AP Govt: ‘హయగ్రీవ’ భూములు స్వాధీనం
ABN , Publish Date - Mar 12 , 2025 | 05:28 AM
విశాఖలోని ఎండాడలో హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్స్‌కు కేటాయించిన 12.51 ఎకరాలను రెవెన్యూ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ భూములంటూ బోర్డుల ఏర్పాటు
లోపలకు ఎవరూ వెళ్లకుండా ముళ్లకంచె
22-ఏలో చేర్చాలని రిజిస్ట్రార్‌కు ఆదేశం
విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): విశాఖలోని ఎండాడలో హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్స్‌కు కేటాయించిన 12.51 ఎకరాలను రెవెన్యూ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. వృద్ధాశ్రమం నిర్మిస్తామని చెప్పి భూమిని తక్కువ ధరకు తీసుకొని, దానిని ప్లాట్లుగా విభజించి విక్రయించడం, వివరణ కోరితే పొంతన లేని సమాధానం చెప్పడంతో భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ బాధ్యతను భీమిలి ఆర్‌డీవో, విశాఖ రూరల్ తహసీల్దార్లకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అప్పగించారు. వారంతా సిబ్బందితో మంగళవారం ఉదయం ఎండాడలో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అక్కడున్న పనివారిని బయటకు పంపించేశారు. ఆ భూమిలో ‘ఇది ప్రభుత్వ భూమి. ఆక్రమణదారులు శిక్షార్హులు’ అంటూ బోర్టులు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంగణంలోకి వాహనాలు వెళ్లకుండా దారికి అడ్డంగా సిమెంట్ స్తంభాలు పాతించారు. ఆ తరువాత ముళ్ల కంచె ఏర్పాటుచేశారు. అక్కడ కలెక్టర్ ఇచ్చిన నోటీసును గోడకు అతికించారు. ఉద్దేశించిన ప్రయోజనాలకు భూమిని ఉపయోగించకుండా థర్డ్ పార్టీలకు అమ్ముకున్నారని, ఓ వ్యక్తికి 600 గజాల స్థలాన్ని రూ.2.5 కోట్లకు విక్రయించగా, అందులో రూ.1.5 కోట్లు హయగ్రీవ భాగస్వాములకు ముట్టినట్టు తమకు రాతపూర్వక ఫిర్యాదు అందిందని కలెక్టర్ ఆ నోటీసులో పేర్కొన్నారు. అనేక అంశాలపై వివరణ కోరినప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చారని, 61 మంది గ్రూపు డెవల్‌పమెంట్ స్కీమ్ కింద సేల్ డీడ్లు రాశారని, అడిగితే అవి అగ్రిమెంట్లు అని అబద్ధాలు చెప్పారని, అవన్నీ రిజిస్ట్రార్ కార్యాలయంలో లభించిన పత్రాల ద్వారా నిర్ధారించుకున్నామన్నారు. హైకోర్టు తీర్పులు, ప్రభుత్వం ఆదేశం మేరకు భూమిని స్వాధీనం చేసుకుంటున్నామని పేర్కొన్నారు.
సీసీఎల్‌ఏ ఆదేశం మేరకు...
ఎండాడలో హయగ్రీవ భూమిని నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకొని నివేదిక సమర్పించాలని సీసీఎల్‌ఏ ఆదేశించడంతో కలెక్టర్ ఆ బాధ్యతను విశాఖ రూరల్ తహసీల్దార్‌కు అప్పగించారు. ఎండాడ సర్వే నంబరు 92/3లో 12.51 ఎకరాల భూమిని పంచనామా ద్వారా వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం అంతా భీమిలి ఆర్‌డీవో పర్యవేక్షణలో జరగాలని ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా తగిన చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్‌కు ఆదేశించారు. జిల్లా రిజిస్ట్రార్ ఈ భూములను ప్రభుత్వ భూముల జాబితా 22-ఏ(1)(ఏ)లో పెట్టాలని లేఖ రాశారు. ఈ మేరకు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి మంగళవారం సాయంత్రమే మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మెయిల్ పంపించారు. ఆ భూమికి సంబంధించి ఇకపై ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఆ మెయిల్‌లో ఆదేశించారు.