాఖకు సర్కారు అనుమతి
అమరావతి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పూర్తిస్థాయిలో గనుల సీనరేజీ వసూళ్ల కాంట్రాక్టును ప్రైవేటుకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గనులశాఖకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. నిజానికి గత వైసీపీ ప్రభుత్వంలో 2021లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఏడు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురంలోనే సీనరేజీ కాంట్రాక్ట్‌ను అమలు చేశారు. మిగిలిన ఆరు జిల్లాలైన విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలులో గనుల శాఖనే సీనరేజీ వసూళ్లు చేసింది. తాజాగా.. ఈ ఆరు జిల్లాల్లో సీనరేజీ వసూళ్లను గనులశాఖ నుంచి తప్పించి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టెండర్ల ద్వారా ప్రైవేటు ఏజెన్సీలను ఎంపిక చేయాలని గనులశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు (జీవో 127) జారీచేశారు. కూటమి ప్రభుత్వం జారీచేసిన జీవో 56, 75ల ఆధారంగా టెండర్ విధివిధానాలు, బేస్‌ప్రైస్ ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు టెండర్ నిబంధనలు రూపొందించాలని గనులశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.