Share News

Science Tour: ప్రభుత్వ బడి నుంచి విమానంలో విజ్ఞాన యాత్ర

ABN , Publish Date - Nov 06 , 2025 | 04:06 AM

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతిభగల విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ అరుదైన అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఇద్దరు చొప్పున 52 మంది విద్యార్థులను సైన్స్‌ ఎక్స్‌పోజర్‌ టూర్‌లో భాగంగా ఢిల్లీకి పంపనుంది.

Science Tour: ప్రభుత్వ బడి  నుంచి విమానంలో విజ్ఞాన యాత్ర

  • సైన్స్‌ టూర్‌కు 52 మంది.. పర్యటనలో రష్యన్‌ హౌస్‌ సందర్శన

వీళ్లంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ మంచి ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులు. జిల్లాకు ఇద్దరు చొప్పున మొత్తం 52 మందిని ఎంపిక చేసి ఇలా విమానంలో ఢిల్లీకి సైన్స్‌ టూర్‌కు పంపారు.

అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతిభగల విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ అరుదైన అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఇద్దరు చొప్పున 52 మంది విద్యార్థులను సైన్స్‌ ఎక్స్‌పోజర్‌ టూర్‌లో భాగంగా ఢిల్లీకి పంపనుంది. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ పర్యటన సాగుతుంది. ఏపీ సైన్స్‌ సిటీ, సమగ్రశిక్ష సంయుక్తంగా ఈ పర్యటనను చూస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ సైన్స్‌ టెక్నాలజీ ఇంజనీరింగ్‌ అండ్‌ మాథమాటిక్స్‌(స్టెమ్‌) నిపుణులను కలిసి అనుభవపూర్వకంగా అవగాహన పెంచుకునే అవకాశం కలిగించాయి. విద్యార్థులు మొదటి రోజు ఢిల్లీలోని రష్యన్‌ సెంటర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ కల్చర్‌(రష్యన్‌ హౌస్‌)ను సందర్శిస్తారు. ఇండో- రష్యన్‌ స్పేస్‌ సమన్వయంపై ప్రత్యేక సెషన్‌ ఉంటుంది. స్పుత్నిక్‌పై ఫిల్మ్‌ ప్రదర్శన, ఇండో- రష్యన్‌ స్పేస్‌ ఫ్రెండ్‌షి్‌పపై పోటీలు ఉంటాయి. రెండో రోజు... నేషనల్‌ సైన్స్‌ మ్యూజియంను సందర్శిస్తారు. రాకెట్రీ వర్క్‌షా్‌పలో పాల్గొంటారు. రాకెట్‌ డిజైన్‌, ప్రొపల్షన్‌, శాటిలైట్‌ లాంచ్‌పై ఇందులో చర్చ జరుగుతుంది. మోడల్‌ రాకెట్‌ లాంచ్‌ సెషన్‌లో విద్యార్థులు భాగస్వామ్యం అవుతారు. మూడో రోజు... నెహ్రూ ప్లానిటేరియంను సందర్శిస్తారు. అనంతరం ప్రధానమంత్రి సంగ్రహాలయను సందర్శించి భారత నాయకత్వం, టెక్నాలజీ, సైంటిఫిక్‌ విజన్‌ అంశాల గురించి తెలుసుకుంటారు. విద్యార్థులకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలియజేశారు. క్షేమంగా వెళ్లి విజ్ఞానంతో తిరిగి రావాలని ట్వీట్‌ చేశారు. విద్యార్థులు బుధవారం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

Updated Date - Nov 06 , 2025 | 04:08 AM