Minister Kondapalli Srinivas: ప్రభుత్వ పరిశీలనలో ప్రవాసీ సంక్షేమ కమిటీలు
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:43 AM
దేశంలో కేరళతో సహా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సమగ్ర ప్రవాసీ సంక్షేమ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఏపీలోని ప్రతి జిల్లా కేంద్రంలో...
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి
సౌదీ తెలుగు దినోత్సవంలో వీడియోకాల్ ప్రసంగం
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
దేశంలో కేరళతో సహా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సమగ్ర ప్రవాసీ సంక్షేమ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఏపీలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మండల రెవెన్యూ అదికారి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి.. ప్రత్యేక అధికారిక బృందాల ఆధ్వర్యంలో ప్రవాసీ విభాగాలను నెలకోల్పే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన వెల్లడించారు. సౌదీలోని ప్రఖ్యాత తెలుగు ప్రవాసీ సంఘం.. సాటా సెంట్రల్ శుక్రవారం రాత్రి రియాధ్ నగరంలో నిర్వహించిన తెలుగు దినోత్సవంలో తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా ప్రతినిధులు పీ-4 అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి వీడియో కాల్ ద్వారా సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రవాసీయుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి నుంచీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వెల్లడించారు. సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ప్రవాసాంధ్రులు పీ-4 పథకంలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పీ-4 కమిటీ ఉపాధ్యక్షులు కుటుంబరావు చెరుకూరి, ఏపీ ఎన్నార్టీఎస్ సీఈవో డాక్టర్ పి.కృష్ణమోహన్ పీ-4 పథకంతోపాటు, ప్రవాసీయుల సంక్షేమ విధానాల గురించి వివరించారు. 300కు పైగా మంది ప్రవాసాంధ్రులు పీ-4 పథకంలో మార్గదర్శకులుగా చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు కార్యక్రమ నిర్వహకుల్లో ఒకరైన టీడీపీ నేత, పల్నాడు జిల్లాకు చెందిన షేక్ జానీ బాషా వెల్లడించారు. టీడీపీ నాయకులు రావి రాధాకృష్ణ, ఖలీద్ సైఫుల్లా, రాజశేఖర్ చెన్నుపాటి, సతీశ్‌బాబు చొల్లంగి, అనంత్ శ్రీనివాస్ దాడి, అక్షిత చెన్నుపాటి, శిల్ప గడ్డం నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.