నేడు గవర్నర్ నజీర్ రాక
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:23 AM
కర్నూలు జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం పర్యటించనున్నారు.
ఆర్‌యూలో 4వ కాన్వకేషనకు హాజరు
ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు
కర్నూలు అర్బన, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం పర్యటించనున్నారు. రాయలసీమ యూనివర్సిటీలో నాల్గవ స్నాతకోత్సవం(కాన్వకేషన)తో పాటు నగరంలోని మాంటిస్సోరీ పాఠశాల సిల్వర్‌జూబ్లీ వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతారు. ఈ మేరకు ఏర్పాట్లను జిల్లా అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన, డీఎస్పీ, సీఐలు పరిశీలించారు. రాయలసీమ వర్సిటీ వీసీ వి.వెంకటబసరావు పది రోజులుగా కమిటీలు, ప్రొఫెసర్లతో సమీక్షిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గవర్నర్ రాకతో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ప్రొఫెసర్లు, పోలీసులతో చర్చలు జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి క్యాంప్‌సకు చేరుకునే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థి వెంట మరొకరిని మాత్రమే క్యాంప్‌సలోని అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా స్నాతకోత్సవంలో భాగంగా 75 మందికి గవర్నర్ బంగారు పతకాలను అందజేస్తారు. 60 పీజీ, 15 ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ బంగారు పతకాలను ప్రదానం చేస్తారు. మరికొందరికి డాక్టరేట్, డిగ్రీ పట్టాలను అందజేస్తారు. విద్యార్థుల కోసం ఉదయం 8 గంటల నుంచి రిజిసే్ట్రషన కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. 10 గంటలకు అంతా కాన్వకేషన హాలులో విద్యార్థులు సిద్ధంగా ఉండాలని వర్సిటీ అధికారులు సూచించారు.
గవర్నర్ పర్యటన ఇలా...
ఉదయం 10 గంటలకు విజయవాడలోని రాజ్‌భవన నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బయల్దేరుతారు. అక్కడ ప్రత్యేక విమానం ద్వారా కర్నూలు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి ఎయిర్ పోర్టుకు 10:30కి చేరుకుంటారు. 10:35కు బయలుదేరి రాయలసీమ యూనివర్సీటికి చేరుకుంటారు. 11 నుంచి 12:15 వరకు జరిగే 4వ కాన్వకేషన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:35కు నగర శివారులోని ఇండస్ స్కూల్‌కు, ఆ తర్వాత ఏ.క్యాంప్‌లోని మాంటిస్సోరీ సీనియర్ సెంకండరీ స్కూల్‌కు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 3:30 వరకు జరిగే గోల్డెన జూబ్లీ వేడుకలకు హాజరై ప్రసంగిస్తారు. అనంతరం 4:30కు బయల్దేరి ఓర్వకల్లు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4:45కు విజయవాడ పయనమవుతారు.