ప్రభుత్వ భూములు కబ్జా
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:20 AM
మచిలీపట్నం మండలం చిన్నాపురం పంచాయతీలోని ప్రభుత్వ భూములపై పెద్దల కన్నుపడింది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్న ఈ భూములను ఇటీవల కాలంలో కొందరు కూడబలుక్కుని ఆక్రమించేశారు. భవిష్యత్తులో ప్రజల తాగునీటి అవసరాల కోసం ఉంచిన భూమిని అన్యాక్రాంతం చేయడమే కాకుండా, ఆపై రొయ్యల చెరువులుగా మార్చేసి తమ అనునయులకు అడ్డగోలుగా లీజుకు ఇచ్చేశారు. చిన్నాపురం పంచాయతీలోని కొందరు పెద్దలు తమ అర్థ, అంగ బలాన్ని చూపి అంతా మా ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

- చిన్నాపురంలోని 8 ఎకరాల్లో రొయ్యల చెరువుల తవ్వకం
- రూ.6లక్షలకు అనధికారికంగా లీజుకు కట్టబెట్టేశారు..
- ఇదే భూమిలో 2022లో అమృత సరోవర్ ద్వారా ఉపాధి పనులు
- ప్రభుత్వ భూముల ఆక్రమణ వెనుక పెద్దల హస్తం!
- ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న గ్రామస్తులు
మచిలీపట్నం మండలం చిన్నాపురం పంచాయతీలోని ప్రభుత్వ భూములపై పెద్దల కన్నుపడింది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్న ఈ భూములను ఇటీవల కాలంలో కొందరు కూడబలుక్కుని ఆక్రమించేశారు. భవిష్యత్తులో ప్రజల తాగునీటి అవసరాల కోసం ఉంచిన భూమిని అన్యాక్రాంతం చేయడమే కాకుండా, ఆపై రొయ్యల చెరువులుగా మార్చేసి తమ అనునయులకు అడ్డగోలుగా లీజుకు ఇచ్చేశారు. చిన్నాపురం పంచాయతీలోని కొందరు పెద్దలు తమ అర్థ, అంగ బలాన్ని చూపి అంతా మా ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
మచిలీపట్నం మండలం చిన్నాపురం పంచాయతీ పరిధిలోని పాటిమీద గ్రామం సమీపంలోని తాళ్లకాయశింకు (డ్రెయినేజీ) గట్టు, మచిలీపట్నం-చిన్నాపురం ప్రధాన రహదారి వెంబడి 42 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పదేళ్ల క్రితం ఇందులో ఐదు ఎకరాల భూమిని వేసవిలో పశువుల తాగునీటి అవసరాల కోసం ఉపాధి హామీ పథకం ద్వారా ఊర చెరువును తవ్వారు. ఈ చెరువు పక్కనే తాళ్లకాయశింకు గట్టు పొడవునా ఉన్న ప్రభుత్వ భూమి సంవత్సరాల తరబడి ఖాళీగానే ఉంటోంది. గతంలో ఈ భూమిని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నించడంతో గ్రామస్తులంతా ఐక్యంగా అడ్డుకున్నారు. దీంతో అప్పట్లో అక్రమార్కులు ఈ ప్రయత్నం విరమించారు. ఇటీవల కాలంలో గ్రామంలో శ్మశాన వాటికను మెరక చేసే పేరుతో ఇక్కడ మట్టి తవ్వకాలు ప్రారంభించారు. పగలు కొంత మేర మట్టిని శ్మశానం మెరక చేసేందుకు తరలించి, రాత్రి సమయంలో రొయ్యల చెరువులుగా గుట్టుచప్పుడు కాకుండా మార్చివేశారు. ఇందులో నుంచి కొంతమట్టిని తమ సొంత భూముల మెరక పనులకు కూడా తరలించారు. ఇటీవల కాలంలో చిన్నాపురంలో తాగునీటి అవసరాల కోసం 40 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో తాగునీటి చెరువును తవ్వేందుకు ఈ ప్రభుత్వ భూమినే ఉపయోగించాలనే ప్రతిపాదన ఉంది.
2022లో అమృత సరోవర్ పథకం ద్వారా పనులు
చిన్నాపురం పంచాయతీ పరిధిలోని పాటిమీద గ్రామం సమీపంలోని ప్రభుత్వ భూమిలో కేంద్ర ప్రభుత్వ పథకం అమృత సరోవర్ ద్వారా 2022 మేలో 4.10 ఎకరాల విస్తీర్ణంలో రూ.5.58 లక్షల వ్యయంతో చెరువును తవ్వే పనులు చేశారు. ఈ పనులు చేసినట్లుగా చెరువు వద్ద పూర్తి వివరాలతో శిలాఫలకం కూడా ఏర్పాటు చేశారు. పంచాయతీ ద్వారానే ఈ పనులు చేసినట్లుగాను శిలాఫలకంపై రాశారు. మూడేళ్ల తర్వాత అమృత సరోవర్ పథకం ద్వారా తవ్విన చెరువును, దాని పక్కనే ఉన్న మరో నాలుగు ఎకరాల భూమిని మొత్తంగా ఎనిమిది ఎకరాల భూమిని రెండు రొయ్యల చెరువులుగా రాత్రికిరాత్రే ఇటీవల తవ్వేశారు.
అమృత సరోవర్ ఉద్దేశ్యమిదీ!
అమృత సరోవర్ నిధులతో చెరువును తవ్వితే, చెరువు చుట్టూ గట్ల వెంబడి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసి, పచ్చని చెట్లను నాటి, కాసేపు కూర్చుని సేదతీరేందుకు సిమెంటు బల్లలను వేయాలి. చెరువు వద్ద ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూడాలి. కూటమి ప్రభుత్వం అమృత సరోవర్‌ను పల్లె పుష్కరిణిగా ఇటీవల పేరు మార్పు చేసింది. పాటిమీద చెరువు వద్ద ఇలాంటి ఏర్పాట్లు ఏమీ చేయలేదు. అక్రమంగా చెరువులను తవ్వేసి రొయ్యల చెరువు చుట్టూ ఇతరులు రాకుండా ఉండేలా పరదాలు కట్టారు. ఈ చెరువుల్లో రెండు రోజులుగా మూడు విద్యుత మోటార్ల ద్వారా నీటిని తోడుతున్నారు. నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధుల అండ మాకు ఉందనే ప్రచారం చేస్తున్న కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని రొయ్యల చెరువులుగా మార్పు చేయడం గమనార్హం.
రూ.6 లక్షలకు కట్టబెట్టేశారు!
పాటిమీద గ్రామం సమీపంలోని తాళ్లకాయశింకు గట్టు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను రొయ్యల చెరువులుగా మార్పుచేసే సమయంలో డ్రైనేజీ గట్టును సైతం ఆక్రమించేశారు. దిగువ ప్రాంత రైతులు రహదారిగా వాడుకునే గట్టుపైనా చెరువుకట్టను ఎత్తుగా పోశారు. రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా చెరువులను తవ్వించిన కొందరు పెద్దలు తమ అనునయులకు రూ.6 లక్షల లీజుకు ఈ రెండు చెరువులను కట్టబెట్టినట్లు సమాచారం. చెరువులను లీజుకు తీసుకున్న వ్యక్తి చెరువులను నీటితో నింపుతున్నారు. చెరువులను అక్రమంగా లీజుకు ఇచ్చిన వ్యవహారంపై భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. పంచాయతీ ద్వారా ఈ చెరువులను లీజుకు ఇస్తున్నట్లుగా చూపేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ చెరువులను రెండు సంవత్సరాలకు గాను లీజుకు ఇస్తున్నట్లుగా చూపేందుకు రూ.1.80లక్షలను కనీస వేలం ధరగా నిర్ణయించినట్లు డీఎల్‌పీవో కార్యాలయం నుంచి పత్రాలు తెచ్చారు. కానీ ఈ వేలం పాటను ఎప్పుడు నిర్వహిస్తారు, ఎన్ని సంవత్సరాలకు లీజుకు ఇస్తారనే అంశాన్ని గోప్యంగా ఉంచారు.
పంచాయతీకి ఒక్కరూపాయి చెల్లించలేదు
చిన్నాపురం పంచాయతీలోని అన్ని చెరువులకు సంబంధించి వేలం పాటలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పంచాయతీ సెక్రటరీ రాధాకృష్ణ తెలిపారు. పాటిమీద గ్రామంలోని ప్రభుత్వ భూముల్లోని చెరువులకు సంబంధించిన వేలం పాట నిర్వహించకుండా, పంచాయతీ సిబ్బందికి తెలియకుండా చెరువుల్లోకి నీటిని మోటార్ల ద్వారా నింపుతున్నారు, ఈ చెరువుల లీజుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇంతవరకు పంచాయతీకి చెల్లించలేదని ఆయన చెప్పారు.