Minister Nadendla Manohar: పండుగ వాతావరణంలో ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Nov 25 , 2025 | 06:20 AM
రాష్ట్రంలో పండుగ వాతావరణంలో ఖరీఫ్ ధాన్యం సేకరణ జరుగుతోందని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
రాష్ట్రంలో 51 లక్షల టన్నుల సేకరణకు నిర్ణయం
ఇప్పటికే 14 లక్షల టన్నుల సేకరణ
ఆందోళన వద్దు.. 28 తర్వాతే వర్షాలు!
రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా
రాజమహేంద్రవరం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పండుగ వాతావరణంలో ఖరీఫ్ ధాన్యం సేకరణ జరుగుతోందని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో తొలిసారి 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇదొక చరిత్ర అని తెలిపారు. ఇప్పటికే 14 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేశ్‌తో కలసి సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. చాగల్లు, కొవ్వూరు ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు విధానాన్ని పరిశీలించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తోందన్నారు. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి అన్నపూర్ణగా కీర్తి తెచ్చాయని చెప్పారు. అటువంటి అన్నదాతల కోసం ధాన్యం కొనుగోలు చేసిన 4 లేదా 5 గంటల్లోపే డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 4.9 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా, అందులో 4 టన్నులు కొనుగోలు చేస్తున్నామని, ఇప్పటికే 1.35 లక్షల టన్నులు కొనుగోలు చేసి, రూ.400 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.
రవాణా, గోనె సంచుల విషయంలో ఎక్కడ పొరపాటు దొర్లినా వెంటనే సమస్యను లోతుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నామన్నారు. 17 శాతం తేమ విషయంలో అధికారులు సక్రమంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈనెల 28, 29వ తేదీల తర్వాతే వర్షాలు పడే అవకాశం ఉందని, రైతులు ఆందోళన చెందకుండా ఒబ్బిడి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలు, లేఅవుట్లలో కూడా ధాన్యం ఎండబోసుకోవచ్చన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుకు పూర్తిగా అండగా ఉంటుంద న్నారు. మంత్రుల వెంట కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.