Share News

Kadapa: సజ్జల కబ్జాకు చెక్‌

ABN , Publish Date - May 22 , 2025 | 05:02 AM

కడప జిల్లాలో వైసీపీ నేత సజ్జల కుటుంబం ఆక్రమించిన 63 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ భూముల్లో 52 ఎకరాలు అటవీ భూమి ఉండగా, అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు.

Kadapa: సజ్జల కబ్జాకు చెక్‌

ఆక్రమణ నుంచి 63 ఎకరాలకు విముక్తి

అటవీ భూమి 52 ఎకరాలు.. మిగిలినవి ఇరిగేషన్‌, అసైన్డ్‌ భూములు

వాటి విలువ రూ.220 కోట్లు.. అరటి, బొప్పాయి, జామ సాగు

అక్కడే గెస్ట్‌హౌ్‌సలు, నిర్మాణాలు.. ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో విచారణ

స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు పెట్టిన రెవెన్యూ అధికారులు

కడప, మే 21(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా సీకే దిన్నె మండల పరిధిలో వైసీపీ నేత, జగన్‌ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్‌లోని ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దాదాపు రూ.220 కోట్ల విలువ చేసే 63.72 ఎకరాలను రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు పెట్టారు. ఇందులో 52 ఎకరాల అటవీ భూమి ఉంది. మిగిలినవి ఇరిగేషన్‌, అసైన్డ్‌ భూములు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్‌ ఇదివరకే విచారణ జరిపి నివేదిక పంపారు. సజ్జల కుటుంబ సభ్యులు అటవీశాఖ, ఇరిగేషన్‌, పేదల భూములు కబ్జా చేసినట్టు గుర్తించారు. దీంతో చర్యలకు ఉపక్రమించారు. సర్వే నంబర్‌ 1629లో ఆక్రమణలో ఉన్న 52.42 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఫారెస్టు అధికారిని కడప జిల్లా కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఆదేశించారు. అలాగే సర్వే నం. 1626/1, 2, 27లో అన్యాక్రాంతానికి గురైన భూములు స్వాఽధీనం చేసుకోవాలని జీఎన్‌ఎస్‌ఎస్‌ సూపరింటెండెంట్‌కు, అనుమతి లేకుండా గెస్ట్‌హౌ్‌సలు, ఇతర నిర్మాణాలు చేపట్టినందుకు వాటిపై చర్యలు తీసుకోవాలంటూ సీకేదిన్నె పంచాయతీ కార్యాలయానికి వేర్వేరుగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు సజ్జల ఎస్టేట్‌లోని ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్నారు.


ఏం జరిగిందంటే...: కడప నగరాన్ని ఆనుకుని ఉన్న సీకేదిన్నె మండల పరిధిలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి ఎస్టేట్‌ ఉంది. ఇక్కడ ఆయన సోదరుడు సజ్జల జనార్దనరెడ్డి, అన్న కొడుకు సందీ్‌పరెడ్డి, సజ్జల దివాకర్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పేరిట 137.45 ఎకరాల భూమి ఉంది. సజ్జల సందీ్‌పరెడ్డికి 71.49 ఎకరాలు, సజ్జల జనార్దనరెడ్డికి 16.80 ఎకరాలు, సజ్జల పార్వతికి 0.42 ఎకరాలు, నర్రెడ్డి భాగవతి పేరిట 19.82 ఎకరాలు, ఎదుగూరి సత్య పేరిట 21.40 ఎకరాలు, మరొకరి పేరిట 7.50 ఎకరాలు, ఇంకొకరి పేరిట 0.71 ఎకరాలు.. మొత్తం 137.40 ఎకరాలు ఉంది. ఇదంతా పట్టాభూమి. ఇవన్నీ సర్వే నం. 1559 నుంచి 1627, 1629 వరకు పలు నంబర్లతో ఉన్నాయి. సజ్జల కుటుంబ సభ్యులు ఇవే సర్వే నంబర్లలో అటవీశాఖ భూములతో పాటు ఎస్టీలకు కేటాయించిన భూములను, చెరువు కుంటల భూములు ఆక్రమించేశారు. సర్వే నం.1629లో అటవీ శాఖకు 11,129.33 ఎకరాల భూమి ఉంది. ఇందులో సజ్జల కుటుంబం 52.40 ఎకరాలు ఆక్రమించింది. సొంత భూములలో ఆక్రమించిన భూములు కలిపేసుకుని మొత్తం 201.17 ఎకరాలకు కంచె వేసుకుంది. ఆక్రమిత భూముల్లో అరటి, బొప్పాయి. జామ, ఇతర పంటలు సాగు చేశారు.

1CDP1.jpg

గెస్ట్‌హౌ్‌సలు, అదనపు గదులునిర్మించారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఈ ఏడాది జనవరి 2న ‘రిజర్వు ఫారెస్టులో సజ్జల సామ్రాజ్యం’ అనే కథనం ప్రచురించింది. దీనిపై ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించింది. కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటుచేసి సర్వే చేయించారు.


అణువణువూ సర్వే..: సజ్జల కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగా అటవీ భూములను ఆక్రమించి పర్యావరణానికి, జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగించారని విచారణలో తేలింది. వన్యప్రాణుల ఆవాసాలను ధ్వంసం చేసి వాటి ఉనికికే ముప్పు తెచ్చారు. 52.40 ఎకరాల అటవీ భూమిని, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూములు, వాగులు, వంకలు ఆక్రమించేశారని కమిటీ నిగ్గుతేల్చింది. ఈ వ్యవహారంపై సజ్జల కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించి తప్పుడు సమాచారం ఇచ్చారు. కలెక్టర్‌ శ్రీధర్‌ పకడ్బందీగా, లోతుగా విచారించారు. ఐదు, ఆరుసార్లు జేసీ అదితిసింగ్‌, కడప ఆర్డీవో, అటవీశాఖాధికారులతో కలిసి సజ్జల ఎస్టేట్‌కు వెళ్లి అణువణువునా సర్వే చేయించారు. అయితే అటవీశాఖాధికారులు ఈ భూములు తమవి కావని తప్పించుకునే ప్రయత్నం చేశారు. 1919 అటవీశాఖ గెజిట్‌తో పాటు రికార్డుల ప్రకారం సరిహద్దులు, రెవెన్యూ శాఖ వద్ద ఉన్న పురాతన డేటాను నిపుణులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్షుణ్నంగా శోధించారు. చివరికి సజ్జల ఫ్యామిలీ 63.72 ఎకరాలను కబ్జా చేసినట్లు గుర్తించారు.


ఎస్టీల భూములూ కబ్జా: ఎస్టీల కోసం 1993 నవంబరు 21న అప్పటి ప్రభుత్వం బుక్కే దేవి పేరిట 1.34 ఎకరాలు, బుక్కే లక్ష్మికి 1.30 ఎకరాలు, పాలగిరి కంభక్క పేరిట ఎకరా, పాలగిరి కమాల్‌బీ పేరిట 1.50 ఎకరాలు.. మొత్తం 5.14 ఎకరాలు ఇచ్చింది. ఈ భూమినంతా సజ్జల కుటుంబీకులు తమ ఎస్టేట్‌లో కలిపేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న భూములివే..

కడప జిల్లా సీకేదిన్నె మండలంలో సర్వే నంబర్‌ 1629లో 52.40 ఎకరాల అటవీభూమి

సర్వే నంబర్‌ 1627లో గాలేరు-నగరి ప్రాజ్టెకు పాయవంక కోసం కేటాయించిన 1.05 ఎకరాలు

సర్వే నంబర్‌ 1626/1లో పాయవంక కోసం కేటాయించిన 5.16 ఎకరాలు

సర్వే నంబర్‌ 1626/2లో 1.84 ఎకరాలు

సర్వే నంబర్‌ 1606/3లో 0.82 సెంట్లు అసైన్డ్‌వే్‌స్ట ల్యాండ్‌

సర్వే నంబర్‌ 1612లో 1.25 ఎకరాలు

సర్వే నంబర్‌ 1614/2లో 1.20 ఎకరాల అసైన్డ్‌భూమి


Also Read:

Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు

Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి

Updated Date - May 22 , 2025 | 05:02 AM