AP Govt: ప్రతి సీసాకూ లెక్క
ABN , Publish Date - Nov 08 , 2025 | 04:25 AM
మద్యం విక్రయాలు, షాపులు, బార్లలో నిల్వ సహా.. వినియోగదారులు కొనుగోలు చేసే సీసాల వరకు ప్రభుత్వం పక్కాగా వ్యవహరించనుంది. ప్రతి దశలోనూ ట్రాకింగ్ విధానాన్ని అమలు చేయాలని సంకల్పించింది.
షాపుల నుంచి వినియోగదారుల వరకు ప్రతి దశలోనూ లిక్కర్ ట్రాకింగ్
మద్యం అమ్మకాల్లో ట్రాక్ అండ్ ట్రేస్..
ప్రస్తుతం డిపోల వరకే ఈ టెక్నాలజీ
త్వరలో పూర్తిస్థాయి డిజిటల్ చెల్లింపులు
రియల్ టైమ్ డేటాపై ఎక్సైజ్ కసరత్తు
అక్రమాలు, నకిలీలకు అడ్డుకట్టే లక్ష్యం
మద్యం విక్రయాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు, నకిలీలను గుర్తించడంతోపాటు అమ్మకాలను పూర్తిస్థాయిలో డిజిటల్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా మద్యం ట్రాకింగ్‌ను మరింత విస్తరించనుంది. ప్రస్తుతం ఎక్సైజ్‌లో డిస్టిలరీ నుంచి మద్యం డిపో వరకు ట్రాకింగ్ విధానం ఉంది. ఇకపై ఆ ట్రాకింగ్‌ను వినియోగదారుడి వరకు తీసుకెళ్లే ప్రయత్నం మొదలుపెట్టింది. తద్వారా నకిలీ మద్యం సహా అక్రమ విక్రయాలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మద్యం విక్రయాలు, షాపులు, బార్లలో నిల్వ సహా.. వినియోగదారులు కొనుగోలు చేసే సీసాల వరకు ప్రభుత్వం పక్కాగా వ్యవహరించనుంది. ప్రతి దశలోనూ ట్రాకింగ్ విధానాన్ని అమలు చేయాలని సంకల్పించింది. ప్రస్తుత విధానంలో మద్యం షాపులు, బార్లు ప్రభుత్వం నుంచి ఎంత మేరకు కొనుగోలు చేస్తున్నాయన్న వివరాలను మాత్రమే తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత వినియోగదారులకు ఎంత విక్రయించారు?. షాపులు, బార్లలో ఎంత స్టాకు మిగిలింది?. అనే వివరాలు ప్రభుత్వానికి తెలియడం లేదు. దీని వల్ల నకిలీ మద్యం సహా అక్రమ విక్రయాలను గుర్తించడం సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇక నుంచి కొత్త విధానం తీసుకురానున్నారు. దీనిద్వారా వినియోగదారులకు ఎంత మద్యం అమ్మారు?. షాపులు మూసేసే సమయానికి ఎంత సరుకు నిల్వ ఉంది?. అనే వివరాలను కూడా రియల్‌టైమ్‌లో తెలుసుకునేలా ‘ట్రాక్ అండ్ ట్రేస్’ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖ ఇటీవల ఓ సమావేశం నిర్వహించింది. ఇప్పటివరకు ‘వశిష్ట’ అనే సంస్థ ఎక్సైజ్‌కు ఆన్‌లైన్ సేవలు అందించింది. ఆ సంస్థ కాలపరిమితి ముగియడంతో ‘ట్రాక్ అండ్ ట్రాస్’ను పూర్తిగా అప్‌డేట్ చేసి, సేవలు అందించేందుకు సంస్థలను ఆహ్వానించింది.
దీనిలో భాగంగా ఇకపై వినియోగదారుడి వరకు అమ్మకాలను ట్రాకింగ్ చేసే విధానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. అయితే, వినియోగదారుల సమాచారం తప్పనిసరిగా తీసుకోవాలా?. లేదా?. అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మద్యం కొనుగోలుదారులు వారి వివరాలను ఇచ్చే అవకాశం తక్కువ. కాబట్టి వ్యక్తిగత వివరాల సేకరణ ఆప్షనల్‌గా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కనీసం ఫోన్ నంబరు అయినా తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అలాగే ఇటీవల తీసుకొచ్చిన ఎక్సైజ్ ‘సురక్ష యాప్’లో సీసాలను స్కాన్ చేసేవారి వివరాలు వచ్చేలా యాప్‌ను రూపొందించారు. స్కాన్ చేసి నకిలీ మద్యం అని ఎవరైనా అని ప్రచారం చేస్తే.. అది నిజమా? కాదా? అనేది ఎక్సైజ్‌కు తెలిసిపోతుంది. నిజంగానే సీసాలు స్కాన్ కాలేదా? అనే వివరాలు కూడా అధికారులకు తెలియనున్నాయి.
పూర్తిస్థాయిలో డిజిటల్ చెల్లింపులు
ప్రస్తుతం షాపులు, బార్లలో డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి కాదు. కానీ, అనధికారికంగా డిజిటల్ చెల్లింపుల సౌకర్యం అందుబాటులో ఉంచాలని ఎక్సైజ్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అయితే, ఇకపై డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని షాపులు, బార్లకు తప్పనిసరి చేయనున్నారు. అన్ని షాపులు, బార్లలో డిజిటల్ పేమెంట్ల విధానం అందుబాటులో ఉంటే వినియోగదారులు నచ్చిన విధంగా నగదు చెల్లిస్తారని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. దీనికోసం ఇటీవల ఓ అధికారుల బృందాన్ని తెలంగాణకు పంపి అధ్యయనం చేయించారు. ఇతర రాష్ర్టాల్లో డిజిటల్ చెల్లింపులను కూడా అధ్యయనం చేసి రాష్ట్రంలో ఉత్తమ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు.
ఇకపై రియల్‌టైమ్ డేటా
కొత్త ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అమల్లోకి వస్తే మద్యం అమ్మకాల్లో వంద శాతం రియల్‌టైమ్ డేటా అందుబాటులోకి వస్తుంది. దానివల్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. ప్రస్తుతం డిస్టిలరీ నుంచి డిపో, అక్కడి నుంచి నుంచి మద్యం షాపు లేదా బార్ వరకు ఎంత స్టాకు సరఫరా చేశారు అనే వివరాలు తెలుస్తాయి. కొత్త విధానంలో షాపు లేదా బార్‌లో ఎంత స్టాకు ఉందో కూడా తెలుస్తుంది. వినియోగదారులు ఎంత మద్యం కొన్నారు? ఏ బ్రాండ్ ఎక్కువగా అమ్ముడవుతోంది?. అనే వివరాలు కూడా క్షణాల్లో తెలిసిపోతాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఏదైనా బ్రాండ్‌తో నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్ముతుంటే ఆ సమాచారం కనిపెట్టడం అధికారులకు సులభం అవుతుంది. స్టాకు షాపుల్లోనే ఉండి, అదే బ్రాండ్ బయట వినియోగదారులు తాగుతుంటే అది ఎక్కడినుంచి వచ్చిందనేది కనిపెట్టడం కూడా సులభతరం అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే నూతన సంవత్సరం, పండగలు, ఇతర వేడుకల సమయంలో నిజంగా వినియోగదారులు ఎంత మద్యం తాగుతున్నారనే వివరాలు కూడా ప్రభుత్వానికి తెలియనున్నాయి.