Share News

కలెక్టరేట్‌కు ప్రభుత్వ కార్యాలయాల పంచాయితీ!

ABN , Publish Date - Nov 07 , 2025 | 01:18 AM

జిల్లాల విభజన జరిగి నాలుగేళ్లుపైనే అయ్యింది. అయినా ఇంత వరకు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు సమకూరలేదు. అద్దె భవనాల్లోనే అధికశాతం ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్నాయి. కొన్నింటిని కలెక్టరేట్‌లోని వివిధ కార్యాలయ భవనాల్లో అప్పట్లో తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. అయితే తాజాగా జిల్లా ప్రణాళిక విభాగం (సీపీవో) కార్యాలయంలో నడుపుతున్న సమాచార, పర్యాటకశాఖ కార్యాలయాలను ఖాళీ చేయించాలని ఆ విభాగం అధికారి పట్టుబట్టారు. దీంతో ఈ పంచాయితీ కలెక్టరేట్‌కు చేరింది.

కలెక్టరేట్‌కు ప్రభుత్వ కార్యాలయాల పంచాయితీ!

- సీపీవో కార్యాలయ భవనంలో సమాచార, పర్యాటకశాఖ కార్యాలయాలు

- వెంటనే ఖాళీ చేయాలని ప్రణాళికా విభాగం అధికారి పట్టు

- ట్రైనీ కలెక్టర్‌ కార్యాలయంలోకి మార్చిన పర్యాటకశాఖ కార్యాలయం

- సమాచారశాఖ కార్యాలయం కూడా ఖాళీ చేయించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి

- వివాదాస్పదంగా ప్రణాళికా విభాగం అధికారి తీరు

- నేటికీ అధికశాతం ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు అద్దె భవనాల్లోనే..

జిల్లాల విభజన జరిగి నాలుగేళ్లుపైనే అయ్యింది. అయినా ఇంత వరకు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు సమకూరలేదు. అద్దె భవనాల్లోనే అధికశాతం ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్నాయి. కొన్నింటిని కలెక్టరేట్‌లోని వివిధ కార్యాలయ భవనాల్లో అప్పట్లో తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. అయితే తాజాగా జిల్లా ప్రణాళిక విభాగం (సీపీవో) కార్యాలయంలో నడుపుతున్న సమాచార, పర్యాటకశాఖ కార్యాలయాలను ఖాళీ చేయించాలని ఆ విభాగం అధికారి పట్టుబట్టారు. దీంతో ఈ పంచాయితీ కలెక్టరేట్‌కు చేరింది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో ప్రణాళికా విభాగం (సీపీవో) కార్యాలయం ఉంది. ఈ కార్యాలయ భవనంలోని రెండు గదుల్లో జిల్లా సమాచారశాఖ కార్యాలయాన్ని అప్పటి కలెక్టర్‌ సూచనలతో పెట్టారు. సీపీవో కార్యాలయంలోని మరో గదిలో జిల్లా పర్యాటకశాఖ కార్యాలయాన్ని కూడా నడుపుతున్నారు. గతంలో పనిచేసిన సీపీవోలు ఈ రెండు కార్యాలయాలు ఇక్కడే ఉన్నా, ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. ఇటీవల బదిలీపై వచ్చిన సీపీవో కొంతకాలంగా ఈ రెండు కార్యాలయాలను ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని కలెక్టర్‌ వద్ద ప్రతిపాదన పెట్టారు. సీపీవో నుంచి ఒత్తిడి అధికం కావడంతో పర్యాటకశాఖ కార్యాలయాన్ని కలెక్టరేట్‌లోని ట్రైనీ కలెక్టర్‌ కార్యాలయంలోకి గురువారం మార్చారు. ఇదిలా ఉంటే సమాచారశాఖ కార్యాలయాన్ని కూడా ఇక్కడి నుంచి మార్చివేయాలని సీపీవో రెండు రోజుల క్రితం కలెక్టర్‌ వద్ద పంచాయితీ పెట్టారు. సీపీవో కార్యాలయం భవనం కిందభాగంలో, పైభాగంలో గదులు ఖాళీగానే ఉన్నా ఇక్కడున్న రెండు ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేయాలని సీపీవో ప్రతిపాదన చేయడం గమనార్హం. విజన్‌-2045లో భాగంగా ఈ భవనంలోని గదుల్లో ఒకటి ఎంపీ విజిట్‌కు వచ్చినపుడు వాడతామని, మరో గదిని మంత్రులు వచ్చినపుడు ఉపయోగిస్తామనే సాకుతో ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేయాలని చెప్పడం విశేషం. ఈ భవనంలోని మరో గదిని సీపీవో రాత్రి సమయంలోనూ ఇక్కడే నివాసం ఉంటూ ఉపయోగించుకుంటున్నాడని సీపీవో కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. సీపీవో కార్యాలయంలోని పర్యాటక, సమాచారశాఖ కార్యాలయాలను ఖాళీ చేయాలనే ప్రతిపాదనలతో ఈ వ్యవహారం తేల్చాలని కలెక్టర్‌ డీఆర్వోకు ఇటీవల పురమాయించారు. సమాచారశాఖకు ట్రెజరీ కార్యాలయం వెనుక భాగంలో ఇచ్చిన భవనంలోని గదికి మరమ్మతులు చేయిస్తే ఉపయోగపడుతుందనే అంశంపై డీఆర్వో ఇటీవల ఇంజనీరింగ్‌ అధికారులను పిలిచి మాట్లాడారు. ఈ భవనానికి మరమ్మతులు చేసినా పనికిరాదని, నూతన భవనం నిర్మాణానికి రూ.50లక్షల వరకు ఖర్చు అవుతుందని ఇంజనీర్‌లు తేల్చిచెప్పారు.

భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసేనా!

జిల్లాల విభజన జరిగిన సమయంలో ప్రభుత్వ స్థలంలో భవన సముదాయాన్ని నిర్మించి, అందులోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలను నడపాలనే ప్రతిపాదన చేశారు. కానీ ఆ ప్రతిపాదనలు కాగితాలను దాటలేదు. దీంతో జిల్లాలో సర్వశిక్ష అభియాన్‌, జిల్లా సహకారశాఖ అధికారి కార్యాలయం, గృహ నిర్మాణశాఖ, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజరు కార్యాలయం, బీసీ కార్పొరేషన్‌, అటవీశాఖ, పరిశ్రమలు, దేవదాయశాఖ, మార్కెటింగ్‌శాఖ, భూగర్భ, గనులశాఖ, ఖనిజశాఖ, భూగర్భ జల అధికారి కార్యాలయం, ఎక్సైజ్‌ విభాగం సూపరింటెండెంట్‌ తదితర కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ, ఈఈ, డీవైఈవో కార్యాలయాలను నోబుల్‌ కళాశాల ఎదురుగా ఉన్న పాత భవనంలో నడుపుతున్నారు. విద్యుతశాఖ ఎస్‌ఈ, ఈఈ కార్యాలయాలను మచిలీపట్నం డివిజన్‌ విద్యుతశాఖ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. జిల్లా విభజన తర్వాత కలెక్టర్‌, జేసీ కార్యాలయాలను కొంత మేర ఆధునీకరించి సరిపెట్టారు. జలవనరులశాఖ ఈఈ కార్యాలయానికి సంబంధించి గుడివాడలో భవనాలు ఉన్నా, విజయవాడలోనే ఈ కార్యాలయం నేటికీ నడపడం గమనార్హం.

ఈ భవనాల నిర్మాణం పూర్తయ్యేనా!

మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్‌ గ్యారేజీ పక్కనే ఉన్న మచిలీపట్నం తహసీల్దార్‌ కార్యాలయం, కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఉన్న మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయాలు బ్రిటిష్‌ వారి కాలంలో నిర్మించినవి కావడంతో శిథిలావస్థకు చేరాయి. 2018, సెప్టెంబరు 28వ తేదీన ఈ రెండు కార్యాలయాలకు నూతన భవనాలను నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. పునాదుల దశ వరకు వీటిని నిర్మించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రెండు కార్యాలయ భవనాల నిర్మాణాన్ని నిలిపివేశారు. తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాలు పల్లపు ప్రాంతంలో ఉండటంతో భారీ వర్షాలు కురిసిన సమయంలో వర్షపు నీరు కార్యాలయాల్లోకి ప్రవేశిస్తోంది. రెండేళ్ల క్రితం మచిలీపట్నం మండలాన్ని నార్త్‌, సౌత మండలాలు విభజించారు. నార్త్‌ మండల కార్యాలయం పాత భవనంలో కొనసాగుతుండగా, సౌత మండల కార్యాలయాన్ని జలవనరులశాఖ అతిథి గృహంలో నడుపుతున్నారు. నిలిచిపోయిన మచిలీపట్నం తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Nov 07 , 2025 | 01:18 AM