Coffee Plantation: కాఫీ తోటల రైతులకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Sep 05 , 2025 | 06:15 AM
అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో బెర్రీ బోరర్ తెగులు సోకి నష్టపోతున్న కాఫీ తోటల రైతులను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
పాడేరు, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో బెర్రీ బోరర్ తెగులు సోకి నష్టపోతున్న కాఫీ తోటల రైతులను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. చినలబుడు పంచాయతీ పరిధిలోని పకనకుడి, తురాయిగూడ, మాలిసింగారం, తుడిము, చినలబుడు, మాలివలస గ్రామాల్లో కాఫీ పంటకు బెర్రీ బోరర్ సోకింది. వ్యాధి కారణంగా పంట నష్టపోయిన గిరిజన రైతులకు (దిగుబడిని అంచనా వేసి) కిలోకు రూ.50 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, అధిక మొత్తంలో నష్టపోయిన రైతులకు ఆ పంటను భూమిలో పూడ్చేందుకు (తెగులు వ్యాప్తి చెందకుండా) ఎకరానికి రూ.5 వేలు చొప్పున సాయం అందించనుంది. ఈ సమస్య పరిష్కారానికి కలెక్టర్ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేసింది.